రెండంతస్తుల శోభ

Experiment in Jagananna colonies in Tenali - Sakshi

తెనాలిలోని జగనన్న కాలనీల్లో సరికొత్త ప్రయోగం 

భవిష్యత్‌లో జీ+2 ఇల్లు నిర్మించుకునేలా ప్రణాళిక

మురిసిపోతున్న లబ్ధిదారులు  

తెనాలి: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో గుంటూరు జిల్లా తెనాలిలో సరికొత్త ప్రయోగం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా అమలవుతున్న ఈ విధానంలో పునాదుల నుంచి గోడలతో సహా ఇళ్లను పటిష్టంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ప్రతి ఇంటిపైనా మరో రెండు అంతస్తులు (జీ+2) నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఇళ్లు నిర్మించడంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తెనాలి పట్టణం, రూరల్‌ మండలం, కొల్లిపర మండలాలతో కలిపి రికార్డు స్థాయిలో 27 వేల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. తొలి దశలో 17 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. డెల్టా ప్రాంతమైన తెనాలిలోని లే–అవుట్లలో మెరక సమస్యలను అధిగమించి ప్రస్తుత వేసవిలో ఇళ్ల నిర్మాణం ఆరంభమైంది. ప్రస్తుత సీజనులో కనీసం 10 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని సంకల్పంతో శరవేగంతో పనులు జరుగుతున్నాయి. 

సిరిపురం లే–అవుట్‌లో బోర్లలో రెడీమిక్స్‌ 

భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. 
ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్లపై లబ్ధిదారులు భవిష్యత్‌లో మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా ఆధునిక బోర్‌ కటింగ్‌ యంత్రంతో ఒక్కో ఇంటికి 10 అడుగుల లోతు, అడుగు డయామీటరుతో తొమ్మిది బోర్లు తీస్తున్నారు. ఒక్కో బోరులో 12 ఎం.ఎం. ఇనుప రాడ్లు నాలుగు చొప్పున కడుతున్నారు. పైన పైల్‌ కాపింగ్‌ మరో ప్రత్యేకత. దానిపై ప్లింత్‌బీమ్‌కు 10 ఎం.ఎం. స్టీల్‌ రాడ్లు ఐదేసి చొప్పున వాడుతున్నారు. ప్లింత్‌ బీమ్‌పై 9 అంగుళాల గోడ నాలుగు అడుగులు మేర కట్టి, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుకతో నింపి బెడ్‌ వేస్తున్నారు.

అక్కడి నుంచి ఒక్కో కాలమ్‌కు 10 ఎం.ఎం. రాడ్లు నాలుగు చొప్పున 9 కాలమ్స్‌ను శ్లాబ్‌ వరకు తీసుకెళుతున్నారు. లోడ్‌ బేరింగ్‌ కోసం పునాదిని పకడ్బందీగా వేయడం, డిజైన్‌లో లేనప్పటికీ 9 కాలమ్స్‌ నిర్మించటంతో ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు అదే ఇంటిపై మరో రెండు అంతస్తుల నిర్మాణం నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ఇళ్ల నిర్మాణ పర్యవేక్షకుల్లో ఒకరైన ఏఆర్‌ఏ కనస్ట్రక్షన్స్‌ నిర్వాహకుడు అడుసుమల్లి వెంకటేశ్వరరావు వెల్లడించారు.

కట్టుబడి చాలా బాగుంది 
సిరిపురం లే–అవుట్‌లో నాకు ఇంటిస్థలం ఇచ్చారు. డబ్బులు చాలక లబ్ధిదారులు ఎవరికి వారు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి నిర్మాణాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పర్యవేక్షకులను నియమించి కట్టుబడి బాగా చేయిస్తున్నారు. పునాదులు, గోడలు పటిష్టంగా వేస్తున్నందున మళ్లీ ఎప్పుడైనా మేం పైన మరో రెండంతస్తులు వేసుకునే అవకాశం ఉండేలా కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. 
– అద్దంకి హేమలత, 10వ వార్డు, తెనాలి

ఊపందుకున్న నిర్మాణాలు
తెనాలి పట్టణ లబ్ధిదారులకు కేటాయించిన పెదరావూరు, సిరిపురం లే–అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. లే–అవుట్లలోనే తాత్కాలిక గిడ్డంగులను నిర్మించి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకతో సహా ఇనుము, సిమెంట్, ఇటుకలను ముందుగానే చేర్చటం కలిసొచ్చింది. లే–అవుట్లలో అవసరమైన నీటి వసతి, విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశారు.

మెప్మా సహకారంతో లబ్ధిదారులకు రూ.50 వేల వంతున రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ ప్రత్యేకంగా లే–అవుట్లలో క్యాంప్‌ ఆఫీస్‌ ఏర్పాటు చేసుకున్నారు. బోర్లు తీయడం నుంచి ప్లింత్‌బీమ్,  పైల్‌ కాపింగ్, కాలమ్స్‌ అన్నీ ఆయన డిజైన్‌ ప్రకారం ఏడెనిమిది మంది పర్యవేక్షకులతో ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top