మూడు రోజుల గిరిజన జాతరకు సర్వం సిద్ధం | Everything is ready for the three day tribal fair | Sakshi
Sakshi News home page

మూడు రోజుల గిరిజన జాతరకు సర్వం సిద్ధం

Jan 31 2025 3:42 AM | Updated on Jan 31 2025 3:42 AM

Everything is ready for the three day tribal fair

చలి ఉత్సవాలకు అరకు లోయ ముస్తాబు 

హాట్‌ ఎయిర్‌ బెలూన్, పారా గ్లైడింగ్, హెలికాప్టర్లే ఆకర్షణ 

10 రాష్ట్రాల నుంచి తరలిరానున్న ఆదివాసీ కళాకారులు

సాక్షి, పాడేరు: ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన అరకు లోయ శుక్రవారం నుంచి జరగబోయే చలి జాతరకు ముస్తాబైంది. గిరిజన ఆచార, సంప్రదాయాలకు చలి ఉత్సవాలు అద్దం పట్టనున్నాయి. అరకు లోయలోని డిగ్రీ కళాశాల వేదికగా అరకు చలి ఉత్సవాన్ని మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. సందర్శకులను ఆకట్టుకునేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హాట్‌ బెలూన్, పారాగ్లైడ్, హెలికాప్టర్‌ వంటి వాటిని ప్రైవేట్‌ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. 

వీటిలో పర్యాటకులు, స్థానికులు విహరించేలా ఏర్పాట్లు చేశారు. 10 రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, సంప్రదాయ డప్పు వాయిద్యాలు హోరెత్తనున్నాయి. ఈ నెల శుక్రవారం ఉదయం 7.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమై ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగిసేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. 

అరకు మారథాన్, పద్మాపురం గార్డెన్‌లో ఫ్లవర్‌ షో, గిరిజన వంటకాల ఫుడ్‌ కోర్టు, పలు రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కాఫీ రుచులు, ఫ్యాషన్‌ షో, సినీ కళాకారులతో కామెడీ స్కిట్స్, సుంకరమెట్ట కాఫీ తోటల్లో అరకు ట్రెక్కింగ్, హెలికాప్టర్‌ రైడింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయలో ఇటువంటి ఉత్సవాలను తిలకించడం లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అంటుంటారు పర్యాటకులు. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.కోటి నిధులు మంజూరు చేసిందని కలెక్టర్‌ దినేష్ కుమార్‌ తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement