ఇంజినీరింగ్‌ కాలేజీల ‘లీలలు’.. షోకాజ్‌ నోటీసులు జారీ!

Faculty List With Fake Names In Engineering College - Sakshi

అనంతపురం: ఇంజినీరింగ్‌ కళాశాలలు మాయ చేస్తున్నాయి. నిజనిర్ధారణ కమిటీ తనిఖీల్లో అధ్యాపకులు ద్విపాత్రాభినయం బయటపడింది. ఒక్కో అధ్యాపకుడి పేరు రెండు కళాశాలల్లో నమోదు కావడం నివ్వెరపరుస్తోంది. ఇంజినీరింగ్‌ విద్యలో నాణ్యత ప్రమాణాలకు జేఎన్‌టీయూ (ఏ) యాజమాన్యం పెద్ద పీట వేస్తోంది. నిబంధనలు విస్మరిస్తూ, నామమాత్రంగా నడుపుతున్న కళాశాలలపై కన్నెర్ర చేస్తోంది.

బోధన ప్రమాణాలు పాటించకపోవడంతో పాటు తక్కువ అడ్మిషన్లతో నెట్టుకొస్తున్న 30 ఇంజినీరింగ్‌ కళాశాలల గుర్తింపు రద్దు చేయడం యూనివర్సిటీ చరిత్రలో ప్రథమం. అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వసతులు, విద్యార్థి – అధ్యాపక నిష్పత్తి, క్యాంపస్‌ పరిస్థితి, ఆటస్థలం, గ్రంథాలయ సదుపాయం, ల్యాబ్‌ తదితర   అంశాలను యూనివర్సిటీ ఏటా నిజనిర్ధారణ కమిటీల ద్వారా పరిశీలిస్తోంది. ఏ కళాశాలకు ఎన్ని సీట్లు కేటాయించాలనే దానికి కమిటీ నివేదికే ప్రామాణికం.  

నివ్వెరపోయే వాస్తవాలు.. 
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలల యాజమాన్యాల గారడీని నిజనిర్ధారణ కమిటీ తమ పరిశీలనలో బహిర్గతం చేసింది. ఒకే కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడి పేరు మరో ఇంజినీరింగ్‌ కళాశాలలోనూ నమోదైనట్లు గుర్తించింది. ఇలాంటివి 40 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బయటపడ్డాయి. ఒక అధ్యాపకుడు రెండు చోట్ల ఎలా పని చేస్తున్నారో వివరణ ఇవ్వాలని ఆయా కళాశాలలకు షోకాజ్‌లు జారీ చేసింది. 

కొన్ని సబ్జెక్టుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థుల కొరత అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో ఒకరి పేరునే రెండు, మూడు కళాశాలల్లో పనిచేస్తున్నట్లు ఆయా యాజమాన్యాలు చూపించాయి. మరో వైపు కొన్ని కళాశాలల్లో ఫ్యాకల్టీ నియమించుకోకుండా అర్హులైన అధ్యాపకుల పేర్లను మాత్రమే చూపించాయి. పది రోజుల్లో సరైన వివరణ ఇవ్వాలని షోకాజ్‌లో పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top