40 ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, 30 టీస్టాళ్లు మూత
చేతులెత్తేసిన ప్రభుత్వం
తిరుమల: కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో కూడా గ్యాస్ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేయడంతో గ్యాస్ కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది. భక్తుల రద్దీ పెరుగుతున్న తరుణంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ హోటళ్లు, టీ స్టాళ్లు గ్యాస్ సరఫరా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే అనేక హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తిరుమలలో సుమారు 40 ఫాస్ట్ ఫుడ్‌హోటళ్లు, 30 టీస్టాళ్లు పూర్తిగా కార్యకలాపాలు నిలిపివేశాయి. మిగతా హోటల్ యజమానులు కూడా గ్యాస్ లేక వ్యాపారం కొనసాగించడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొందరు యజమానులు ఉదయం సేవలను నిలిపివేసి, కేవలం సాయంత్రం సమయంలో మాత్రమే టిఫిన్లు అందిస్తున్నారు. దీంతో భక్తులకు తగినంత ఆహారం దొరక్క ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన కుటుంబాలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నాయి. హోటళ్లు మూతపడడంతో అందుబాటులో ఉన్న కొద్ది హోటళ్ల వద్ద భారీ రద్దీ నెలకొంది. తిరుమల వంటి ప్రముఖ క్షేత్రంలో ఈ పరిస్థితి కొనసాగితే భక్తుల సేవలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.


