
2014–19 టీడీపీ ప్రభుత్వహయాంలో యథేచ్చగా దోపిడీ
నాడు బరితెగించి.. నేడూ అదే దందా కొనసాగింపు..
ఖజానాకు గండికొట్టి... అస్మదీయులకు దోచిపెట్టారు..
చీకటి జీవోలతో బినావీులకు అడ్డగోలు లబ్ధి
రూ. 25 వేల కోట్లను మించిన దోపిడీ..
ప్రివిలేజ్ ఫీజుల రద్దుతో ఖజానాకు రూ. 5,200 కోట్లు గండి
ఎంఆర్‌పీ కంటే 20శాతం అధిక ధరలకు విక్రయాలు
తద్వారా రూ.20వేల కోట్ల దోపిడీ
అస్మదీయులకు చెందిన 14 డిస్టిలరీలకు ఎడాపెడా అనుమతులు..
మొత్తం 20 డిస్టరీలను ఎంపానల్ చేసింది బాబే
అందులో అయిదు డిస్టిలరీల నుంచే 69శాతానికిపైగా మద్యం కొనుగోళ్లు
గతంలోనే సీఐడీ దర్యాప్తులో పచ్చ ముఠా దందా బట్టబయలు
సీఐడీ కేసులో ఇప్పటికీ బెయిల్‌పైనే చంద్రబాబు
ఆ అక్రమాలను కప్పిపుచ్చేందుకే ఈ హడావిడి..
2024 తర్వాత మరింత మద్యం దోపిడీకి తెగించిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, అమరావతి: దెయ్యాలు వేదాలు వల్లించడం అనే రీతిలో కుటిల రాజకీయ నీతికి ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా తెగబడుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పారదర్శకంగా నిర్వహించిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడమే అందుకు తాజా తార్కాణం. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. స్వయంగా ముఖ్యమంత్రే మద్యం మాఫియా డాన్‌గా మారితే ఎలా ఉంటుందో ఆయన చేతల్లో చూపించారు. ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధాన్ని రద్దు చేసి మద్యం మహమ్మారికి తలుపులు బార్లా తెరిచింది కూడా చంద్రబాబే.
మద్యం మాఫియాను పెంచి పోషించి.. సాగించిన వ్యవస్థీకృత దందాకు ఆయనే బ్రాండ్ అంబాసిడర్. 2014–19లో టీడీపీ హయాంలో తన బినావీులు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం సీఎం హోదాలో చంద్రబాబు సంతకాలు చేసి మరీ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలలో నివేదించారు కూడా.
ఎంఆర్‌పీ కంటే 20శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.25వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతోసహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగించిన మద్యం దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు చంద్రబాబే. సీఐడీ ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసిన ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై బయట ఉన్నారు.
2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్ ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఖజానాకు తూట్లు పొడిచి సన్నిహితులు, బినావీులకు చెందిన కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకు చంద్రబాబు సాగించిన మద్యం కుంభకోణం ఇలా సాగింది!!
మంత్రివర్గానికి బురిడీ కొట్టారు... ఆర్థిక శాఖ అనుమతీ లేదు
2014–19 లో అప్పటి టీడీపీ ప్రభుత్వ మద్యం విధానం ముసుగులో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 2012 నుంచి అమలులో ఉన్న ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతిగానీ కేబినెట్ ఆమోదంగానీ లేకుండానే చాపకింద నీరులా పన్నాగాన్ని అమలు చేశారు. 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని తెచ్చింది. నాడు కేబినెట్ సమావేశానికి ముందు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఓ నోట్ ఫైల్‌ను ప్రభుత్వానికి పంపారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును కొనసాగించడమే కాకుండా 10 రెట్లు పెంచాలని అందులో ప్రతిపాదించారు.
కానీ ఆ ప్రతిపాదనను చంద్రబాబు కేబినెట్ అజెండాలో చేర్చ లేదు. నూతన మద్యం విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి 2015 జూన్ 22న జీవోలు 216, 217 జారీ చేశారు. ఆ రెండు జీవోల్లోనూ మద్యం దుకాణాలకు ప్రివిలేజ్ ఫీజు తొలగిస్తున్నట్లు ఎక్కడా పేర్కొనలేదు. కానీ అదే రోజు సాయంత్రం అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ప్రభుత్వానికి ఓ నోట్ పంపారు. మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు తొలగించాలని ప్రతిపాదిస్తూ అందుకోసం ఎక్సైజ్ చట్టం 16(9) నిబంధనను రద్దు చేయాలని అందులో సిఫార్సు చేశారు. ఆ నోట్ ఫైల్‌ను చంద్రబాబు కార్యాలయానికి పంపారు. ఈమేరకు ‘కాపీ టు పీఎస్ టు సీఎం’ అని నోట్‌ఫైల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ప్రివిలేజ్ ఫీజును తొలగిస్తున్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా తెలుసని తెలియడంలేదూ?
బార్లలోనూ అదే బరితెగింపు...
మద్యం దుకాణాలపై అడ్డగోలుగా ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసిన చంద్రబాబు అంతటితో ఆగలేదు. తన సన్నిహితులైన బార్ల యజమానులకు కూడా అదే రీతిలో లబ్ధి చేకూర్చారు. చంద్రబాబు ఆదేశాలతో బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేసేందుకు ఎక్సైజ్ చట్టం 10(ఏ) నిబంధన తొలగించాలంటూ అప్పటి ఎక్సైజ్ కమిషనర్ 2015 సెప్టెంబరు 1న సర్క్యులరిచ్చారు. ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరినట్లు కనికట్టు చేశారు. 2015 సెప్టెంబర్ 9న బార్ల యజమానులు వినతిపత్రంమిచ్చినట్లు రికార్డుల్లో చూపారు.
సెప్టెంబర్ 9న వినతి పత్రమిస్తే దానికి వారం రోజులు ముందుగానే సెప్టెంబరు 1నే ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్ సర్క్యులర్ ఎలా ఇచ్చారన్నది బాబే చెప్పాలి. బార్లకు ప్రివిలేజ్ ఫీజు రద్దుపై కూడా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు. కేబినెట్ ఆమోదమూ లేకుండానే రద్దు చేయాలని చూశారు. బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2015 డిసెంబర్ 11న జీవో ఇచ్చింది. ఆయా నోట్ ఫైళ్లపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 2015 డిసెంబర్ 3న సంతకం చేయగా చంద్రబాబు 2015 డిసెంబర్ 4న డిజిటల్ సంతకాలు చేశారు.
డిస్టిలరీలకు అనుమతినిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే
ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతినివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినావీులు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి సొంత ఖజానాకు నిధులను మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది.
మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. మద్యం కొనుగోళ్ల కోసం మొత్తం 20 డిస్టరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు సర్కారే. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24లో రాష్ట్రంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు. 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
చీకటి జీవోలతో కనికట్టు...
చంద్రబాబు ఆమోదంతోనే ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ అదే రోజు అంటే 2015 జూన్ 22న సాయంత్రం గుట్టుగా జీవో 218 జారీ అయింది. ఈ జీవో గురించి కేబినెట్‌లో చర్చించలేదు. ఖజానాకు నష్టం వాటిల్లే అంశాలపై ముందుగా ఆర్థిక శాఖ ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ప్రివిలేజ్ ఫీజు రద్దు విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియచేయనే లేదు. అంటే కేబినెట్‌కు తెలియకుండా, కనీసం ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కథ నడిపించాలని చంద్రబాబు ముందే నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.
ఊరూ పేరులేని బ్రాండ్లను ప్రవేశపెట్టింది చంద్రబాబే
⇒ ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. దాదాపు 200 రకాల బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టి మద్యం ప్రియుల ఆరోగ్యంతో చెలగాటమాడింది టీడీపీ ప్రభుత్వమే. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన మద్యం బ్రాండ్లలో కొన్ని ఇవీ...
⇒ ప్రెసిడెంట్ మెడల్: ఈ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
⇒ గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల విస్కీలకు 2018 అక్టోబర్ 26న టీడీపీ ప్రభుత్వం అనుమతిచ్చింది.
⇒హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్ అంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ బీర్ ఉత్పత్తులకు 2017 జూన్ 7న చంద్రబాబు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
⇒ రాయల్ ప్యాలస్, న్యూ కింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు 2018 నవంబరు 9న అనుమతిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే.
⇒ బీరా 91 పేరుతో 3 రకాల బీర్ బ్రాండ్లకు 2019 మే 13న అప్పటి టీడీపీ ప్రభుత్వమే అనుమతిచ్చింది.
⇒ టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వమే 2018 మే 15న అనుమతినిచ్చింది.
⇒ పవర్ స్టార్, లెజెండ్ వంటి బ్రాండ్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టిన నిర్వాకం చంద్రబాబు ప్రభుత్వానిదే.
ఎంఆర్‌పీ కంటే 20% అధిక ధరలకు విక్రయాలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీ యథేచ్ఛగా సాగింది. 4,370 అధికారిక ప్రైవేటు దుకాణాలు, వాటికి అనుబంధంగా మరో 4,370 పర్మిట్ రూమ్‌లు... ఇక ఏకంగా 43వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఎంఆర్‌పీ కంటే 20శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించడం ద్వారా రూ.20వేల కోట్లు కొల్లగొట్టింది.
డిస్టిలరీల ముసుగులో చంద్రబాబు దందా
⇒ ఆ అయిదు డిస్టిలరీల నుంచే 69 శాతానికిపైగా మద్యం కొనుగోళ్లుడిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెరతీశారు. 2015– 2019 మధ్య ఇలా కేవలం అయిదు డిస్టిలరీలకే లబ్ధి చేకూరింది. వీరి నుంచే 69 శాతానికిపైగా కొనుగోళ్లు చేశారు. అందుకు కొన్ని తార్కాణాలు ఇవిగో...
⇒ 2017–18లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రూ.8,106 కోట్ల మద్యం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో ఏకంగా రూ.4,122.28కోట్లు కేవలం అయిదు డిస్టిలరీలకే ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీ ఒక్కదానికే రూ.1,374.79 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇవ్వగా... పెర్నోడో రిచర్డ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03కోట్లు, ఎస్వీఆర్ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్–డిస్టిలరీస్‌కు రూ.457.86కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు.
⇒ 2018–19లో టీడీపీ ప్రభుత్వం మొత్తం 4,765.75కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చింది. వాటిలో కేవలం మూడు డిస్టిలరీలకే ఏకంగా రూ.2,244.44 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇవ్వడం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీస్‌కు అత్యధికంగా రూ.1,462.41కోట్ల మద్యం ఆర్డర్లు ఇవ్వగా... సెంటిని బయో ప్రొడక్ట్‌్సకు రూ.638.52కోట్లు, ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్‌్స కు రూ.143.51 కోట్ల ఆర్డర్లు ఇచ్చారు. తద్వారా కేవలం మూడు డిస్టిలరీల నుంచే రూ.47.09శాతం మద్యం కొనుగోలు చేశారు.
ఇపుడు మరింత దోపిడీకి తెగబడుతున్న కూటమి ప్రభుత్వం
⇒ 2024లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం తనకు అలవాటైన రీతిలో మద్యం దోపిడీకి తెగబడుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. టీడీపీ సిండికేట్ లూటీకి మార్గం సుగమం చేస్తూ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలోని 3,996 ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. వాటికి అనుబంధంగా దాదాపు 75వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసింది. ఎంఆర్‌పీ కంటే 25శాతం అధికంగా విక్రయిస్తూ యథేచ్ఛగా దోపిడీ చేస్తోంది.
2014–19 మధ్య దోపిడీకి రాచబాట
సీఎం హోదాలో చంద్రబాబు 2014–19 మధ్య మద్యం దోపిడీకి నేతృత్వం వహించారు. ఇందుకోసం టీడీపీ ప్రైవేటు మద్యం సిండికేట్‌ను ఏర్పాటు చేయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ పన్నును గుట్టుచప్పుడు కాకుండా తొలగించారు. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ చీకటి జీవోలు జారీ చేశారు. అందుకు సంబంధించిన నోట్ ఫైళ్లపై సీఎంగా చంద్రబాబు, ఎక్సైజ్ శాఖ మంత్రి హోదాలో కొల్లు రవీంద్ర సంతకాలు చేయడం వారి పన్నాగానికి నిదర్శనం. రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలకు అనుబంధంగా మరో 4,380 అనధికారిక బార్లుగా పర్మిట్ రూమ్‌లకు లైసెన్సులు జారీ చేశారు.
అనంతరం ఊరూవాడా 43 వేల బెల్ట్ దుకాణాలను ఏర్పాటు చేయించి మద్యాన్ని ఏరులై పారించారు. మద్యం దుకాణాల్లో బాటిల్‌పై ఎంఆర్‌పీ కంటే రూ.10 అదనంగా, బెల్ట్ దుకాణాల్లో బాటిల్‌పై మరో రూ.10 అదనంగా విక్రయిస్తూ దోపిడీకి పాల్పడ్డారు. 2014–19 మధ్య భారీ స్థాయిలో దోపిడీ జరిగిందన్న విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ధృవీకరించింది. ఇప్పుడు కూడా అప్పటికిమించి దోచుకోవడానికి చంద్రబాబు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
⇒ రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2019–24లో రాష్ట్రంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మరోవైపు 2014 నవంబరులో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్–2) డిపార్ట్‌మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
⇒ టీడీపీ సర్కారు కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడింది. టీడీపీ మద్యం సిండికేట్ దోపిడీపై గతంలోనే సీఐడీ కేసు నమోదు చేసి పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఏఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ, సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
అసలు స్కాం ఎవరిది? లంచాలు ఎవరికి ఇస్తారు?
టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ పాలనలో అమ్మకాలు తగ్గాయి.. ఈ నేపథ్యంలో లిక్కర్ వ్యవహారంలో వాస్తవంగా స్కాంలు చేసింది ఎవరు? అనేది పరిశీలిస్తే..
⇒ మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా?
⇒ విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యం దుకాణాలను పెంచితే లంచాలు ఇస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా?
⇒ దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్టు షాపులు తీసేసి, పర్మిట్ రూమ్స్‌ను రద్దు చేస్తే లంచాలు ఇస్తారా?
⇒ మద్యంపై తక్కువ ట్యాక్స్‌ల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్స్‌లు పెంచి, తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా?
⇒ ఎంపిక చేసుకున్న 4ృ5 డిస్టిలరీలకు 69శాతం ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా?
⇒ ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకీ అనుమతివ్వని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఉన్నవారికి లంచాలు వస్తాయా?

వైఎస్సార్‌సీపీ హయాంలో..
⇒ 2019-24 మధ్య ఐదేళ్లలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. మద్యం విధానంలో అక్రమ దందా సాగించే సిండికేట్
వ్యవస్థను పూర్తిగా ఎత్తివేసింది.
⇒ లిక్కర్ షాపుల నుంచి పూర్తిగా ప్రైవేటు వ్యక్తులను తొలగించింది. ప్రభుత్వ ఆధీనంలోనే అమ్మకాలు సాగించింది.
⇒ 33 శాతం మద్యం దుకాణాలను తీసివేసింది. షాపుల సంఖ్యను 4,380 నుంచి 2,934కు తగ్గించింది.
⇒ మద్యం దుకాణాలకు అనుబంధంగా ఉన్న 43 వేల బెల్టు షాపులను, 4,380 పర్మిట్ రూమ్‌లను రద్దు చేసింది.
⇒ మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచింది. ఎక్సైజ్‌కు సంబంధించిన నేరాలకు పాల్పడితే శిక్షలను కఠినం చేసింది.
⇒ మద్యం విక్రయాల వేళలను కుదించింది. ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసును నియమించింది. దీంతో మద్యం అమ్మకాలు బాగా తగ్గాయి.
లబ్ధి పొందిన చంద్రబాబు బినామీలు, సన్నిహితులు వీరే
⇒ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వియ్యంకుడు, టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్ జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రస్తుత ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు తండ్రి ఈయన. టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబం
⇒ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబం. 2014లో వైఎస్సార్‌సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై.. నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆయన డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు.
⇒ 2019 ఎన్నికలకు ముందు ఆగమేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్ అప్పటి టీడీపీ సీనియర్ నేత, ప్రస్తుత స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి చెందింది.