
సాక్షి, అమరావతి: వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసుకునే గణేష్ మండపాలకు రుసుములు (ఫీజులు) వసూలు చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇలాంటి వాటిని ప్రజలెవరూ నమ్మవద్దని దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండపాల ఏర్పాటుకు ఎటువంటి రుసుములు వసూలు చేయడం లేదని స్పష్టం చేశారు. భద్రతా కారణాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు స్థానిక పోలీసు.. రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్నారు.
చట్టపరంగా తీసుకోవాల్సిన అనుమతులు ఏవైనా ఉంటే రెవెన్యూ, పోలీస్ శాఖను సంప్రదించి తీసుకోవాలని కోరారు. అలాంటివి మినహాయించి ఏ రకమైన రుసుములు గానీ, చందాలు గానీ తీసుకున్నా లేక ప్రేరేపించబడినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫీజులు వసూలు చేస్తున్నారని తప్పుగా ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అబద్ధపు నిరాధార ప్రచారాన్ని ప్రజలు, భక్తులు నమ్మవద్దని కోరారు. ఎక్కడైనా మండపాలకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.