
రూ.కోట్లు పంచుకు తినేందుకు కూటమి పెద్దల స్కెచ్
కోకో కంపెనీలకు రూ.14.88 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ క్రాప్ డేటా ఆధారంగా రైతుల వద్ద 1,620 టన్నుల కోకో నిల్వలు
సాక్షి, అమరావతి: కోకో గింజలకు తగిన ధర లభించక నష్టాల పాలైన రైతుల నోట్లో మట్టికొట్టిన టీడీపీ కూటమి పెద్దలు, కంపెనీలు కుమ్మక్కై రూ.కోట్లు పంచుకుతినేందుకు స్కెచ్ వేశారు. ప్రస్తుత సీజన్‌లో రైతుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన కోకో ధర కిలో రూ.500 చొప్పున 2,976.76 టన్నులు సేకరించిన కంపెనీలకు కిలోకు రూ.50 ప్రోత్సాహకం కింద రూ.14.88 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
స్వాహా చేసేందుకే..
కోకో గింజలకు నాణ్యతతో సంబంధం లేకుండా 2023–24 సీజన్‌లో కిలో రూ.1,050కు పైగా ధర లభించగా, ప్రస్తుత సీజన్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో రూ.770కు పైగా పలుకుతున్నప్పటికీ కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులకు ధర లేకుండా చేశారు. ప్రీమియం గింజలను సైతం కిలో రూ.300–450కు మించి కొనలేమని చేతులెత్తేశారు. ఆఫ్ సీజన్ (వర్షకాలం పంట) గింజలనైతే కొనే వారే లేకపోవడంతో దళారులకు కిలో రూ.200–250 చొప్పున రైతులు తెగనమ్ముకోవాల్సి వచ్చింది.
రాష్ట్రంలో 1.12 లక్షల ఎకరాల్లో కోకో పంట సాగవుతుండగా.. ఎకరాకు 3–4 క్వింటాళ్ల చొప్పున ప్రస్తుత సీజన్‌లో 12 వేల టన్నుల దిగుబడి వచ్చినట్టు అంచనా. దాదాపు 10 వేల టన్నులకుపైగా రైతులు అయినకాడికి అమ్ముకోగా.. ఈ క్రాప్ డేటా ఆధారంగా రైతుల వద్ద 1,620 టన్నులు కోకో గింజలు ఉండిపోయినట్టు మార్చిలోనే ఉద్యాన శాఖాధికారులు లెక్కతేల్చారు. మద్దతు ధర కల్పించేందుకు రైతులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని కిలో రూ.500 తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామని హామీ ఇచ్చింది.
తమ వద్ద నిల్వలు పేరుకుపోయాయని, ఇప్పుడున్న పరిస్థితుల్లో కొనలేమని, ప్రీమియం గింజలకు కిలోకు రూ.450కు మించి ఇవ్వలేమని కంపెనీలు తెలిపాయి. కిలో రూ.500 చొప్పున రైతులకు చెల్లిస్తే.. రూ.50 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తామని ప్రభుత్వం కంపెనీలకు భరోసా ఇచ్చింది. జూన్ 30 వరకు సేకరించేందుకు వీలుగా మార్గదర్శకాలు జారీ చేసింది. క్రాప్ డేటా ఆధారంగా ఎకరాకు 3 క్వింటాళ్ల సరాసరి దిగుబడులొచ్చినట్టుగా లెక్కతేల్చారు. ఇప్పటివరకు అమ్ముకోగా, రైతుల వద్ద మిగిలిన నిల్వల వివరాలను సమీప రైతు సేవా కేంద్రంలో నమోదు చేసుకుంటే ఆ మేరకు కంపెనీలు కిలో రూ.500 చొప్పున చెల్లిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది.
వాస్తవానికి రైతుల వద్ద 1,620 టన్నుల గింజలున్నాయని ప్రకటించగా, ఆఫ్ సీజన్‌లో ఉన్న నిల్వలు కూడా కలుపుకున్నా 2వేల టన్నులకు మించి ఉండవు. పైగా ఈ నిల్వల్లో కొత్త పంటకు చెందిన నాణ్యమైన గింజలకు మాత్రమే కిలో రూ.500 చొప్పున కొన్ని కంపెనీలు చెల్లించాయి. మరికొన్ని కంపెనీలు కిలో రూ.450కు మించి చెల్లించలేదు. నాణ్యత తక్కువగా ఉన్న గింజలకు దళారులు కిలో రూ.300కు మించి చెల్లించలేదు. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే కంపెనీలు మాత్రం ఏకంగా 2,976.76 టన్నులు సేకరించినట్టు చెప్పడం విస్మయానికి గురిచేస్తోంది.
తొలుత 1,620 టన్నులు మాత్రమే రైతుల వద్ద ఉన్నాయని చెప్పారు. కానీ.. చివరికి వచ్చేసరికి అదనంగా 1356.76 టన్నులు సేకరించినట్టు లెక్కలు చూపుతున్నారు. ఈ గింజలు ఎక్కడ నుంచి వచ్చాయని రైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా సేకరించిన గింజలన్నీ ప్రీమియం గింజలుగానే నమోదు చేశారు. ఆ మేరకు కిలోకు రూ.50 చొప్పున ప్రోత్సాహకం కింద కంపెనీలకు ఇచ్చేందుకు రూ.14.88 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
తొలుత అంచనా వేసిన 1,620 టన్నుల్లో కనీసం 20–30 శాతం గింజలు నాణ్యత లేదనే సాకుతో కిలో రూ.300కు మించి ధర చెల్లించలేదు. అయినా సరే 1,620 టన్నులకు కిలో రూ.50 చొప్పున ప్రోత్సాహకం లెక్కతేల్చినా రూ.8 కోట్లకు మించదు. అలాంటిది ఏకంగా 2,976.76 టన్నులకు రూ.14.88 కోట్లు చెల్లించడం ద్వారా కంపెనీలతో కుమ్మక్కై ఆ మొత్తాలను స్వాహా చేసేందుకు కూటమి పెద్దలు పథకం పన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రైతుల పేరిట కంపెనీలకు దోచిపెట్టేందుకే..
రైతుల నుంచి 2,976 టన్నులు కోకో గింజలను కిలో రూ.500 చొప్పున కంపెనీల ద్వారా కొనుగోలు చేయించినట్టు ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. రైతుల నుంచి 1,620 టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం 2,976 టన్నులు సేకరించినట్టు ప్రకటించింది. ఇప్పటికీ తమ వద్ద ఉన్న టన్నుల కొద్దీ కోకో గింజలు కొనుగోలు చేయడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కంపెనీలు నేటికీ కిలో రూ.450కు మించి చెల్లించడం లేదంటున్నారు. కిలోకు రూ.50 చొప్పున ప్రోత్సాహకం కింద రైతుల తరఫున కంపెనీలకు రూ.14.88 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం విస్మయానికి గురిచేస్తోంది. కొనుగోలు, ప్రోత్సాహకం చెల్లింపుల విషయంలో పారదర్శకత పాటించాలి. – కె.శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, ఏపీ కోకో రైతుల సంఘం