
తిరుమల, సాక్షి: తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా మరోసారి విమానాలు వెళ్లడం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం శ్రీవారి ఆలయం మీదుగా మూడు విమానాలు వెళ్లాయి. ఆనంద నిలయం మీదుగా విమానాల సంచారం తిరుమల ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధం. అయినా తరుచుగా విమానాలు, డ్రోన్లు కొండపై కనిపిస్తున్నాయి.
ఇండియా పాక్ యుద్ద వాతావరణం నేపథ్యంలో విమానాలు తిరుమల శ్రీవారి ఆలయం మీదుగా తిరగడంపై టీటీడీ భద్రతా అధికారులు ఆరా తీస్తున్నారు. గురువారం ఉదయం కూడా ఓ విమానం స్వామివారి ఆలయం మీదుగా చక్కర్లు కొట్టింది. ఇప్పటికే తిరుమల ఉగ్రవాదుల హిట్‌లిస్ట్ లో ఉందన్న వార్తల నేపథ్యంలో తరచూ విమానాలు తిరగడం అటు అపచారంతో పాటు ఇటు భక్తుల ఆందోళనకూ కారణమవుతోంది.
ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తిరుమలను నో ప్లైయింగ్ జోన్ గా చెయ్యాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు.