
నల్లబర్లీ కొనకుంటే ఉద్యమం ఉద్ధృతమే
వారంలోపు జీపీఐ కొనాల్సిందే
ప్రభుత్వానికి రైతు నేతల అల్టిమేటం
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : నల్లబర్లీ పొగాకును వారంలోగా జీపీఐ నుంచి కొనకుంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య హెచ్చరించారు. గుంటూరు విద్యానగర్‌లోని జీపీఐ పొగాకు రాష్ట్ర కార్యాలయం వద్ద గురువారం నల్లబర్లీ, తెల్లబర్లీ పొగాకు రైతులతో కలిసి రైతు సంఘం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ పొగాకు కొనకుండా రైతులను మోసం చేస్తున్న ప్రైవేట్ సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బర్లీ పొగాకు వేయాలని ప్రోత్సహించిన జీపీఐ సంస్థతోపాటు ఇతర పొగాకు కంపెనీలు ఇప్పుడు ముఖం చాటేశాయని ధ్వజమెత్తారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ జీపీఐ సంస్థ రైతుల నుంచి పది లక్షల టన్నుల తెల్లబర్లీ పొగాకు కొంటామని, బాండ్లు ఇచ్చి ఇప్పటి వరకు సగం కూడా కొనలేదని మండిపడ్డారు.
కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కె.వి.ప్రసాద్, కొల్లా రాజమోహన్, చుండూరు రంగారావు, కంచుమాటి అజయ్‌కుమార్, రాధాకృష్ణ, వేల్పూరు నరసింహారావు, పచ్చల శివాజీ, ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, రామారావు, జగన్నాథరావు, హనుమరెడ్డి, వేణుగోపాలరావు, నళినికాంత్ పాల్గొన్నారు.
ధర ఇంత అధ్వానమా?
» ఒంగోలు, కనిగిరిలో పొగాకు వేలాన్ని అడ్డుకున్న రైతులు
» పనిగట్టుకుని ధర తగ్గించారంటూ నిరసన
» ఆందోళనను అడ్డుకున్న టీడీపీ మద్దతుదారులు
» వ్యాపారులకు వత్తాసు పలికిన పొగాకు బోర్డు అధికారులు
ఒంగోలు సబర్బన్/కనిగిరి రూరల్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులో గురువారం రైతులు పొగాకు వేలాన్ని అడ్డుకున్నారు. త్రోవగుంటలోని పొగాకు వేలం కేంద్రం–2లో వ్యాపారుల తీరును నిరసిస్తూ బేళ్లను అమ్మేందుకు రైతులు నిరాకరించారు. ఎఫ్–3 రకం పొగాకును రూ.18,500కు కూడా కొనుగోలు చేయక పోవటంతో ఆందోళనకు దిగారు. దీంతో వేలం కేంద్రానికి వచి్చన ఉలిచి, దశరాజుపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ మద్దతుదారులైన కొందరు వేలం జరగాల్సిందేనని వాగ్వాదానికి దిగారు. వేలం కేంద్రంలో కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది.
గిట్టుబాటు ధర కోసం మిగతా రైతులు పోరాటం చేస్తుంటే.. టీడీపీకి చెందిన కొందరు రైతుల పేరుతో దాన్ని అడ్డుకోవటాన్ని ఒంగోలు మండలంలోని రైతులు తీవ్రంగా ఖండించారు. గిట్టుబాటు ధర వస్తే రైతులంతా బాగు పడతారని, అందుకోసం పోరాటం చేయాల్సిందిపోయి.. ఇలా అడ్డుకోవడం తగదని మండిపడ్డారు. వేలం కేంద్రం అధికారిణి తులసి టీడీపీ వర్గీయులకు మద్దతుగా మాట్లాడటంతో రైతులు ఆమె తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
ఏకంగా 186 బేళ్లను రిజెక్ట్ చేయడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వేలం ఇదే విధంగా కొనసాగితే వేలం కేంద్రాలకు పొగాకు బేళ్లు తీసుకు రావటం మానుకుంటామని చెప్పారు. ఇదే అన్యాయం ఇంకా కొనసాగితే పొగాకు బేళ్లను తగలేస్తామన్నారు.
కనిగిరిలోనూ ఆగిన వేలం
ప్రకాశం జిల్లాలోని కనిగిరి పొగాకు వేలం కేంద్రంలో కూడా గురువారం వేలం ఆగిపోయింది. బయ్యర్లు, కంపెనీల ప్రతినిధులు ఎక్కువ శాతం బేళ్లను తిరస్కరించడంతో ఆందోళన చెందిన రైతులు కొద్దిసేపు పొగాకు వేలాన్ని ఆపేశారు. దీంతో వేలం నిర్వహణ అధికారి కోటేశ్వరరావు జోక్యం చేసుకుని రైతులు, కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు.
వారం రోజులుగా పొగాకు బేళ్ల తిరస్కరణలు తీవ్ర స్థాయిలో కొనసాగుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. కనిగిరి కేంద్రంలో గురువారం 164 బేళ్లను తిరస్కరించారు.