కోవిడ్‌తో కోలుకున్న గుడ్డు! | Eggs Consumption in addition to over half a crore daily in AP | Sakshi
Sakshi News home page

కోవిడ్‌తో కోలుకున్న గుడ్డు!

May 19 2021 6:03 AM | Updated on May 19 2021 6:05 AM

Eggs Consumption in addition to over half a crore daily in AP - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్‌ మహమ్మారి అన్ని రంగాలను కుదేలు చేస్తుండగా కోడి గుడ్డును మాత్రం కోలుకునేలా చేసింది. పోషక విలువలు అధికంగా ఉడే కోడి గుడ్ల వినియోగం కరోనా సమయంలో గణనీయంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే రోజురోజుకూ గుడ్డు ధరలు ఎగబాకుతున్నాయి. ఇది పౌల్ట్రీ రైతులకు కొంతమేర ఊరటనిస్తోంది. కోడి గుడ్లు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో వినియోగం పెరగడంతో గిరాకీ ఎక్కువైంది. 

రోజూ అదనంగా 50 లక్షల గుడ్లు
రాష్ట్రంలో రోజుకు 4.50 కోట్ల కోడి గుడ్ల ఉత్పత్తి జరుగుతుండగా తమిళనాడు, కర్ణాటక నుంచి మరో కోటి గుడ్లు దిగుమతి అవుతున్నాయి. రెండు కోట్ల కోడిగుడ్లు అసోం, బిహార్, బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున మూడు కోట్ల గుడ్ల వినియోగం ఉండగా ప్రస్తుతం మూడున్నర కోట్లకు పెరిగింది. రోజుకు 50 లక్షలకు పైగా గుడ్లను అదనంగా వినియోగిస్తున్నారు. అసోం, బెంగాల్, బిహార్, ఒడిశాలోనూ గుడ్ల వినియోగం 20 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.  

ధరల పెరుగుదల ఇలా..
కోడిగుడ్ల ధరల పెరుగుదల కొద్ది రోజులుగా జోరందుకుంది. ఈనెల 5వ తేదీన విజయవాడలో వంద గుడ్ల ధర హోల్‌సేల్‌లో రూ. 370 ఉండగా ప్రస్తుతం రూ.476కి పెరిగింది. విశాఖపట్నంలో రూ.360 నుంచి 500కి చేరుకుంది. పది రోజుల్లోనే విజయవాడలో రూ. 106, విశాఖలో రూ.140 చొప్పున ధరలు పెరిగాయి. రిటైల్‌ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు రూ.6 వరకు «విక్రయిస్తున్నారు. అహ్మదాబాద్, ఢిల్లీ, ముంబై, నాగపూర్, పుణే తదితర నగరాల్లో కొద్దిరోజులుగా వంద గుడ్ల ధర రూ.500కి పైనే పలుకుతోంది. ఈ ఏడాది జనవరిలో రాష్ట్రంలో వంద కోడి గుడ్ల ధర రూ.526 పలికి ఆల్‌టైం హైకి చేరింది. ప్రస్తుత పరిస్థితులను బట్టి గుడ్ల ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

మేత ధరలూ పైపైకి.. 
కోళ్ల మేత ధరలు కూడా గతం కంటే పెరిగాయి. డిసెంబర్‌లో కిలో రూ.35–40 వరకు ఉన్న మేత ధర ప్రస్తుతం రూ.70కి చేరిందని పెంపకందార్లు చెబుతున్నారు. మేత రేటు పెరగడంతో గిట్టుబాటు కావడం లేదని ఆందోళన చెందుతున్న తరుణంలో గుడ్లకు గిరాకీ ఏర్పడటం పౌల్ట్రీ రైతులకు కొంత ఊరటనిస్తోంది. 

రైతులకు వెసులుబాటు..
‘‘ప్రస్తుత కోడిగుడ్డు ధర పౌల్ట్రీ రైతుకు కాస్త వెసులు బాటునిస్తోంది. కొన్నాళ్ల క్రితం వరకు వంద గుడ్ల ధర రూ.400 లోపే పలికింది. మేత ధర మాత్రం రెట్టింపైంది. దీంతో రైతుకు గిట్టుబాటు కాక నష్టపోవాల్సి వస్తోంది. కోవిడ్‌ నేపథ్యంలో గుడ్ల వినియోగం బాగా పెరగడం మంచి పరిణామం. కొద్దిరోజుల పాటు వీటి ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉంది’’ 
–టి.కుటుంబరావు, జోనల్‌ చైర్మన్,నేషనల్‌ ఎగ్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ (నెక్‌), విజయవాడ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement