
తిరుమల: తిరుమల నడకమార్గాల్లో దివ్యదర్శనం టోకెన్ల జారీని టీటీడీ శనివారం ఉదయం నుంచి పునః ప్రారంభించింది. కోవిడ్ నేపథ్యంలో మూడు సంవత్సరాలుగా టీటీడీ దివ్యదర్శనం టోకెన్ల జారీని నిలిపివేసింది. అయితే భక్తుల కోరిక మేరకు అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద 10 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో ఐదు వేల దివ్యదర్శనం టోకెన్లను శనివారం నుంచి కేటాయిస్తున్నారు. భక్తులు నేరుగా తమ ఆధార్ కార్డుతో హాజరైతేనే టోకెన్లు జారీ చేస్తారు. టీటీడీ కొద్దిరోజులపాటు ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్ల జారీని పరిశీలించనుంది.
3 నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
శ్రీవారి ఆలయంలో ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు సాలకట్ల వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. 3న శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయిన అనంతరం తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
4న స్వామివారు బంగారు రథంపై భక్తులకు దర్శనమిస్తారు. 5న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీసీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులు, శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంత్రం ఆలయానికి చేరుకుంటారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని 4న అష్టదళ పాదపద్మారాధన, 3 నుంచి 5వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.