వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆగ్రహం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం అంతా తప్పుల తడక అని, ఒక అబద్ధాల పుట్ట అని కనీసం ఆ లెక్కలకు ఆధారాలు కూడా చూపించలేకపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యుడు దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టి చంద్రబాబు మరోసారి అంకెల గారడీ చేశారని ఆయన దుయ్యబట్టారు.
గత వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందంటూ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. కాగ్, ఇతర ఆర్థిక సంస్థల లెక్కలు చూస్తే ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో ఇట్టే అర్థం అవుతోందని చెప్పారు. శ్వేతపత్రం పేరుతో సీఎం చంద్రబాబు విషంకక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఇంకా ఏమన్నారంటే..
అన్నీ కాకిలెక్కలే..
‘‘రెండేళ్లలో సూపర్ సిక్స్ పథకాల ఖర్చు రూ.31,483 కోట్లే. వాస్తవంగా ఖర్చు చేయాల్సింది రూ.2,39,628 కోట్లు. అంటే మొత్తం హామీల అమలు ఖర్చులో అది 13 శాతమే. తల్లికి వందనంలో రూ.15 వేలకు బదులు రూ.13 వేలు అంటూ.. రూ.8 – 9 వేలే ఇచ్చారు. డ్వాక్రా రుణ పరిమితి పెరగలేదు. సున్నా వడ్డీకి నిధులివ్వరు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు ఇంకా దు్రష్పచారం చేస్తున్నారు. రూ.14 లక్షల కోట్లు అన్నారు. పుస్తకాల గణాంకాల్లో చూస్తే రూ.6.46 లక్షల కోట్ల అప్పు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లలోనే దాటేశారు.
వైఎస్సార్‌సీపీ పాలనలో ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వాడేసినట్లు అబద్ధాలు చెబుతున్నారు. వ్యవసాయ రంగం ఆదాయంపైన, తలసరి ఆదాయంపైనా చంద్రబాబు కాకి లెక్కలు చెబుతున్నారు. కూటమి పాలనలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తమైంది. జీఎస్‌డీపీ వృద్ధి నాడు వైఎస్సార్‌సీపీ హయాంలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉండేది. అయినా విధ్వంసం అంటూ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడానికే చంద్రబాబు కుట్ర. అందుకే జీతభత్యాలపై అసత్యాలు, తప్పుడు లెక్కలు చెబుతున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆస్తుల్ని తాకట్టు పెట్టిందని అబద్ధాలు చెబుతున్నారు.
కానీ ఇప్పుడు ఇదే వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల రుణం కోసం ఏకంగా రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదను తాకట్టు పెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ గణాంకాల ప్రకారం ఏపీకి రూ.1.78 లక్షల కోట్లు పీపీపీ విధానంలో వచ్చాయి. ఇందులో 41 శాతం పెట్టుబడులు ఇప్పటికే ఉపసంహరించుకున్నారు. 30 శాతం ప్రీ డీపీఆర్ స్థాయిలో ఉన్నాయి. కేటాయించినవి ఐదు ప్రాజెక్టులు మాత్రమే. మరో రూ.14 వేల కోట్లు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు. ఇందులో 8 ప్రభుత్వ ఆస్పత్రులు, రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టులు మాత్రమే. ఇవి ఏ రకంగా మీ ఘనతో చెప్పాలి’’ అని దువ్వూరి పేర్కొన్నారు. ఆర్బీఐ బాండ్ల వడ్డీ రేటు కంటే చంద్రబాబు ప్రభుత్వమే ఎక్కువ వడ్డీకి రుణాలు తెస్తోందన్నారు. అబద్ధాల శ్వేతపత్రం పేరుతో డ్రామా చేశారని ఆయన వివరించారు.


