మా భూమి.. మాకే కౌలు

Farmers Fires On TDP Assigned Lands Scam - Sakshi

టీడీపీ పెద్దల అసైన్డ్‌ దగాపై రైతన్నల ఆగ్రహం 

తిరిగిస్తే సాగు చేసుకుంటామని 

సీఆర్‌డీఏ అధికారులకు వినతిపత్రం

సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలు తమను మభ్యపెట్టి కాజేసిన అసైన్డ్‌ భూములను తిరిగి దక్కించుకునేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గతంలోనే పలువురు అసైన్డ్‌ రైతులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా మంగళవారం విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయానికి చేరు­కుని తమకు న్యాయం చేయా­లని డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలు అక్రమంగా దక్కించుకున్న తమ అసైన్డ్‌ భూములను తిరిగి ఇప్పించాలని కోరారు.

అసైన్డ్‌ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం తీసుకుంటుందని బెదిరించి తమ వద్ద నుంచి కాజేశారని సీఆర్‌డీఏ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ భూములను కారుచౌకగా తీసు­కున్న తరువాత టీడీపీ సర్కారు వాటికి ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తుచేశారు.

టీడీపీ నేతలు వాటిని భూసమీకరణ కింద సీఆర్‌డీఏకు ఇచ్చినట్లు చూపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసైన్డ్‌ భూములకు సీఆర్‌డీఏ ఇస్తున్న కౌలును తమకే చెల్లించాలని వినతిపత్రం అందించారు. భూసమీకరణ కింద అసైన్డ్‌ రైతులకు అందిస్తున్న ప్యాకేజీ తమకే ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు.

ఇకనైనా న్యాయం చేయాలి 
‘టీడీపీ ప్రభుత్వం మమ్మ­ల్ని మోసం చేసింది. న్యాయం చేయాలని గతంలో అధికారులను ఎన్ని­సార్లు కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సీఆర్‌డీయే అధికారులకు వినతి పత్రం సమరి్పంచాం.  ప్రభుత్వం స్పందించి మా భూముల కౌలు మాకే ఇప్పించాలని కోరుతున్నాం. 
– టి.బాబూరావు, అసైన్డ్‌ రైతు, రాయపూడి

బెదిరించి తీసుకున్నారు.. 
అసైన్డ్‌ భూమికి పరిహారం ఇవ్వరని టీడీపీ సర్కారు ప్రచారం చేసి మమ్మల్ని మోసం చేసింది. దీంతో భయపడి టీడీపీ నేతలకు అమ్మేందుకు ఒప్పుకున్నాం. కానీ తరువాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇప్పటికీ ఆ భూములు మాపేరునే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. సీఆర్‌డీయే రికార్డుల్లో కూడా వాటిని మా పేరిట మార్చాలని కోరాం.  
– ఆర్‌.పున్నారావు, అసైన్డ్‌ రైతు, రాయపూడి 

మా భూములిస్తే సాగు చేసుకుంటాం 
‘అసైన్డ్‌ భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వదని టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశారు. ఎకరం రూ.కోటి పలికే భూమికి మాకు కేవలం రూ.6 లక్షలే ఇచ్చారు. మేం సంతకాలు చేసిన తరువాత టీడీపీ ప్రభుత్వం అసైన్డ్‌ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రే షన్‌ కాలేదు కాబట్టి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. 
– రేమర్ల కోటేశ్వరరావు, అసైన్డ్‌ రైతు, వెంకటపాలెం

ప్యాకేజీ, కౌలు ఇప్పించండి 
‘మా భూమి పెండింగ్‌ రిజిస్ట్రేషన్‌లో ఉంది. సీఆర్‌డీయే రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి’ 
– వి.నరసింహారావు, అసైన్డ్‌ రైతు, రాయపూడి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top