నాగేశ్వరరావుకు మద్దతుగా బైఠాయించిన సిబ్బంది
ఎస్‌ఈ కార్యాలయం ముందు ధర్నాలో ఈఈ నాగేశ్వరరావు
ఒంగోలు సబర్బన్: అధికార టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులు నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ బీవీ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఒంగోలు సంతపేటలోని ఎంపీడీఓ కార్యాలయానికి ఆనుకొని ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ జిల్లా ఎస్‌ఈ కార్యాలయం ముందు ఆదివారం నాగేశ్వరరావు ధర్నా చేపట్టారు. ఎస్‌ఈ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ముందు భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఒంగోలుకు చెందిన ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్, అధికారపార్టీ మనిషి బొమ్మినేని రామాంజనేయులు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపి నియోజకవర్గంలో గతంలో చేసిన పనులకు బిల్లులు రాలేదని బొమ్మినేని బెదిరిస్తున్నారని వివరించారు.
ఆ బిల్లుల గురించి తనకేమీ తెలియదని, తాను జమ్మల మడక నుంచి ఈ ఏడాది సెపె్టంబర్ 9న బదిలీపై వచ్చి ఇక్కడికి వచ్చానని వెల్లడించారు. బిల్లు కోసం రామాంజనేయులు తనను ఫోన్‌లో బెదిరించారని, ఈ విషయాన్ని ఎస్‌ఈ బాలశంకర్‌రావు దృష్టికి తీసుకెళితే ఆయన రామాంజనేయులును పిలిపించారని, ఆ సమయంలో ఎస్‌ఈ ముందే పోలీసులతో బట్టలూడదీసి కొట్టిస్తానని కాంట్రాక్టర్ తనను బెదిరించారని నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ బొమ్మినేని రామాంజనేయులుతో తనకు ప్రాణహాని ఉందని ఎస్‌ఈకి ఫిర్యాదు ఇచ్చినా పట్టించుకోలేదని, ఆ ఫిర్యాదును కలెక్టర్‌కూ పంపానని వివరించారు.
ఆదివారం ఒంగోలు ఎస్‌ఈ కార్యాలయంలో సమీక్షకు వచ్చిన రాష్ట్ర సీఈ ఎన్‌వీవీ సత్యనారాయణకూ కాంట్రాక్టర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చానని, ఆయనా పట్టించుకోలేదని విమర్శించారు. దీనికి నిరసనగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహం ముందు ధర్నాకు దిగినట్లు వెల్లడించారు. ఒంటరిగా నిరసనకు దిగిన ఈఈ బీవీ నాగేశ్వరరావుకు మధ్యాహ్నం తర్వాత మరో నలుగురు అధికారులు, 30 మంది సిబ్బంది మద్దతు పలికారు. ఆయనతోపాటు ధర్నాలో బైఠాయించారు.


