హిందూపురం కోవిడ్‌ ఆస్పత్రిలో కలకలం

Eight Covid victims died at Hindupuram Government Covid Hospital - Sakshi

ఒకే రోజు 8 మంది మృతి

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుల కుటుంబీకుల ఆందోళన

ఆక్సిజన్‌ సమస్య కారణం కాదన్న అధికారులు

6కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌ అందుబాటులో ఉంది

అదనంగా ఆక్సిజన్‌ సిలిండర్లూ ఉన్నాయి

ఆరోగ్యం విషమించడం వల్లే మృతి చెందారని వివరణ

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో సోమవారం కలకలం చోటు చేసుకుంది. ప్రభుత్వ కోవిడ్‌ ఆస్పత్రిలో 8 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు. అయితే వీరి మృతికి ఆక్సిజన్‌ అందకపోవడం కారణం కాదని.. ఆక్సిజన్‌ నిల్వలు ఆస్పత్రిలో సమృద్ధిగా ఉన్నాయని.. చివరి క్షణంలో ఆస్పత్రికి రావడం వల్లే ఆరోగ్యం విషమించి వారు మృతి చెందారని అధికారులు తెలిపారు. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. హిందూపురం కోవిడ్‌ ఆస్పత్రిలో 150 బెడ్లతోపాటు 50 ఐసీయూ బెడ్స్‌ అందుబాటులో ఉండగా 232 మంది చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఆరోగ్యం విషమించి మంజునాథ్‌ (39), హిందూపురం ముబారక్‌ (63), మడకశిర రమేష్‌ (42), గోళాపురం నంజేగౌడ, నరసింహప్ప (58), సదాశివప్ప (50), లక్ష్మమ్మ (60), గంగరత్న(58) మృతి చెందారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా వైద్యుల నిర్లక్ష్యమే మరణాలకు కారణమని మృతుల కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న సీఐ బాలమద్దిలేటి ఆస్పత్రికి చేరుకుని వారికి సర్దిచెప్పడంతో శాంతించారు. 

24 గంటలూ పర్యవేక్షిస్తున్నాం
ఆక్సిజన్‌ అందక కోవిడ్‌ రోగులు మృతి చెందారనేది అవాస్తవమని జిల్లా అటవీ శాఖాధికారి, ఆక్సిజన్‌ మానిటరింగ్‌ అధికారి జగన్నాథ్‌సింగ్, పెనుకొండ సబ్‌ కలెక్టర్‌ నిషాంతి తెలిపారు. సోమవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో వారు సూపరింటెండెంట్, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. ఆస్పత్రిలో 204 బెడ్లు ఉండగా ఇందులో 22 వెంటిలేటర్‌ బెడ్లు ఉన్నాయన్నారు. 6 కేఎల్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్‌తోపాటు అదనంగా సిలిండర్లు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతోనే కోవిడ్‌ రోగులు మృతి చెందారని తెలిపారు. ఆక్సిజన్‌ మానిటరింగ్‌ కమిటీ ద్వారా 24 గంటలు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

విషమ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినవారే..
మృతిచెందినవారంతా విషమ పరిస్థితిలో ఆస్పత్రికి వచ్చినవారే. వారికి ఆక్సిజన్‌ లెవల్‌ 80లోపు ఉంది. తెల్లవారుజామున ఆక్సిజన్‌ సిలిండర్లు రీస్టోర్‌ చేసే సమయంలో భయపడటం వల్లే శ్వాస సమస్య తలెత్తి వారు మరణించినట్లు భావిస్తున్నాం. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత, ఇతర సాంకేతిక సమస్యలు లేవు.
– డాక్టర్‌ దివాకర్, సూపరింటెండెంట్, హిందూపురం ప్రభుత్వాస్పత్రి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top