
అనారోగ్యంతో ఎర్రసామంతవలస విద్యార్థి మృతి
మృతదేహంతో గిరిజన సంఘాల ఆందోళన
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పిల్లలు చనిపోతున్నారంటూ ఆగ్రహం
ఏడాదిన్నరలో 15 మంది గిరిజన విద్యార్థులు మృతి.. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి నియోజకవర్గంలోనే నలుగురు విద్యార్థులు బలి
మక్కువ (పార్వతీపురం మన్యం): ఆశ్రమ పాఠశాలల్లో చేరి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న అడవి బిడ్డల కలలు ఆవిరైపోతున్నాయి. చదువుల మాట దేవుడెరుగు.. ఆశ్రమ పాఠశాలల నుంచి సురక్షితంగా ఇంటికి వస్తే చాలు అన్నట్లుగా ప్రస్తుతం పరిస్థితి నెలకొంది. కలుషిత తాగునీరు, అనారోగ్యం, సరైన వైద్యం అందకపోవడం వల్ల ఏడాది వ్యవధిలో 15 మంది గిరిజన విద్యార్థులు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి సొంత నియోజకవర్గం సాలూరులోనే నలుగురు విద్యార్థులు చనిపోవడం గమనార్హం. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లాలో 11 ఏళ్ల వయసున్న చిన్నారి అనే విద్యార్థి కిడ్నీ సమస్య బారిన పడి ప్రాణాలు కోల్పోయాడు.
ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థి మృతి
పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం పనసబద్ర పంచాయతీ మూలవలస గ్రామానికి చెందిన తాడంగి చిన్నారి (11) బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న చిన్నారి అనారోగ్యానికి గురైనట్లు ఈనెల 13వ తేదీన తల్లిదండ్రులు ముగిరి, కాంతమ్మకు పాఠశాల యాజమాన్యం సమాచారం అందించింది.
చిన్నారి తల్లిదండ్రులు అదే రోజు పాఠశాలకు చేరుకొని విద్యార్థిని సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయనగరం తరలించగా విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. కలుషిత నీరు కారణంగా అనారోగ్యానికి గురై, కిడ్నీలు పాడవడంతోనే తమ బిడ్డ మృతి చెందినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
గిరిజన, ప్రజా సంఘాల ఆందోళన..
రైతు కూలీసంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, జిల్లా నాయకులు అసిరి, పీడీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు కె.సోమేష్, గిరిజన సంఘం నేత మండల గిరిధర్‌రావు తదితరులు మూలవలస చేరుకుని విద్యార్థి మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఐటీడీఏ అధికారులు గ్రామానికి వచ్చి విద్యార్థి మృతికి సమాధానం చెప్పాలని, లేదంటే మృతదేహాన్ని ఆశ్రమ పాఠశాలకు తరలించి నిరసన చేపడతామని హెచ్చరించారు. గిరిజన బిడ్డల ఆరోగ్యం గురించి మంత్రి సంధ్యారాణి కనీసం పట్టించుకోవడంలేదని, అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంల నియామకాల కోసం చేసిన మొదటి సంతకం ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 11 ఏళ్ల బాలుడు కిడ్నీలు పాడై చనిపోవడం ఏమిటని మండిపడ్డారు. తాగునీటి సమస్యతో విద్యార్థులు రోగాల బారిన పడుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆశ్రమ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేవని, ఆర్వో ప్లాంట్‌లు మూలకు చేరినా బాగు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డీటీడబ్ల్యూ విజయశాంతి, ఏటీడబ్ల్యూ కృష్ణవేణిని చుట్టుముట్టిన ప్రజాసంఘాలు, గిరిజన నేతలు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి చిన్నారి చనిపోయాడని మండిపడ్డారు. ఏఎన్‌ఎం పోస్టుల భర్తీ, ఆర్వో ప్లాంట్ మరమ్మతుల గురించి ప్రభుత్వం దృష్టికి తెస్తామని డీటీడబ్ల్యూఓ పేర్కొన్నారు.
ఈ ఏడాది జూన్‌లో జియ్యమ్మవలస మండలం టీకే జమ్ముకు చెందిన గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని కె.తనూజ, గత నెల 26న గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి, ఈ నెల ఒకటో తేదీన కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన పచ్చకామెర్లతో ప్రాణాలు కోల్పోయారు. కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 180 మందికిపైగా బాలికలు పచ్చకామెర్ల బారిన పడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మక్కువ మండలం నంద గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని బిడ్డిక కీర్తన (17), పాచిపెంట మండలంలో మూడో తరగతి విద్యార్థిని శాంత కొద్దినెలల కిందట మృతిచెందగా.. సాలూరు మండలంలోని మామిడిపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని తాడంగి పల్లవి(12) రెండు రోజుల కిందట చనిపోయింది. తాజాగా మక్కువ మండలం ఎర్రసామంతవలస ఆశ్రమ పాఠశాల విద్యార్థి చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.
మన్యంలో మరణ మృదంగం
గతేడాది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు, పార్వతీపురం మండలం రావికోన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థి పి.రాఘవ, గుమ్మలక్ష్మీపురం మండలం వామాసి గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల మండంగి గౌతమ్ మలేరియాతో చనిపోయాడు.
కొమరాడ కేజీబీవీ పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని కె.శారద, గుమ్మలక్ష్మీపురం బాలికల ఆశ్రమ పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థిని ఎన్.అవంతిక, కురుపాం గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల నాలుగో తరగతి విద్యార్థి నితిన్, జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి జీవన్‌కుమార్, గుమ్మలక్ష్మీపురం మండలం దొరజమ్ముకు చెందిన మూడో తరగతి చదువుతున్న జి.దినేష్ మృతిచెందారు.
కన్నెత్తి చూడని విద్యాశాఖ మంత్రి
ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే కాదు.. ఏజెన్సీ ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరంల్లోనూ గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారు. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా.. కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కురుపాంలో ఇద్దరు గిరిజన బాలికలు మృతి చెందిన ఘటనను కప్పిపుచ్చేందుకు మంత్రులు ప్రయత్నించారు. విద్యార్థులు ఇళ్ల వద్దే మరణించారని.. ప్రభుత్వానికి ఏం సంబంధమంటూ మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు.
పరిహారం సంగతి తర్వాత చూస్తామని.. మట్టి ఖర్చులే ఇవ్వగలమని చెప్పడం ప్రభుత్వ దారుణ వైఖరికి అద్దం పడుతోంది. గిరిజన విద్యార్థుల మరణాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు గానీ, ఉప ముఖ్యమంత్రిగానీ, విద్యాశాఖ మంత్రి గానీ సమీక్షించిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నుంచి ఒక ప్రకటన కూడా లేదు. విశాఖలో పర్యటించిన విద్యాశాఖ మంత్రి కేజీహెచ్‌కు వెళ్లి గిరిజన బిడ్డల ఆరోగ్యంపై కనీసం ఆరా తీయలేదు. విద్యార్థుల చావులకు కారణాలను కప్పిపుచ్చుతూ ప్రభుత్వం అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది.
పిల్లలు చనిపోతున్నా పట్టదా..?
మా కుమారుడు అనారోగ్యానికి గురైనట్లు సమాచారం అందిన వెంటనే పాఠశాలకు వెళ్లాం. సాలూరు, విజయనగరం, కేజీహెచ్ ఆస్పత్రులకు తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. చక్కగా చదువుకుని ప్రయోజకుడు అవుతాడనుకుంటే చిన్న వయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. పిల్లలు అనారోగ్యంతో మృతి చెందుతున్నా పట్టించుకునేవారే లేరు. – తాడంగి ముగిరి (చిన్నారి తండ్రి, మూలవలస గ్రామం)
తాగునీటి సమస్యే కారణం..
విద్యార్థి చిన్నారి అనారోగ్యానికి గురి కావడంతో ఈనెల 8వ తేదీన శంబర పీహెచ్‌సీలో పరీక్షలు నిర్వహించగా మలేరియా పాజిటివ్ వచ్చింది. 10వ తేదీన పార్వతీపురం ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆరోగ్యంగా ఉన్నాడంటూ పంపించేశారు. చిన్నారి 13వ తేదీన మళ్లీ అనారోగ్యానికి గురికాగా సాలూరు, విజయనగరం, విశాఖ ఆస్పత్రులకు తరలించినా ప్రయోజనం లేకపోయింది. చిన్న వయసులో కిడ్నీలు పాడవడం దారుణం. దీనికి తాగునీటి సమస్యే ప్రధాన కారణం. ప్రభుత్వం చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలి. – కె.సోమేష్, పీడీఎస్‌ఓ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం జిల్లా