కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం | Distribution Of Identity Cards In AP To Four Thousand Artists Today | Sakshi
Sakshi News home page

కళాకారుల జీవితాల్లో కాంతులు నింపిన జగనన్న ప్రభుత్వం

Jan 20 2024 6:53 PM | Updated on Jan 20 2024 7:20 PM

Distribution Of Identity Cards In AP To Four Thousand Artists Today - Sakshi

సాక్షి, విజయవాడ: సాంస్కృతిక సంబరాల్లో గుర్తించిన కళాకారులకు సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నామని.. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక మరియు యువజనాభివృద్ధి శాఖామాత్యులు ఆర్.కె. రోజా అన్నారు. రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో కళాకారులకు గుర్తింపు కార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించగా మంత్రి రోజా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు, రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉష, దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ, సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి, సంగీత నృత్య అకాడమీ చైర్ పర్సన్ పి.శిరీష, సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్  టి.ప్రభావతి, అధికార భాషా సంఘం సభ్యులు  మస్తానమ్మ, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సీఈవో .మల్లిఖార్జునరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.    

ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ..  తోటి కళాకారులందరికీ గుర్తింపుకార్డుల పంపిణీ కార్యక్రమంలో ఓ మంత్రిగా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు పథకాల ద్వారా కళాకారులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మేలు చేకూర్చిందన్నారు. రాష్ట్రం విడిపోయాక కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని.. గుర్తింపు కార్డులు లేక కళాకారులు చాలా ఇబ్బందులు పడ్డారని వెల్లడించారు. కళాకారుల డేటా తీసుకోకపోవడం వల్ల కళాకారులకు తగిన న్యాయం జరగలేదన్నారు. కానీ అధికారం చేపట్టిన నాటి నుండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కళాకారులకు అండగా నిలబడ్డారన్నారు. అందుకే తనకు మంత్రిగా అవకాశం కల్పించారని తెలిపారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాకారుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేశానన్నారు. కళాకారుల వినతిపత్రాలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతోందని స్పష్టం చేశారు. 

సాంస్కృతిక సంబరాల్లో కళాకారుల డేటా సేకరణ ద్వారా నిజమైన కళాకారులను గుర్తించామన్నారు. ఇప్పుడు ఆ కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా అందజేస్తున్నామన్నారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా కళాకారులు దరఖాస్తు చేసుకుని గుర్తింపు కార్డులు పొందవచ్చన్నారు. ప్రతిష్ఠాత్మక జీఐఎస్, జీ20 కార్యక్రమాల్లో మన కళాకారుల ప్రదర్శనలకు అవకాశం ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్ర చరిత్రలో 99 శాతం హామీలను నాలుగున్నరేళ్లలో అమలు చేయడమే గాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఆర్థిక, రాజకీయ, సామాజిక ప్రాధాన్యం ఇచ్చింది సీఎం జగన్‌ ఒక్కరే అన్నారు. ఇలా సంక్షేమమే లక్ష్యంగా ముందుకువెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని కళాకారులే బాధ్యతగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

 రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి క్రియేటివ్ హెడ్ యల్. జోగి నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని నిర్ణయించడం చారిత్రాత్మకమన్నారు. ఈ విషయంలో కళాకరులందరూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటారన్నారు. గ్రామ/వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఎమ్మార్వో, ఆర్డీవోల ద్వారా పారదర్శకంగా కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. స్వతహాగా కళాకారుడైన తనకు క్రియేటివ్ హెడ్ గా పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్క్షతలు తెలిపారు.   

మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం అనేది చాలా మంచి కార్యక్రమం అన్నారు. ఆర్.కె.రోజా ఈ శాఖకు మంత్రి అయిన తర్వాత మరింత వన్నె తెచ్చారన్నారు. కరోనా తర్వాత కళలు, క్రీడలు పునర్ వైభవాన్ని కోల్పోగా.. వాటికి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పునరుత్తేజం వచ్చిందన్నారు. 

సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. మనదేశాన్ని సాంప్రదాయ కళలు, సంస్కృతులే అత్యున్నత స్థాయిలో ఉంచాయన్నారు. కళలు, కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవిస్తోందని.. అందుకే అన్ని అకాడమీలకు చైర్మన్లు, చైర్ పర్సన్ లను నియమించిందన్నారు.   

రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్  వంగపండు ఉష మాట్లాడుతూ.. మనిషి పుట్టుక నుంచి చావు వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో కళాకారులకే ప్రాధాన్యం లభిస్తుందన్నారు. కళ కల కోసం కాదని ప్రజల కోసమని తెలిపారు. గుర్తింపు కార్డులు అందించడం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాల్లో కళాకారులకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు.   

అధికార భాషా సంఘం సభ్యులు మస్తానమ్మ మాట్లాడుతూ.. నేడు రాష్ట్రవ్యాప్తంగా కళాకారుల కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నాయన్నారు. కళాకారులకు గుర్తింపు కార్డులు, రాయితీలు అందించేందుకు మంత్రి రోజా అహర్నిశలు కృషి చేశారన్నారు. 

సైన్స్&టెక్నాలజీ అకాడమీ చైర్ పర్సన్  టి.ప్రభావతి మాట్లాడుతూ.. స్వతహాగా వైద్యురాలు అయిన తనకు ఈ పదవి ఇచ్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నీతి, ప్రేమ, తగ్గింపు స్వభావం వంటి సుగుణాలు కలిగిన నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని ప్రశంసించారు.  

దృశ్య కళల అకాడమీ చైర్ పర్సన్ కె. సత్య శైలజ మాట్లాడుతూ.. చిత్ర కళాకారులకు కూడా గుర్తింపు కార్డులు అందజేయాలని ఆకాంక్షించారు. కళాకారుల సంక్షేమం కోసం పరిపాలన సాగిస్తూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కళాకారులంతా అండగా నిలబడాలన్నారు. 

కార్యక్రమ అనంతరం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాలకు చెందిన 4వేల మంది కళాకారులకు గుర్తింపు కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు, గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement