
సాక్షి, విజయవాడ: ఏపీ టెన్త్ మూల్యాంకనంలో ఈసారి మామూలు తప్పులు చోటు చేసుకోలేదు. రీవాల్యూయేషన్‌లో.. విద్యాశాఖ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా మార్కుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఏకంగా 50, 60 మార్కుల వ్యత్యాసం వస్తుండడంతో అంతా కంగుతింటున్నారు. ఈ ఘోర నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నడూలేని రీతిలో టెన్త్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పులు చోటు చేసుకున్నాయి. రీవాల్యూయేషన్ ద్వారా మార్కుల్లో భారీ వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. నారా లోకేష్ (Nara Lokesh) సారథ్యంలో విద్యాశాఖ తొలి ఏడాది ఘోర వైఫల్యం చెందిందని వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. రికార్డ్ టైం కోసం మొత్తం మూల్యాంకనం గందరగోళంగా మార్చేశారనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
ఏపీలో మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ దాకా టెన్త్ పరీక్షలు జరిగాయి. పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. మొత్తం 4,98,585 మంది పాసైనట్లు( 81.14 శాతం) ప్రకటించి అభినందనలు తెలిపారు. అయితే..
రీవాల్యూయేషన్ కోసం ఏకంగా 60% మంది దరఖాస్తు చేసుకోవడంతో బోర్డు కంగుతింది. దరఖాస్తు చేసుకున్న 66,363 మందిలో.. ఇప్పటిదాకా 11,175 మంది విద్యార్థుల మార్కుల్లో మార్పులు జరిగాయి. ఇక అధికారులు పర్సంటేజీలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 16.8 శాతమే అని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. విషయం మీడియా ద్వారా బయటపడడంతో.. టీచర్లను సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు.. ఈ పరిణామంతో అసలు టెన్త్‌ఫలితాలపై ఇప్పుడు కొందరు పేరెంట్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇంకోవైపు.. గతంలో రీవాల్యూయేషన్ కోసం ఐదు వేలకు మించి దరఖాస్తులు రాలేదని గణాంకాలతో సహా మాజీ విద్యాశాఖ మంత్రి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. ఇదే విషయాన్ని అధికారులు మీటింగ్ పెట్టి పిలిచి అడిగినా చెబుతానని, ఆ సమావేశంలో మూల్యాంకనంలో తప్పులు ఎలా జరిగాయో వివరించేందుకు తాను సిద్ధమని బొత్స అంటున్నారు.
రికార్డు స్థాయి టైంలో రిజల్ట్స్ వెల్లడించాలని నారా లోకేష్ చేసిన ఒత్తిడి ఫలితమే తప్పుల తడకగా ఫలితాలు వెల్లడయ్యాయని, పాసైన వాళ్ళు కూడా ఫెయిలయ్యాయరనే వాదన వినిపిస్తోంది. ఇక ఈ ఫలితాలతో వేల మంది విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. ఇంత ఘోరంగా వైఫల్యం చెందినా.. తప్పు జరిగిందంటూ లోకేష్ ఈ అంశంపై కనీసం ఒక ట్వీట్ చేయకపోవడం ఇంకా దారుణం.