హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంని ప్రైవేటీ కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ముందుగా హెచ్చరించిన ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య.. అందుకు సమాయత్తమైంది. ఎల్లుండి(సోమవారం) నుంచి ప్రైవేట్ కాలేజీలను నిరవధికంగా బంద్ చేయనున్నట్లు మరోసారి హెచ్చరించింది. ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాకపోవడంతో బంద్‌కు సిద్ధమైంది.
ఈ మేరకు ఉన్నత విద్యా సంస్థ సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు మాట్లాడుతూ.. ‘ గత ఆరు నెలలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి రూ. 1200 కోట్ల బకాయిలు అడిగాం. పెండింగ్ ఉన్న వాటిలో కేవలం 12 శాతం మాత్రమే అడిగాం. కానీ 300 కోట్లు దసరాకి ఇచ్చి మిగతావి పట్టించుకోలేదు. నవంబర్ 1 వరకు ఇవ్వాలని కోరాం. ప్రభుత్వం కనీసం మా గోడు కూడా వినడం లేదు.
అందుకే 3 వ తేదీ నుంచి కాలేజీల నిరవధిక బంద్. మా మీద విజిలెన్స్ విచారణకు ఆదేశం దుర్మార్గం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేపటి వరకు మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యూనివర్సిటీలకు విజ్ఞప్తి చేశాం. లక్ష మంది కాలేజీల స్టాఫ్‌తో హైదరాబాద్‌లో సమావేశం. నవంబర్ 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో చలో హైదరాబాద్. ఒకటి రెండు కాలేజీలకు ఎందుకు బకాయిలు చెల్లించారు..పది పర్సంట్ లంచం తీసుకొని ఇచ్చారా ...?, ఆ కాలేజీలపై విచారణ జరపాలి. అత్యంత ఫ్రాడ్ జరిగే దగ్గర విజిలెన్స్ విచారణ చేయాలి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెబుతున్నాను’ అని రమేష్ బాబు తెలిపారు..


