ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్‌ఫ్రా ఫోకస్‌’ అవార్డు | Economic Times Award for Andhra Pradesh Ports | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్‌కు ‘ఇన్‌ఫ్రా ఫోకస్‌’ అవార్డు

Sep 9 2022 3:45 AM | Updated on Sep 9 2022 2:52 PM

Economic Times Award for Andhra Pradesh Ports - Sakshi

సాక్షి, అమరావతి: తీరప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశీయ ఇన్‌ఫ్రా రంగంపై ప్రముఖ వాణిజ్య దినపత్రిక ఎకనామిక్‌ టైమ్స్‌ ఏటా ప్రకటించే అవార్డు ఏపీ పోర్టులకు దక్కింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, అత్యుత్తమ ప్రగతికి గుర్తింపుగా ఇన్‌ఫ్రా ఫోకస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కు రాసిన లేఖలో ఎకనామిక్‌ టైమ్స్‌ పేర్కొంది.

సెప్టెంబర్‌ 27న ఢిల్లీలోని హయత్‌ రెసిడెన్సీలో జరిగే 7వ ఇన్‌ఫ్రా ఫోకస్‌ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి అమర్‌నాథ్‌ను టైమ్స్‌ గ్రూప్‌ ఆహ్వానించింది. నీతి ఆయోగ్‌ సలహాదారుడు సుధేందు జే సిన్హా అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్న వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులను పరిశీలించి అవార్డుకు ఎంపిక చేసింది.

సముద్ర వాణిజ్యంపై దృష్టి
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రూ.25,000 కోట్ల వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులతో పాటు తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను నిర్మిస్తోంది. దీనికి తోడు పోర్టులను అనుసంధానిస్తూ జాతీయ రహదారులు, రైల్వే లైన్ల నిర్మాణ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖ, అనంతపురం వద్ద రెండు భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను అభివృద్ధి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడమే కాకుండా కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద మరో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల నిర్మాణం చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది.

వీటితో పాటు విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కృష్ణపట్నం వద్ద క్రిస్‌ సిటీ పేరుతో భారీ పారిశ్రామిక వాడ నిర్మాణానికి సంబంధించి రూ.1,054.6 కోట్ల విలువైన పనులకు టెండర్లను పిలిచింది. కాకినాడ వద్ద బల్క్‌ డ్రగ్‌ పార్కు, విశాఖ అచ్యుతాపురం, నక్కపల్లి, రాంబిల్లి వద్ద పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోర్టు ఆథారిత అభివృద్ధి పనులను వివరిస్తూ ఎకనామిక్‌ టైమ్స్‌ జాతీయ స్థాయిలో కథనాన్ని ప్రచురించనున్నట్లు లేఖలో పేర్కొంది.

ప్రతి 50 కి.మీ.కి పోర్టు లేదా హార్బర్‌: మంత్రి అమర్‌నాథ్‌
974 కి.మీ పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకి పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందదాయకం. సీఎం జగన్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు  కేంద్రానికి, పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement