రామోజీ.. అస్మదీయ తకథిమి 

Eenadu Ramoji Rao Fake News On projects Tenders Andhra Pradesh - Sakshi

ప్రాజెక్టులకు టెండర్లు పిలవలేదంటూ విచిత్రమైన వాదన 

ఏ మెగా ప్రాజెక్టుకూ దేశంలో ఎక్కడా టెండర్లు పిలవరని తెలియదా? 

‘ఎనర్జీ’ ప్రాజెక్టులన్నీ ఓపెన్‌గా వెబ్‌సైట్లోనే.. ఎవరైనా రావచ్చు 

ముందుకొచ్చిన వారిలో ఒక్కరినీ తిరస్కరించిన సందర్భమే లేదు 

ఇంకా 30వేల మె.వా ప్రాజెక్టులు.. రామోజీ కూడా రావొచ్చు 

ఈ వాస్తవాలు దాచి.. సన్నిహితులకే ఎనర్జీ అంటూ తప్పుడు రాతలు 

అదానీ ప్రపంచంలోనే విలువైన గ్రూప్‌.. అరబిందో దేశీ ఫార్మాలో నెంబర్‌–2 

రూ.10వేల కోట్ల సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న షిర్డీసాయి 

దీనికి కేంద్రం అనుమతి.. పీఎల్‌ఐ కింద ప్రోత్సాహకాలు 

ఏది నిజం? 

కంపెనీలకు ప్రాజెక్టులెలా ఇవ్వాలో రామోజీ చెబుతాడు! ఆ కంపెనీలతో ఆయన చెప్పినట్టే ఒప్పందాలు చేసుకోవాలట! వాళ్ల పెట్టుబడి, వాళ్లకిచ్చే రాయితీలు... అన్నిటినీ ఆయన నిర్దేశించినట్లే ఉండాలట!  అలా చేయకపోతే..? ఒక కంపెనీ వచ్చినా ఆ కంపెనీ అస్మదీయులదేనంటూ ముద్రవేస్తాడు.  ఒక కంపెనీ దివాలాతీసి వెళ్లిపోతే... ప్రభుత్వమే వెళ్లగొట్టిందని ప్రచారం చేస్తాడు. రాష్ట్రంలో పరిశ్రమలకు చీకటి రోజులు దాపురించాయంటాడు.  ఎందుకంటే ఆయన చేతిలో పత్రిక ఉంది. ఆయన రాతలు... ఆయనిష్టం. కానీ ఇక్కడున్నది ఆయన చెప్పినట్టల్లా ఆడే నారా చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదే..? ఈ ప్రభుత్వానికి తన ప్రాధాన్యాలేంటో తెలుసు!. వాటి కోసం ఎలా పనిచేయాలో తెలుసు! అందుకే ఈ ప్రభుత్వాధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డికి అందరూ అస్మదీయులే. ఎందుకంటే ఆయన ప్రజలందరినీ ‘నా వాళ్లే’ అనుకుంటారు కాబట్టి!!. 

భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయండంటూ ఎవరైనా టెండర్లు పిలుస్తారా రామోజీరావ్‌? అసలు అలా టెండర్లు పిలవటం ఏ రాష్ట్రంలోనైనా... ఎప్పుడైనా చూశామా? ప్రభుత్వం కొన్ని పరిశ్రమలు పెట్టాలని అనుకుంటే... వాటికి సంబంధించి ప్రతిపాదనలు ఆహ్వానిస్తుంది. అలా వచ్చిన వాటి నుంచి.. వాటి సామర్థ్యం,  గత అనుభవం, పేరు ప్రఖ్యాతుల ఆధారంగా ఎంపిక చేస్తుంది. ఇదీ పద్ధతి. కానీ... ‘సన్నిహితులకే ఎనర్జీ’ అంటూ మంగళవారం ‘ఈనాడు’ ఏడ్చిన ఏడ్పులో రవ్వంతైనా నిజముందా? ఆరు కాలాల కడుపుమంట తప్ప అసలేముంది అందులో? ప్రతి అక్షరం అబద్ధాలు పేర్చుకుంటూ రాసిన విషపు రాతల్లో అబద్ధాల గుట్టును విప్పే... ‘ఏది నిజం?’ ఇదిగో... 

మరీ అన్ని అబద్ధాలు అచ్చేయటానికి కొంచెమైనా విలువలంటూ అడ్డురావాలి కదా? ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటిదాకా 33,240 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను నిర్మించడానికి వీలైన ప్రాంతాలను గుర్తించి, నివేదికలు తయారు చేయించింది ప్రభుత్వం. మరో 10వేల మెగావాట్లకు కూడా ప్రాంతాలను గుర్తించింది. వాటన్నిటినీ నెడ్‌క్యాప్‌ వెబ్‌సైట్లో ఓపెన్‌గా ఉంచింది. తగిన ప్రతిపాదనతో ఎవరైనా ముందుకు రావచ్చు.

ఈ అవకాశాలను వివరించడానికే ఇటీవల ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ దావోస్‌కు వెళ్లారు. అక్కడ ఇవన్నీ వివరించిన మీదట... అదానీ, అరబిందో, షిర్డీ సాయి, అస్థా, ఇండో సోలార్, గ్రీన్‌కో సంస్థలు 14,650 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల కోసం అక్కడే ఒప్పందాలు చేసుకున్నాయి. ఇంకా 30వేల మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ఓపెన్‌గానే ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఆఖరికి రామోజీరావైనా... ఆయన అస్మదీయులు రాధాకృష్ణ, చంద్రబాబు, టీవీ 5 నాయుడు... ఎవరైనా!!.  

ఇవేమైనా చిన్న సంస్థలా? 
అదానీ గ్రూపు ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థల్లో ఒకటి. అరబిందో ఫార్మా రూ.2,500 కోట్ల వార్షిక లాభంతో దేశంలో టాప్‌–2 ఫార్మా కంపెనీ. షిర్డీ సాయి విషయానికొస్తే... దేశీయంగా ఉత్పత్తిని పెంచి.. చైనా దిగుమతులను తగ్గించడానికి కేంద్రం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) కింద భారీ ప్రాజెక్టును దక్కించుకుంది.

అది కూడా... అదానీ, జిందాల్, రిలయన్స్‌ వంటి సంస్థలతో పోటీపడి !!. రూ.10వేల కోట్లతో రాయాయపట్నంలో సోలార్‌ పీవీ మాడ్యూల్స్‌ త­యారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తోందీ సంస్థ. ఆ పరిశ్రమ అవసరాల కోసం (క్యాప్టివ్‌) 1,200 మెగావాట్ల ప్రాజెక్టు­తో పాటు, మరో 900 మెగావాట్ల పీఎస్‌పీ­ని చేపడుతోంది. కడప జిల్లాలో ఈ సంçస్థకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్ల ప్లాంటు దేశంలోని అతిపెద్ద పరిశ్రమల్లో ఒకటి.  

గ్రీన్‌కో సంస్థ చంద్రబాబు హయాంలోనే పీఎస్‌పీ ప్రాజెక్టును చేపట్టింది. ఇండోసోలార్, అస్థా గ్రీన్‌ సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో ఉన్నాయి. అంటే... అరబిందో, షిర్డీ సాయి సంస్థల ప్రమోటర్లకు పేరు చివర ‘రెడ్డి’ అని ఉంటే.... వాళ్లు అస్మదీయులైపోతారా? ఈ కంపెనీలకున్న అర్హతలేవీ చూడాల్సిన పనిలేదా? ఎందుకీ దుర్మార్గపు రాతలు? మరి ఇదే అరబిందో ఫార్మాతో కలిసి తన తమ్ముడు భాగస్వామిగా ‘ఆంధ్రా ఆర్గానిక్స్‌’ సంస్థను గతంలో చంద్రబాబే స్వయంగా పెట్టించాడు.

అప్పుడేమనుకోవాలి? అది ఎవరి అస్మదీయుల సంస్థ? షిర్డీ సాయి సంస్థకు అంతటి భారీ ప్రాజెక్టును పీఎల్‌ఐ కింద కేంద్రం ఇచ్చింది కాబట్టి ఇది కేంద్రానికీ అస్మదీయ సంస్థేనా? ఇంకా ఎన్నాళ్లీ దగుల్బాజీ రాతలు?  

ఎన్‌టీపీసీ, జెన్‌కో మీ కళ్లకు కనిపించలేదా? 
ప్రభుత్వ సంస్థలైన ఎన్‌టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ, జెన్‌కోలకు ప్లాంట్లు ఇవ్వలేదని, అంతా ప్రయివేటు వ్యక్తులకే కేటాయిస్తున్నారంటూ మరో దారుణమైన అబద్ధాన్ని వండేసింది ‘ఈనాడు’. మరి కర్నూలు జిల్లాలోని తీగలేరు వద్ద 1,650 మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులను ఎన్‌టీపీసీ సహా వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే కేటాయించడం రామోజీకి కనిపించదా? ఏపీ జెన్‌కోకు ప్రాధాన్యం ఇవ్వటం లేదని మరో అబద్ధం కూడా అలవోకగా రాసేశారు.

కానీ ఇప్పటికే సీలేరు వద్ద 1,350 మెగావాట్ల ప్రాజెక్టును అమలు చేస్తున్నది ఏపీ జెన్‌కో కాదా? ఎగువ సీలేరులో మరో 1,350 మె.వా., నంద్యాల జిల్లా బేతంచెర్లలో 500 మె.వా., యాగంటిలో 1,000 మె.వా., అన్నమయ్య జిల్లా వేంపల్లిలో 800 మె.వా.... ఇలా 5,000 మెగావాట్లు ఏపీ జెన్‌కో చేపట్టడానికి గుర్తించారు. ఈ వాస్తవాలెందుకు రాయరు? ఏపీ జెన్‌కోకు ఒక్క పీఎస్‌పీ కూడా ఇవ్వనట్లు ఎందుకీ దరిద్రపు రాతలు? ఎవరిని మోసం చేయటానికి? ఏ సంస్థయినా దాని సామర్థ్యం మేరకు అది ప్రాజెక్టులు చేపడుతుంది. అది కూడా రామోజీయే నిర్ణయిస్తే ఎలా?  

భూములనేమైనా ఉచితంగా ఇస్తారా? 
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను, నీటిని ఇస్తూ కూడా ప్రభుత్వం వారి నుంచి ఏమీ తీసుకోవటం లేదంటూ పనికిమాలిన రాతలు రాస్తున్న ఇలాంటి పత్రికల్ని ఏం చేయాలి? అసలు ఏ కంపెనీకైనా ప్రభుత్వ భూముల్ని కేటాయిస్తే ఛార్జీలు తీసుకోరా? చంద్రబాబు నాయుడి హయాంలో గ్రీన్‌కో సంస్థకు ఎకరానికి రూ.2.5 లక్షలు చొప్పున తీసుకుంటే.. ఈ ప్రభుత్వం దాన్ని రెట్టింపు చేసి... ఎకరా రూ.5 లక్షలుగా నిర్ణయించింది.

పైపెచ్చు గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద మెగావాట్‌కు సంవత్సరానికి తొలి పాతికేళ్లు రూ.లక్ష, ఆ తరువాతి పాతికేళ్లు రూ.2 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్టు కోసం తెచ్చే రుణాలను కంపెనీలు 25 ఏళ్లలో చెల్లిస్తాయి కనక... తదుపరి 25 ఏళ్లు ఫీజు ఎక్కువగా నిర్ణయించారు.

అదే ఎంఎన్‌ఆర్‌ఈ నిబంధనల కింద యూనిట్‌కు 2పైసల చొప్పున వసూలు చేస్తే ఎంతవుతుందో తెలుసా? సంవత్సరానికి మెగావాట్‌కు రూ.43,800. మరి దీనికన్నా రూ.లక్ష/రూ.2 లక్షలు ఎక్కువే కదా? ఇవేవీ ‘ఈనాడు’కు కనిపించవా? చంద్రబాబు హయాంలో భూముల రేట్లు తక్కువైనా... గ్రీన్‌ ఎనర్జీ చార్జీలనేవే పైసా కూడా లేకపోయినా... ఒక్క అక్షరం కూడా రాయని రామోజీరావు ఇప్పుడు చెలరేగిపోతున్నారెందుకు? అసలిలాంటి రోత రాతల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? 

రెవెన్యూపైనా తప్పుడు రాతలే... 
ఈ ప్రాజెక్టుల వల్ల ప్రభుత్వానికొచ్చే రెవెన్యూ పెద్దగా ఉండదంటూ నోటికొచ్చిన లెక్కలతో ‘ఈనాడు’ చెలరేగిపోయింది. కానీ ప్రస్తుతానికి అనుమతించిన 14,650 మెగావాట్ల ప్రాజెక్టులతోనే... కేవలం జీఎస్‌టీ రూపంలోనే ప్రభుత్వానికి రూ.3,956 కోట్ల ఆదాయం రానుంది. ఇవికాక భవిష్యత్తులో గ్రీన్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీల కింద రూ.8,058 కోట్ల ఆదాయం వస్తుంది.

వీటన్నిటికన్నా ముఖ్యంగా కేవలం ఈ ప్రాజెక్టుల వల్లే 58,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరకనుంది. పైపెచ్చు ఈ ప్రాజెక్టులు తమ సొంత అవసరాల కోసం మరో 7వేల మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాటిద్వారా మరో రూ.3,640 కోట్ల రెవెన్యూతో పాటు కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. వీటిని ప్రస్తావించకుండా అవాస్తవాలు రాస్తున్న రామోజీని ఏమనాలి?  

‘విద్యుత్‌ రేటు’పై ఒప్పందం సాధ్యమేనా? 
ఇక ఈ కంపెనీలు ఉత్పత్తి చేసే విద్యుత్తులో రాష్ట్రానికేమీ రాదని, ఇవి బయట విక్రయిస్తే రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదని చేతికొచ్చినట్లు రాసిపారేశారు రామోజీ. ఈ మేరకు రాష్ట్రం ఎలాంటి ఒప్పందం చేసుకోకపోవటం అన్యాయమని కూడా సూత్రీకరించారు. నిజానికివి ప్రయివేటు ప్రాజెక్టులు. ఈ ప్రాజెక్టులు పనిచేసేదే... డిమాండ్‌ –సప్లయ్‌ సూత్రానికి అనుగుణంగా. అంటే... ఈ ప్రాజెక్టులకు ఎగువన– దిగువన రెండు రిజర్వాయర్లుంటాయి.

పగటిపూట డిమాండ్‌ తక్కువుంటుంది కనక సోలార్‌ లేదా విండ్‌ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ... ఆ విద్యుత్తు సాయంతో నీటిని దిగువ నుంచి ఎగువన ఉండే రిజర్వాయర్లోకి పంపిస్తారు. ఇక సోలార్‌ అందుబాటులో లేనపుడు, డిమాండ్‌ పీక్‌లో ఉన్నపుడు ఎగువ రిజర్వాయరు నుంచి దిగువకు నీటిని పంపించటం ద్వారా సహజంగా విద్యుదుత్పత్తి చేస్తారు. అది పీక్‌ సమయం కనక అప్పుడు ఛార్జీలు కాస్త ఎక్కువ ఉంటాయి.

అలా ఛార్జీలు ఎక్కువ వస్తాయి కనకే ఈ కంపెనీలు మనగలుగుతాయి. అందుకే ప్రభుత్వం వాటితో మొదటి ప్రాధాన్యత తమకే ఇవ్వాలని ఒప్పందం చేసుకుంది. రేటు అనేది ఆ సమయంలో మార్కెట్‌ డిమాండ్‌ను బట్టి ఉంటుంది కనక అది మార్కెట్‌ చేతుల్లోనే ఉంటుంది. ఈ వాస్తవం రామోజీరావుకు తెలియందేమీ కాదు. కానీ... ప్రభుత్వంపై బురద జల్లటమనే ఎజెండాలో ఇదీ ఒక భాగం కనక... నిజాలు రాయరు. 

రైతులకు ఎంత లాభమో చెప్పరేం? 
రైతులు గనక సోలార్‌ ప్రాజెక్టులకు భూములిస్తే వారికి ఎకరాకు సంవత్సరానికి రూ.30వేల చొప్పున కంపెనీలు లీజు మొత్తాన్ని చెల్లిస్తాయి. ఇందులో భాగంగానే ఒకేచోట 200, 300 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టులు పెట్టడానికి వీలుగా రైతులంతా కలిసి 1500 ఎకరాల వరకూ ఇవ్వగలిగే పరిస్థితి ఉంటే...  ప్రభుత్వమే లీజుకు తీసుకుంటుందని ముఖ్యమంత్రి జగన్‌ నేరుగా ప్రకటించారు.

మరి ఆ లీజుకిచ్చేది అస్మదీయులా? తీసుకునేది అస్మదీయులా? రైతులకొచ్చే లాభం గురించి ఎందుకు రాయరు? సాగుకు పనికిరాని భూములున్న చోట మూడెకరాలున్న రైతుకు కూడా సంవత్సరానికి రూ.లక్ష వరకూ వచ్చే అవకాశం ఉంది కదా? దీన్ని రైతులంతా స్వాగతిస్తుంటే ఆ విషయమెందుకు రాయరు రామోజీ? 

డేటా సెంటర్‌ పోలేదు... మరిన్ని పెట్టుబడులొచ్చాయి 
అదానీ డేటా సెంటర్‌ తరలిపోతోందని, తాము కష్టపడి తెచ్చిన ప్రాజెక్టు వెళ్లిపోతోందని గగ్గోలు పెట్టింది చంద్రబాబు నాయుడైతే... దానికి సన్నాయి నొక్కులు నొక్కుతూ అదానీ డేటా సెంటర్‌ వెళ్లిపోతే ఎంత నష్టమో ఆనాడు రాసింది ‘ఈనాడే’. నిజానికి డేటా సెంటర్‌ ఎక్కడికీ పోలేదు. దానికి కేటాయించిన భూములు తగ్గాయంతే. మరి అదే అదానీ సంస్థ ఆ డేటా సెంటర్‌కు అదనంగా ఇపుడు గ్రీన్‌ ఎనర్జీలో, పోర్టుల్లో దూకుడుగా పెట్టుబడులు పెడుతుంటే ఎందుకీ ఏడుపు? మీ మనవరాలి వియ్యంకులు కాబట్టి మీరు అమర రాజాను వెనకేసుకుంటూ వస్తున్నారేమో!!.

కానీ అమరరాజా సంస్థకు జరిగిన అన్యాయమేంటి? కాలుష్యం నిబంధనలను మించి ఉన్నపుడు... వాటిని సరిచేసుకోవాలంటూ నోటీసులివ్వటం తప్పా? మీ బంధువుల సంస్థలైతే మాత్రం నోటీసులివ్వకూడదా? ఆ సంస్థనేమీ అక్కడి నుంచి వెళ్లిపోమనలేదు కదా? నోటీసులిచ్చినపుడు ఆ నోటీసుల్లో పేర్కొన్న అంశాలను సరిచేసుకుంటే చాలు కదా? మరి అదే అమరరాజా ఇప్పుడు అదే చిత్తూరు జిల్లాలో మరో 250 కోట్ల రూపాయలతో కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తానని ప్రకటించింది కదా? అదెందుకు ప్రస్తావించరు రామోజీ? 

అలాంటి సలహాలు ఏనాడూ ఇవ్వరా? 
‘ఈనాడు’ ఏనాడూ మంచి సలహాలివ్వదా? రాష్ట్రానికి అంత సత్తా లేదని తెలిసి కూడా... అంత ఖర్చును భరించలేమని తెలిసి కూడా అమరావతి పేరిట లక్షల కోట్ల రాజధానిని గ్రాఫిక్స్‌ సాయంతో చంద్రబాబు ప్లాన్‌ చేసినపుడు ఏమయింది రామోజీ మీ విజ్ఞత? విభజన కష్టాల్లో ఇరుక్కున్న ఆంధ్రకు అంతటి సత్తా లేదని, ఆచరణ సాధ్యమైన యోచన చెయ్యాలని మీ పత్రికా ముఖంగా గానీ... మీ ప్రయివేటు సంభాషణల్లో గానీ చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదు? నాలుగైదు వేల కోట్లు ఖర్చు చేస్తే విశాఖపట్నం చక్కని రాజధానిగా మారి ఈ రాష్ట్రానికి వెన్నుదన్నుగా ఉంటుందని మీకు అనిపించలేదా? అలా అనిపించని మీదీ ఒక పత్రికేనా? అదీ ఒక ప్రభుత్వమేనా? 

ఎంఎస్‌ఎంఈలను పట్టించుకున్నారా? 
లక్షల మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని (ఎంఎస్‌ఎంఈ) చంద్రబాబు ఏనాడూ పట్టించుకున్నది లేదు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు (ఇన్సెంటివ్‌లు) సమయానికిస్తేనే ఇవి బతికి బట్టకడతాయని తెలిసి కూడా... ఆ ప్రయత్నం చేస్తే ఒట్టు. నిర్లక్ష్యంతో వీటికి సమాధికట్టేశారు. ఒక్కో ఎంఎస్‌ఎంఈలో సగటున 10 మంది ఉపాధి పొందుతున్నారనుకున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.33 లక్షలకు పైగా ఎంఎస్‌ఎంఈలలో 23 లక్షలకు పైగా ఉపాధి పొందుతున్నారు.

అంత ముఖ్యమైన రంగాన్ని బాబు చిదిమేసినా... రామోజీ పెన్నెత్తితే ఒట్టు. కోవిడ్‌ కుంగదీíసినా సరే... ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ఈ ప్రభుత్వం నభూతో.. అన్న రీతిన ఆదుకుంది. ప్రోత్సాహకాలను సమయానికి ఇవ్వటమే కాకుండా... అలా ఇచ్చే పటిష్టమైన వ్యవస్థను తీసుకొచ్చింది.

అందుకే ఈ మూడున్నరేళ్లలో కొత్తగా 1,08,206 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. రూ.20,537 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయిన ఈ యూనిట్ల ద్వారా 10.04 లక్షల మందికి ఉపాధి కలిగిన విషయాన్ని రాయరెందుకు రామోజీ? ఎప్పుడూ ఉద్యోగాల్లేవని, ఉన్నవి ఊడిపోతున్నాయని అబద్ధాలు రాయటం తప్ప ఇంత మందికి ఉపాధి కల్పించిన వాస్తవాన్ని ప్రస్తావించరెందుకు? ఇంకెప్పుడు మారతారు? 

మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నెంబర్‌–1 
ఏ పనైనా ఎంత బాగా చేశామన్నదానికి ఫలితాలే గీటురాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలన స్వర్ణయుగం అనేది రామోజీరావు నిత్యం అచ్చేసే కథనాల సారాంశం. ఇక చంద్రబాబైతే స్వర్ణయుగాన్ని మించి... అంటుంటారు. మరి ఫలితమో? చూద్దాం. 

పరిశ్రమలకు ఈ రాష్ట్రం ఎంత స్నేహపూర్వకమైన స్వాగతమిస్తోందన్నది రామోజీ, చంద్రబాబు చెప్పనే చెప్పరు. కానీ సులభతర వాణిజ్య విధానాన్ని అవలంబించే రాష్ట్రాల్లో (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) గడిచిన మూడు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌–1గా నిలుస్తూ వస్తోంది.

ఇక్కడ పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం లేకపోతే... పరిశ్రమలు తాము సంతోషంగా ఉన్నామని చెప్పకపోతే ఈ ర్యాంకు ఎందుకొస్తుంది? మూడేళ్లుగా దేశంలో ఏ రాష్ట్రానికీ దక్కని ఈ హోదా మన రాష్ట్రానికే ఎందుకు దక్కుతోంది? అర నిమిషంలో తనను ముఖ్యమంత్రి ఒప్పించారంటూ... 6 నెలల్లో ఆలోచన నుంచి అనుమతులన్నీ వచ్చి, భూ కేటాయింపు పూర్తయి శంకుస్థాపన చేయగలిగామని సాక్షాత్తూ టెక్‌ మహీంద్రా సీఈఓ గుర్నానీ ప్రశంసించారు.

ఆయన తన కుమారుడి బయో ఇథనాల్‌ ప్లాంటు ‘అస్సాగో’కు ఏపీనే ఎంచుకున్నారు. ఏపీలో పరిశ్రమలకు రెడ్‌ కార్పెట్‌ వేస్తున్నారని చెప్పింది ఏకంగా ఐటీసీ సీఈఓ సంజీవ్‌ పురి. ఏపీలో అతిపెద్ద స్పైసెస్‌ ప్రాసెస్‌ ప్లాంట్‌ను గత నెల్లోనే ఆయన ప్రారంభించారు.

ఇక ఆదిత్యబిర్లా గ్రూపు వైఎస్సార్‌ జిల్లాలో గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌కు భూమి పూజ చేసిన రెండు నెలలకే తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురంలో కాస్టిక్‌ సోడా యూనిట్‌ను ప్రారంభించింది. తమ గ్రూపు సంస్థలకు ఏపీ కీలకమని, మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే సత్తా రాష్ట్రానికి ఉందని ఆ గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లాయే చెప్పారు. ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ అనే నినాదం ఇప్పుడు ‘జగన్‌ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’ అనేట్లుగా మారిందనేది డిక్సన్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌ పంకజ్‌ శర్మ ప్రశంస. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల ఉత్పత్తి కేంద్రానికి కొప్పర్తి ఈఎంసీలో భూమి పూజ చేశారాయన.

ఇక రూ.600 కోట్లు పెట్టుబడి పెడదామనుకున్నామని, దాన్నిపుడు రూ.2,600 కోట్లకు పెంచుతున్నామని చెప్పింది సాక్షాత్తూ సెంచురీ ఫ్లైవుడ్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ భజాంక. తమిళనాడులో యూనిట్‌ ఏర్పాటు చేయాలనుకున్నా... రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో వైఎస్సార్‌ జిల్లా బద్వేల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కూడా ఆయనే చెప్పారు. ఇక తొమ్మిది రాష్ట్రాల్లో సిమెంటు ప్లాంట్లున్న శ్రీసిమెంట్‌... తొలిసారి ఏపీలో అడుగుపెడదామని నిర్ణయించుకున్నది ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిని శ్రీసిమెంట్‌ ఎండీ హరిమోహన్‌ బంగూర్‌ కలిశాకే.

గుంటూరులో రూ.1,500 కోట్లతో ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించింది కంపెనీ. మరి ఒక్క కంపెనీ కూడా రాలేదని... ఇప్పటికే ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని విష ప్రచారమెందుకు? అసలు ఏపీ నుంచి ఇటీవలి కాలంలో వెళ్లిపోయిన కంపెనీ పేరు ఒక్కటి చెప్పండి రామోజీ?  

కొత్తగా నాలుగు పోర్టులు తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లు రావటంతో పాటు ఆక్వా యూనివర్సిటీ సైతం వచ్చాయంటే అది ప్రభుత్వ చిత్తశుద్ధి వల్ల కాదా? కడప, కర్నూలు ఎయిర్‌పోర్టులతో పాటు ఎన్నో బాలారిష్టాల్లో చిక్కుకున్న భోగాపురం ఎయిర్‌పోర్టు కూడా ఒక కొలిక్కి వస్తున్నదంటే అది రాష్ట్ర ప్రభుత్వ కృషివల్లనే కదా? రాష్ట్రంలో టైర్‌–1 నగరాలు లేవు కాబట్టి ఆసుపత్రుల్లో టెర్షియరీ కేర్‌ (స్పెషలిస్టు సేవలు) తక్కువే. అయినా సరే ప్రభుత్వం ఏకంగా 17 మెడికల్‌ కాలేజీలను తెస్తున్నదంటే ఇది ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం కాదా?  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top