ఆదివారంలోగా ఫీజు బకాయిలు ఇవ్వకుంటే బంద్ తప్పదు
తెలంగాణ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవటంతో తెలంగాణ ప్రైటు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఏటీహెచ్‌ఏ) ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రైవేటు కళాశాలలను నిరవధికంగా బంద్ చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఫతి చైర్మన్ ఎం రమేశ్‌బాబు శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించేవరకు కళాశాలలను తెరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నెల 6న ప్రైవేటు కాలేజీల్లో పనిచేస్తున్న లక్షన్నర మంది సిబ్బందితో హైదరాబాద్‌లో సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఫీజు బకాయిలు అడిగితే విజిలెన్స్ విచారణకు ఆదేశించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ.900 కోట్లు ఆదివారం సాయంత్రంలోగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచి్చన హామీ ప్రకారం నిధులు విడుదల చేయకుంటే సోమవారం నుంచి బంద్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. పరీక్షలు వాయిదా వేయాలని యూనివర్సిటీలు కోరుతున్నామని చెప్పారు. ఈ నెల 10 లేదా 11న పది లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు.
ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లను, కలెక్టరేట్లను ముట్టడిస్తామని తెలిపారు. రూ.1,200 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరితే ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. ఇప్పటివరకు కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు కలిగే అసౌకర్యానికి క్షమాపణ చెప్పారు. ఈ సమావేశంలో ఫతి సెక్రటరీ జనరల్ కెఎస్.రవికుమార్, వైస్ చైర్మన్ అల్లాపూర్ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.సునీల్ తదితరులు పాల్గొన్నారు.


