సాక్షి, తాడేపల్లి: ఆకు రౌడీలంతా బీఆర్ నాయుడు చెంత చేరారంటూ వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ నాయుడిని టీటీడీ ఛైర్మన్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ.. ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ ఆందోళనలు చేపట్టింది. ఈ సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆకు రౌడీలను బీఆర్ నాయుడు పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు.
‘‘తిరుమల అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లుతోంది. బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత టీటీడీ ఔన్నత్యం, విశిష్టత దెబ్బతింది. టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు పూర్తిగా అనర్హుడు. బీఆర్ నాయుడు తీరుపై రాష్ట్ర ప్రజలు, హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ప్రభుత్వం వెనకేసుకొస్తోంది.’’ అని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.300 రూపాయల టికెట్లను కూడా ఆకు రౌడీలకు ఇచ్చి టీటీడీ ఛైర్మన్ వాళ్ళని పోషిస్తున్నారు. టీటీడీ చైర్మన్ తీరుకు వ్యతిరేకంగా నిరసన తెలిపితే ఆకు రౌడీలు మా వారిపై దాడి చేశారు. శాంతి యుతంగా నిరసన తెలిపిన మహిళలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. అనుగ్రహ భాషనలతో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట ఆకు రౌడీల బూతులు వినిపిస్తున్నాయి. అసాంఘిక శక్తులపై ఉద్యమ నాయకుడిగా 50 ఏళ్ల క్రితమే పోరాటం చేశాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.


