భారతీయుల సంతోషాన్ని లాకున్న కోవిడ్‌.. సర్వేలో కీలక విషయాలు

Extreme negative changes in Indians infected with Covid - Sakshi

కోవిడ్‌ సోకిన భారతీయుల్లో తీవ్ర ప్రతికూలమార్పులు 

35 శాతం మందిలో నెగిటివ్‌ ఎమోషన్స్‌ ప్రభావం 

ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, సామాజిక నిబంధనలు, ఒంటరితనంతో ఇబ్బందులు 

కన్సల్టింగ్‌ సంస్థ హ్యాపీప్లస్‌ ‘ది స్టేట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ 2023’ నివేదికలో వెల్లడి 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ మహమ్మారి భారతీయుల భావోద్వేగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఒత్తిడి, కోపం, విచారం, ఆందోళనలతో ఇటీవల కాలంలో నిరాశ, నిస్పృహలను పెంచుతోంది. ఫలితంగా కోవిడ్‌ సోకిన భారతీయుల్లో సంతోషాల శాతం క్షీణిస్తోంది. కన్సల్టింగ్‌ సంస్థ హ్యాపీప్లస్‌ ‘ది స్టేట్‌ ఆఫ్‌ హ్యాపీనెస్‌ 2023’ నివేదిక ప్రకారం.. 35 శాతం మంది ‘నెగిటివ్‌ ఎమోషన్స్‌’ అనుభవిస్తున్నారు.

ఇది గత సర్వేతో పోలిస్తే రెండుశాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. మరోవైపు భారతీయుల్లో సానుకూల భావోద్వేగాలు 70 నుంచి 67 శాతానికి పడిపోయాయి. జీవన మూల్యాంకన రేటు 6.84 పాయింట్ల నుంచి 6.08 పాయింట్లకు తగ్గిపోయింది. ఆర్థిక సమస్యలు, పనిప్రదేశాల్లో ఒత్తిడి, సామాజిక నిబంధనలు, ఒంటరితనం, కుటుంబంలో అనిశ్చి తులు వంటి కారణాలు అసంతృప్తికి ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయని సర్వే అభిప్రాయపడింది.  

యువత, వృద్ధుల్లో పెరుగుతున్న కోపం 
హ్యాపిప్లస్‌ దేశవ్యాప్తంగా 14 వేల మంది ప్రతిస్పందనల ఆధారంగా నివేదిక రూపొందించింది. ఇందులో విద్యార్థుల్లో అత్యధికంగా ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయని తెలిపింది. 18 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఇతర వయసుల వారి కంటే ఎక్కువగా కోపం, విచారం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పదిమందికి ఇద్దరు ఈ పరిస్థితిని ఎదుర్కొంటే.. ఇప్పుడు వారిసంఖ్య ఐదుకు పెరగడం గమనార్హం.  

తగ్గిన జీవన వృద్ధి 
మరోవైపు తాజా అధ్యయనంలో 20 శాతం మంది వివిధ కారణాలతో బాధపడుతున్నట్టు తేలిందని నివేదిక చెబుతోంది. ఇది 2021లో 12 శాతంగా ఉండేది. అలాగే నిత్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు 63 శాతం ఉండగా.. ఇది కూడా గతేడాది కంటే (49 శాతం) పెరిగింది.

ఇదిలా ఉంటే గతేడాది 39 శాతం మంది భారతీయులు తాము వృద్ధి సాధించామని చెబితే.. ఇప్పుడు 17 శాతం మంది మాత్రమే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని నివేదిక పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top