AP Aarogyasri Hospitals: సర్కారు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు

Double Aarogyasri Funding For Government Hospitals In AP - Sakshi

గతంతో పోలిస్తే 100 శాతానికిపైగా అధికం

నాడు–నేడుతో వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రులు కళకళ

ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగుపడుతున్న మౌలిక వసతులు

ప్రైవేట్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉత్తమ చికిత్సలే లక్ష్యం

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీ చికిత్సల కింద ప్రభుత్వ ఆస్పత్రులకు అందుతున్న నిధులు గణనీయంగా పెరుగుతున్నాయి. చక్కటి మౌలిక వసతులు, వైద్య సిబ్బంది సేవలు మెరుగ్గా అందుబాటులోకి రావడం వల్ల ఎక్కువ మంది రోగులు ప్రభుత్వాసుపత్రులకు వస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ కేర్‌ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు పెరగడం మంచి పరిణామంగా పేర్కొంటున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ నిధులు రెట్టింపు అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2017లో వైద్యవిధాన పరిషత్‌ ఆస్పత్రులకు రూ.16.10 కోట్ల మేర ఆరోగ్యశ్రీ నిధులు అందగా 2020లో రూ.35.78 కోట్లు విడుదలయ్యాయి. 100 శాతానికిపైగా నిధుల పెరుగుదల కనిపించింది.

నాడు నేడు పనులు పూర్తయితే..
ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో నాడు – నేడు ద్వారా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కొత్త భవనాల నిర్మాణం జరుగుతోంది. ఇవన్నీ పూర్తయితే ఆరోగ్యశ్రీ చికిత్సలు మరిన్ని జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 60 శాతం ఆరోగ్యశ్రీ నిధులు ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు వెళుతున్నాయి. అదే ప్రభుత్వ పరిధిలో అన్ని ఆస్పత్రుల అభివృద్ధి జరిగితే ఆ మేరకు నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకే అందే అవకాశం ఉంది. క్రమంగా ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులను పెంపొందించి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉత్తమ చికిత్సలు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

డాక్టర్‌ పోస్టుల భర్తీ
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారిం చిన విషయం తెలిసిందే. 2020లో వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో 692 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ల ఖాళీలను గుర్తించి నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఇప్పటికే 232 మంది వైద్యులను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. తిరిగి 2021లో 460 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టారు. తాజాగా విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లోనూ 196 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, 12 మంది డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లను నియమించనున్నట్లు ప్రకటించారు.

ఇవీ చదవండి:
6న అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
రియా చక్రవర్తితో సంబంధమేంటి? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top