మునిగిన పంటల్ని కాపాడుకోండిలా!

Effect of rainfall on paddy and cotton and maize crops - Sakshi

Effect of rainfall on paddy, cotton and maize

వచ్చే 48 గంటలే కీలకం  

సాక్షి, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల వరి, పత్తి, మొక్కజొన్న పంటలతోపాటు అక్కడక్కడా అపరాలకు నష్టం వాటిల్లినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాష్ట్రంలో సుమారు 1.10 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నీట మునిగిన పంటల్ని కాపాడుకునేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచనలు చేశారు. నీట మునిగిన పంటల్ని 48 గంటల్లోగా కాపాడుకునే చర్యలు చేపట్టాలని సూచించారు.

వరి రక్షణకు..
వరి చేలల్లో అధికంగా ఉన్న నీటిని తొలగించేందుకు బోదెలు తీయాలి. వర్షం తెరిపి ఇస్తే.. ఎకరానికి 15, 20 కిలోల యూరియా, 10 కిలోల మ్యూరేట్‌ పొటాష్‌ వేయాలి. పొడ తెగులు లక్షణాలు కనిపిస్తే హెక్సాకొనజోల్‌ లేదా వాలిడా మైసిన్‌ లేదా ప్రోపికొనజోల్‌ మందుల్లో ఏదో ఒక దానిని లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి 15 రోజుల తర్వాత మందు మార్చి చేనంతా తడిసేలా చల్లుకోవాలి. నారుమళ్లలో లద్దె పురుగు నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్‌ 2 మిల్లీలీటర్లు, డైక్లోరోవాస్‌ ఒక మిల్లీలీటర్‌ కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి. ఆకు ముడత నివారణకు ఎసిఫేట్‌ ఒకటిన్నర గ్రాము లేదా క్లోరిపైరిఫాస్‌ 2.5 మిల్లీలీటర్లను లీటర్‌ నీటికి కలిపి పిచికారీ చేయాలి. దోమపోటు నివారణకు పైమెట్రోజైన్‌ 0.6 గ్రాము లేదా డైనోటేప్యూరాన్‌ 0.5 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను ఇథిప్రోల్‌తో కలిపి పిచికారీ చేయాలి.

మొక్కజొన్నలో సస్యరక్షణ 
భూమిలో అధికంగా తేమ ఉంటే అంతర సేద్యం ద్వారా తగ్గించాలి. ఎకరానికి 25, 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్‌ వేయాలి. ఫాల్‌ ఆర్మీ వార్మ్‌ తెగులు గమనిస్తే ఎకరానికి క్లోరాంట్రనిలిప్రోల్‌ 60 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్‌ బెంజోయెట్‌ 80 గ్రాములు లేదా లాంట్డా సైహలోత్రిన్‌ 200 మిల్లీలీటర్లను పిచికారీ చేయాలి.

ఇతర పంటల రక్షణకు..
అపరాల పంటల్లో అధిక తేమ వల్ల నత్రజని అందకపోతే ఒక శాతం కేఎన్‌ఓ–3ని రెండుసార్లు చొప్పున 4, 5 రోజులు చల్లాలి. సూక్ష్మ పోషకాల లోపం నివారణకు జింక్‌ సల్ఫేట్, అన్నభేది వేయాలి. మరింత సమాచారం కోసం సమీపంలోని వ్యవసాయ శాస్త్రవేత్తలను 155251 నంబర్‌లో లేదా ఆర్బీకేలలోని గ్రామీణ వ్యవసాయ సహాయకులను సంప్రదించవచ్చు. 

పత్తిలో తెగులు నివారణకు.. 
పత్తి తోటల్లో తేమను తగ్గించడానికి అంతర సేద్యం చేయాలి. మొదట డీఏపీ లేదా యూరియా వేయాలి. పత్తి విత్తిన 30, 35 రోజులప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరానికి 400 మిల్లీలీటర్ల క్విజలోపాప్‌ ఇథైల్‌ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. భూమిలో వచ్చే కుళ్లు తెగుళ్లు, బ్యాక్టీరియా మచ్చ తెగులు నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 30 గ్రాములను లేదా పౌశమైసిన్‌ లేదా ప్లాంటా మైసిన్‌ను పిచికారీ చేయాలి. పంట వేసి 90 రోజులైతే ఎకరాకు 30, 35 కిలోల యూరియా, 20, 25 కిలోల పొటాష్‌ వేయాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top