ఏపీ మద్యంపై తప్పుడు ప్రచారం 

False propaganda on AP liquor - Sakshi

సోషల్‌ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్‌ దురుద్దేశపూరితం 

ఏపీ మద్యాన్ని ఏ రాష్ట్రానికీ ఎగుమతి చేయడంలేదు 

డిస్టిలరీస్‌ అండ్‌ బ్రూవరీస్‌ కమిషనర్‌ వాసుదేవరెడ్డి 

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో తయారయ్యే మద్యం బ్రాండ్లను తమిళనాడులో అమ్మకుండా ఆ రాష్ట్ర సీఎం స్టాలిన్‌ నిషేధించినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న క్లిప్పింగ్‌ పూర్తిగా అవాస్తవమని డిస్టిలరీస్‌ అండ్‌ బ్రూవరీస్‌ కమిషనర్, ఎపీఎస్‌బీసీఎల్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యం బ్రాండ్లు తమిళనాడు సహా ఏ రాష్ట్రానికీ ఎగుమతి అవడంలేదని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

తమిళనాడుకి మద్యం ఎగుమతులే జరగనప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ మద్యాన్ని నిషేధించే అవకాశమే ఉండదని తెలిపారు. ప్రభుత్వంపై బురదజల్లే దురుద్దేశంతోనే ఈ క్లిప్పింగ్‌ను వాట్సాప్‌ గ్రూపుల్లో పెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో తయారవుతున్న ఐఎంఎఫ్‌ఎల్, బీరు రాష్ట్రంలో మాత్రమే వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని డిస్టిలరీలు, బ్రూవరీల మద్యం ఉత్పత్తిపై ప్రభుత్వ కెమికల్‌ లేబొరేటరీ ఇచ్చిన రిపోర్టులు పరిశీలించిన తర్వాతే వాటిలో ఐఎంఎఫ్‌ఎల్‌ ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. చెన్నై ఎస్‌జీఎస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఇచ్చి న కెమికల్‌ రిపోర్టు కేవలం వారి శాంపిల్స్‌ను పరీక్షించి ఇచ్చినవేనని, ఐఎస్‌ 4449 (విస్కీ), ఐఎస్‌ 4450 (బ్రాందీ)శాంపిల్స్‌ను ఆ సంస్థ పరీక్షించలేదని గతంలోనే తాము స్పష్టం చేసినట్లు తెలిపారు. ఏపీలో తయారయ్యే మద్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.  

    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top