AP: కలల కొలువు దక్కింది.. జీవిత చిత్రం మారింది 

DSC 1998 Qualified Candidates Are Happy To Get The Job - Sakshi

ఉద్యోగం వచ్చిన ఆనందంలో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులు

ఎట్టకేలకు తమ జీవితాల్లో మార్పు వచ్చిందని సంతోషం

పలు చోట్ల సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

ఇంతలోనే ఎంత మార్పు. నిన్నటి వరకూ.. ఉద్యోగం కోసం అలుపెరగని పోరాటంలో అలసిపోయారు. కలలు గన్న ప్రభుత్వ కొలువు వస్తుందో రాదో తెలియదు. 24 ఏళ్లుగా వచ్చిన ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి గానీ, కొలువు మాత్రం ఇవ్వడంలేదు. కొంతమంది రిటైర్మెంట్‌ వయసుకు చేరుకున్నారు. మరికొందరు మరో పని చేయలేక, పోషణ భారం అవుతుందేమోనని భయంతో పెళ్లి కూడా చేసుకోకుండా జీవితాన్ని గడిపేశారు.

వారి పరిస్థితి ఇలా ఉండగా.. 1998 డీఎస్సీ అర్హులకు ఉద్యోగాలు ఇస్తున్నట్టు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రకటించటంతో మసకబారిపోతున్న వారి జీవితాల్లో వెయ్యివోల్టుల వెలుగు నిండింది. అధికారులు ప్రకటించిన అర్హుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఒక్కరోజులోనే వారి జీవితాలు మారిపోయాయి. ఆ ఆనందంలో పలుచోట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులు  జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ టీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చిలుకు శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారం 1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.  
– సీతమ్మధార(విశాఖ ఉత్తర)/ఎల్‌.ఎన్‌.పేట/    పాతపట్నం/సత్తెనపల్లి 

చింపిరి జుట్టు పోయింది.. 
చింపిరి జుట్టు. చిరిగిన దుస్తులు. డొక్కు సైకిలు. ఆ సైకిల్‌పై బట్టలు అమ్ముతూ జీవనోపాధి. భారమైన బతుకుపోరులో పెళ్లి అనే ఊసేలేదు. ఒక రోజు తింటే మరో రోజు పస్తులుండే ఒంటరి జీవితం. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు పరిస్థితి ఇది. అర్హుల జాబితాలో పేరు ఉండటంతో ఇప్పుడు ఆయన జీవితమే మారిపోయింది. ఎట్టకేలకు ఉద్యోగస్తుడు అయిన ఆయన్ను స్థానిక యువకులు సెలూన్‌ షాప్‌కు తీసుకెళ్లి నీట్‌గా క్రాప్‌ చేయించారు. కొత్తబట్టలు కట్టించి.. కేక్‌ కట్‌ చేయించి సంబరాలు చేశారు. అల్లాక కేదారేశ్వరరావును ఇప్పుడు మాస్టర్‌ కేదారేశ్వరరావు అని పిలుస్తున్నారు.  

ఎదురుచూపులకు తెరపడింది.. 
డీఎస్సీ– 1998 అర్హుల జాబితాకు గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో సత్తెనపల్లిలోని లక్కరాజు గార్లపాడు సెంటర్‌కు చెందిన 54 ఏళ్ల గుంటూరు మల్లేశ్వరరావు సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడింది. ఇన్నాళ్లు ఉద్యోగంలేక, వివాహం కూడా అవ్వక తీవ్ర మానసిక క్షోభకు లోనయ్యాడు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఇంటిలోనే ఉన్న ఆయన వద్దకు వెళ్లి.. నీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది అని సహచరులు చెప్పగానే ఆయన కంటివెంట 
నీటి ధార వర్షించింది. కన్నీళ్లు తుడుచుకుంటూ.. ఇకపై తాను ప్రభుత్వ ఉద్యోగినని ఆనందంతో మురిసిపోయాడు. 

మా జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నాడు 
1998లో డీఎస్సీ క్వాలిఫై అయ్యాను, అప్పట్లో టీచర్‌ పోస్టులు ఉన్నప్పటికీ భర్తీ చేయకుండా నిరుద్యోగులతో పాటు మా జీవితాలతో చంద్రబాబు ఆడుకున్నాడు. జగన్‌మోహన్‌రెడ్డి ఫైల్‌పై సంతకం చేశారు. నాకు ఇప్పటికే 62 సంవత్సరాలు వచ్చాయి. జీవితంలో ఒక్కరోజైనా ప్రభుత్వ ఉద్యోగం చేసి చనిపోవాలనుకున్నాను. 1998లో సీఎంగా జగనే ఉండుంటే మాకు అప్పుడే ఉద్యోగాలు వచ్చేవి. 
– నరవ అప్పారావు, శెట్టిపాలెం, మాకవరం మండలం

కల నెరవేర్చిన సీఎం  
24 ఏళ్లు పోరాటం చేశాం. ఇన్నాళ్లకు సీఎం వైఎస్‌ జగన్‌ మాకు ఉద్యోగాలు ఇప్పించారు. కల నెరవేరింది.  సీఎంకు మా కుటుంబమంతా రుణపడి ఉంటాం.               
– రాధా రుక్మిణి, అక్కయ్యపాలెం

మాకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్‌దే 
వయసు పెరిగిన మాకు ఉద్యోగాలు ఇప్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిదే. నాకు ఇప్పడు 62 సంవత్సరాలు. మరో 8 నెలలు మాత్రమే సర్వీస్‌ ఉంది. ఇలాంటి సమయంలో నాకు ఉద్యోగం రావడం నమ్మలేని నిజం. మా కుటుంబాలు అన్నీ రాబోయే ఎన్నికల్లో జగన్‌కే ఓటు వేస్తాయి. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం ఉద్యోగాలు ఇచ్చారు.     
– డి.ఎం.రావు, విశాఖ జిల్లా

పదిరోజుల్లో రిటైరవుతా  
జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను. మా కుటుంబంతో పాటు రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తాను. జూన్‌ నెలతో నాకు 62 సంవత్సరాలు పూర్తి అవుతాయి. నేను రిటైర్‌ అవడానికి ఇంక పది రోజులే సమయం ఉంది. ఈ సమయంలో నాకు ఉద్యోగం వస్తుందంటే నమ్మలేకుండా ఉన్నాను.  
    – తమ్మిరాజు, విశాఖ జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top