రైతులను ఆదుకుంటాం

Extensive tour of Ministers in flood affected areas - Sakshi

వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రుల విస్తృత పర్యటన  

వెంకటాచలం/పామర్రు/నరసాపురం రూరల్‌/తొండంగి/త్రిపురాంతకం: ‘ఎవరూ అధైర్య పడొద్దు... ఈ కష్టకాలంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుంది. రైతులకు అన్ని విధాలా సాయం చేస్తుంది...’ అని పలువురు రాష్ట్ర మంత్రులు చెప్పారు. మిచాంగ్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, దాడిశెట్టి రాజా, ఆదిమూలపు సురేశ్‌ బుధవారం విస్తృతంగా పర్యటించారు. పంటలు నష్టపోయిన రైతులతోపాటు పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నవారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.  

6.70లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ: కారుమూరి  
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పామర్రులో విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడి ఉన్న పంట పొలాలను, రైతులు ఆరబోసుకున్న ధాన్యం రాశులను పరిశీలించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6.70లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించామని మంత్రి చెప్పారు.

ఇందుకు సంబంధించి రూ.1,300కోట్లకు గాను, బుధవారం వరకు రైతుల ఖాతాల్లో రూ.1,089 కోట్లు జమ చేశామని, మిగిలిన మొత్తం కూడా ఒకటి, రెండు రోజుల్లో చెల్లిస్తామని వివరించారు. కౌలు కార్డులు లేని కౌలురైతుల ధాన్యాన్ని కూడా స్థానిక సొసైటీల ద్వారా కొనుగోలు చేసి నగదు చెల్లిస్తామని స్పష్టంచేశారు. కృష్ణాజిల్లా రైతులు తమ ధాన్యాన్ని పల్నాడు, బాపట్ల, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డ్ర­యర్స్‌ ఉన్న మిల్లులకు అమ్ముకునే విధంగా అవకాశాలను కల్పిస్తున్నామని తెలిపారు.

రైతులను ఇ­బ్బంది పెడితే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. పొలంలో చల్లిన మినుము విత్తనాలు పాడైపోయిన వారికి మళ్లీ సబ్సిడీపై విత్తనా­లు అందించేలా చూస్తామన్నారు. మరోవైపు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, మొగల్తూరు, పా­ల­కొల్లు మండలాల్లోని ముంపు గ్రామాల్లో ప్ర­భుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పర్యటించారు.  

క్షేత్రస్థాయిలో సర్వే: దాడిశెట్టి   
కాకినాడ జిల్లా ఏ.కొత్తపల్లిలో దెబ్బతిన్న పంట పొలాలను రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా పరిశీలించారు. బాధిత రైతులు, అధికారులతో మాట్లాడి పంట నష్టంపై ఆరా తీశారు. మంత్రి రాజా మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నష్టం వివరాలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు.  

పంట నష్టం అంచనాలు అందినవెంటనే సాయం: ఆదిమూలపు  
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లి వద్ద దెబ్బతిన్న వరి పొలాలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పరిశీలించారు. తహశీల్దార్‌ వి.కిరణ్, వ్యవసాయ శాఖ అధికారులను అడగి పంటనష్టం గురించి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో పంట నష్టం అంచనాలు అందిన వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని మంత్రి తెలిపారు. సీఎం వైఎస్‌ రైతు పక్షపాతి అని ప్రతి ఒక్క రైతుకూ అండగా ఉంటారని భరోసా ఇచ్చారు.  

80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ : కాకాణి  
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన తిక్కవరప్పాడు, ఇస్కపాళెం, పుంజులూరుపాడు, గుడ్లూరువారిపాళెం, తిరుమలమ్మపాళెం గ్రామాల్లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పర్యటించారు. తిరుమలమ్మపాళెం, ఇతర వరద ప్రభావిత గ్రామాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

మంత్రి కాకాణి మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదన్నారు. కొంతమేరకు వరినాట్లు, నారుమళ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు ఆర్బీకేల ద్వారా 80శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేస్తామని తెలిపారు. దెబ్బతిన్న పంట నష్టం అంచనా వేసి పరిహారాన్ని అందిస్తామని వివరించారు.  

ఏర్పాట్లు బాగున్నాయి 
రాత్రి కురిసిన వర్షానికి ఇళ్ల చుట్టూ నీరు చేరింది. ఏం చేయాలో తెలియలేదు. ఇంకా నీరు ఎక్కువగా వస్తే ఎలా ఉండాలో తెలి­యక అయోమయంలో పడ్డాం. వెంటనే సకాలంలో అధికా­రులు వచ్చి చర్యలు తీసుకున్నారు. శిబిరానికి తీసు­కొచ్చారు. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం, టీ కూడా అందజేశారు. అధికారులు మా బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి.  – రాచూరి ముత్యాలరావు, చెరుకూరి రత్నం, తాళ్లపూడి, తూర్పు గోదావరి జిల్లా 

పరీక్షలు చేసి మందులిచ్చారు
నేను, మా ముసలా­వి­డ ఇద్ద­రమే ప్రకాశపు­రంలో­ని గుడిసె­లో నివ­సిస్తు­న్నాం. తుపాను రాగానే జోరు­వానలో మమ్మ­ల్ని ఇద్దర్నీ మా వలంటీర్‌ వ­చ్చి వ్యానులో తీసుకెళ్లి పున­రావాస కేంద్రంలో అన్నం పెట్టించారు. వ­య­సు మీద పడ­టంతో ఈ వలంటీరే దిక్కయింది. శిబిరంలో డాక్టర్లు మందులిచ్చారు. – మురాల ప్రభుదాసు, ప్రకాశపురం, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా

సురక్షితంగా బయట పడ్డాను
నా ఇల్లు బాగోలేదు. తుపాన్‌ వేళ ఎలా చేయాలని దిగులు పడుతున్న సమయంలో గ్రామంలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. నన్ను అక్కడికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు భోజనాలు, టిఫిన్లు పెట్టారు. నిద్రపోవడానికి వసతి కూడా కల్పించారు. విపత్తులు వచ్చినప్పుడు ఈ విధంగా ఎన్నడూ చేయలేదు. అధికారులకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. – శింగోతు నాంచార్లు, కె.పల్లెపాలెం, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా 

వలంటీర్‌ వల్లే బతికి బట్టకట్టాను
నేను చాలా తుపాన్లు చూశాను. శిబిరానికి వెళ్లేందుకు నిరాకరిస్తే మా వలంటీర్‌ అమ్మాయి వచ్చి మామ్మా.. నేను తీసుకెళ్తాను అంటూ పట్టుబట్టింది. సిబ్బందితో వచ్చి వ్యానులో తీసుకెళ్లారు. రెండు రోజులు వేములదీవి ఈస్ట్‌ గ్రామంలోని తుపాను షెల్టర్‌లో ఉన్నాను. నేను శిబిరానికి వెళ్లిన తర్వాత నా గుడిసె కూలిపోయింది. వలంటీర్‌ మాట విని ఉండకపోతే నా ప్రాణాలు పోయేవి. వలంటీర్‌ వల్లే బతికి బట్టకట్టాను.     – మైలాబత్తుల కమలమ్మ, వేములదీవి ఈస్ట్, నరసాపురం మండలం, పశ్చిమగోదావరి జిల్లా

సకాలంలో ఆదుకున్నారు
వర్షం నీటితో ఇల్లు మొత్తం నీరు చేరింది. అధికారులు, పంచాయతీ సిబ్బంది సకాలంలో వచ్చి మమ్మల్ని ఉన్నత పాఠశాల వద్దకు చేర్చారు.  అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్నారు. భోజనం, అల్పాహారం, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశారు. – గోపిరెడ్డి రమ్య, వేగేశ్వరపురం, తూర్పు గోదావరి జిల్లా 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top