
కోనసీమలో దసరా ప్రత్యేకం
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తితో 169 ఏళ్లుగా సాగుతున్న ప్రదర్శన
ఇటీవల పెరిగిన ఆదరణ
ఎన్‌ఆర్‌ఐలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రాక
మైసూర్ తరువాత... ‘పచ్చని సీమ’లోనే ‘దసరా’ శోభ
సంక్రాంతికి ప్రభల తీర్థం.. దసరాకు చెడీ తాలింఖానా
సాక్షి, అమలాపురం/అమలాపురం టౌన్: కోనసీమ అనగానే ప్రకృతి అందాలు, పర్యాటక కేంద్రాలకే కాదు.. సంస్కృతీ సంప్రదాయాలకు.. ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తే పల్లె ముస్తాబవుతుంది. నింగిలోని ఇంద్ర ధనస్సులు ‘ప్రభ’లుగా మారి నేలన నడయాడతాయి. తీర్థాలతో ఈ ప్రాంతం హోరెత్తుతుంది. ఇక దసరా వస్తే చెడీ తాలింఖానా ప్రదర్శన.. అమ్మవార్ల వాహనాల ఊరేగింపులతో జనజాతరగా మారిపోతుంది. ఒకప్పుడు స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో నేర్చుకున్న ఈ చెడీ తాలింఖానా వీర విద్య రానురానూ ప్రజల సంప్రదాయ కళలలో ఒక భాగమైంది.
శతాబ్దాల చరిత్ర
అజ్ఞాతం ముగిసిన తరువాత జమ్మి చెట్టు మీద ఉన్న పాండవుల ఆయుధాలు చేతులకు వచ్చినట్టుగా ఇక్కడ దసరాకు ముందు దాచి ఉంచిన కత్తులు కొత్తగా పదునెక్కుతాయి. బరిసెలు బయటకు వస్తాయి. రాత్రి వేళల్లో అగ్గిబరాటాలు నిప్పులు కక్కుతాయి. లేడి కొమ్ములు, పొడవాటి కర్రలు కళాత్మకంగా తిరుగుతుంటాయి. ఆపై అమ్మవారి ఊరేగింపులతో కోనసీమలో దసరా కొత్త పుంతలు తొక్కుతుంది.దసరా ఉత్సవాలు కర్ణాటకలోని మైసూరు తరువాత కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఇంచుమించు రెండు శతాబ్దాల నుంచి జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.
ప్రాచీన యుద్ధాలను తలపించే చెడీ తాలింఖానా వీరత్వానికి మారుపేరుగా నిలుస్తోంది. శతాబ్దాల చరిత్ర ఉన్న తాలింఖానాకు నేటికీ ఆదరణ చెక్కు చెదరలేదు. కర్రలు, కత్తులు, లేడి కొమ్ములతో వారు చేసే ప్రదర్శన ప్రేక్షకులను గగుర్పాటుకు గురి చేస్తాయి. యువకుల నుంచి వృద్ధుల వరకూ వయోభేదం మరచి చేసే తాలింఖానా విన్యాసాలు వీక్షకులను మంత్రముగ్ధులను చేస్తాయి. అన్ని వీధులు ఈ ప్రదర్శనలతో నిండిపోతాయి. ఇంచుమించు నెల రోజుల ముందు నుంచే ఈ ప్రదర్శనకు అవసరమైన శిక్షణ పొందుతారు. కొత్త తరం కూడా ఈ విద్యా ప్రదర్శనకు ఉత్సాహంగా ముందుకు రావడం విశేషం.
మంత్రముగ్ధులను చేసేలా..
దసరా ఉత్సవాలలో భాగంగా పురవీధుల్లో చెడీతాలింఖానా ప్రదర్శన జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబరు 2వ తేదీ రాత్రి అంతా ఈ కార్యక్రమం జరుగనుంది. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీ తాలింఖానా విద్య ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్లకు గంతలు కట్టుకుని మనిషి మీద, కంఠం, నుదిటిపై, పొత్తి కడుపుల మీద కొబ్బరి కాయలు, కూరగాయలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు.

అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులు వేగంగా.. చురుగ్గా కదుపుతూ యువకులు చేసే విన్యాసాలు రాచరిక యుద్ధ సన్నాహాలను తలపిస్తాయి. ఈ ప్రదర్శనలో ఏమాత్రం ఏమరు పాటు జరిగినా ప్రాణాలకు ప్రమాదం. అయినా కూడా అత్యంత ధైర్య సాహసాలతో శిక్షణ పొందిన ఆరేళ్ల చిన్నారుల నుంచి అరవై ఏళ్ల వృద్ధుల వరకు చేసే ప్రదర్శన మంత్రముగ్ధులను చేస్తుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులైనా, ఎన్‌ఆర్‌ఐలైనా ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతుంటారు.అమలాపురంలో చెడీ తాలింఖానా విద్య ప్రదర్శన వెనుక స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ఉందని స్థానికులు చెబుతుంటారు.

బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఈ విద్య స్థానికంగా 1835 కొంకాపల్లిలో మొదలైంది. అయితే దసరా వేడుకలలో 1856లో మహిపాల వీధిలో రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. ఇది ఇక్కడ ప్రారంభమై 190 సంవత్సరాలు అవుతోంది. అప్పటి నుంచి ఈ ప్రదర్శన నిర్విఘ్నంగా సాగుతోంది. వీటితో పాటు గండువీధి మైనర్స్ పార్టీ, నల్లా వీధి, శ్రీరామపురం మైనర్స్ పార్టీ, రవణం మల్లయ్య వీధి తాలింఖానా ప్రదర్శనలకు దశాబ్దాల చరిత్ర ఉంది.
చెడీ తాలింఖానా ప్రదర్శనతో పాటు పట్టణానికి చెందిన ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, శక్తి వేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్‌మార్ బ్యాండ్‌లు, విద్యుత్ దీపాలంకరణలతో వాహనాలు ముందుకు సాగుతాయి.
కొంకాపల్లి ఏనుగు అంబారీ వాహనం, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మవారు వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలు పురవీధుల్లో ఊరేగింపుగా వెళతాయి. జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణా ప్రాంతం నుంచి కూడా ఈ ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురానికి తరలివస్తారు.
తరతరాలుగా నిర్వహిస్తున్నాం
దశాబ్దాల కాలం నుంచి అమలాపురంలో ఈ ప్రదర్శన జరుగుతోంది. మా తాతలు మాకు వారసత్వంగా అందించారు. మేము మా వారసులకు ఈ విద్యను అందిస్తాం. ఈ ప్రాచీన విద్యను ప్రభుత్వాలు గుర్తించాల్సి ఉంది.
– పనస బుజ్జి, నిర్వహకుడు, కొంకాపల్లి, అమలాపురం
రోజుకు ఎనిమిది గంటల శిక్షణ
దసరాకు ముందు ఆయుధ పూజ చేసిన తరువాత సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు శిక్షణ ఇస్తాం. రోజుకు 150 నుంచి 250 మంది వరకు గురువుల వద్ద శిక్షణ పొందుతారు. ఎక్కువగా చిన్నారులు, యువత రావడం వల్ల భవిష్యత్‌లో కూడా ఈ ప్రదర్శన నిరి్వఘ్నంగా సాగుతుందనే ఆశ మాకుంది. – అబ్బిరెడ్డి మల్లేష్, నిర్వాహకుడు, మహిపాల వీధి, ఎన్‌ఆర్‌ఐ (అమెరికా)