విద్యుత్‌ ధరలపై ఆచితూచి అడుగులు

Distribution companies focused on Purchase prices for electricity - Sakshi

గత ధరలనే ఈ ఆర్థిక సంవత్సరానికి వర్తింపజేయాలని ఏపీ ఈఆర్‌సీని కోరిన డిస్కంలు

సగటున విద్యుత్‌ కొనుగోలు ధర యూనిట్‌కు రూ.4.51, రూ.4.53గా నిర్ధారణ

మార్చి 23న బహిరంగ విచారణ చేపట్టనున్న ఏపీ ఈఆర్‌సీ

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోలు ధరలపై పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొనుగోలు వ్యయం పెరుగుతున్నప్పటికీ ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. ఇంధన శాఖ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ ధరలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, ఎక్కడ ధర తక్కువ ఉంటే అక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా విద్యుత్‌ కొనుగోలు వ్యయం పెరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2020–21)లో విద్యుత్‌ కొనుగోలు జరిగిన ఖర్చునే ఈ ఆర్థిక సంవత్సరం (2021–22)లో కూడా వర్తింపజేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ)కి పంపిణీ సంస్థలు (ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌) ప్రతిపాదనలు సమర్పించాయి. 

హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా..
పంపిణీ సంస్థలు దీర్ఘకాలిక, స్పల్పకాలిక కొనుగోలు ఒప్పందాల ద్వారా ఉత్పత్తి సంస్థల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంటాయి. ఇలా కొనే విద్యుత్‌ ధరలు ఒక్కో సంస్థకు ఒక్కో విధంగా ఉంటాయి. పలు ఉత్పత్తి సంస్థలు యూనిట్‌ ధరను రూ.5.54 వరకూ నిర్ణయించి అమ్ముతున్నాయి. హైడల్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.1.58 పైసలకే లభిస్తుంది. కానీ.. దీని లభ్యత చాలా తక్కువ. ఈ పరిస్థితుల్లో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను ఎక్కువ ధర చెల్లించైనా సమకూర్చుకుని వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత డిస్కంలపై ఉంది. ఈ నేపథ్యంలో హెచ్చుతగ్గులతో ప్రమేయం లేకుండా ఎక్కడ విద్యుత్‌ దొరికితే అక్కడ కొనుగోలు చేస్తున్నాయి. 

23న ఏపీ ఈఆర్‌సీ విచారణ
ఇలా కొన్న విద్యుత్‌ సగటు వ్యయం ఈపీడీసీఎల్‌ యూనిట్‌ రూ.4.51గా, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌ యూనిట్‌ రూ.4.53గా నిర్ధారించాయి. తాము కొంటున్న విద్యుత్‌ ధరలను సంస్థల వారీగా కూడా డిస్కంలు ఏపీ ఈఆర్‌సీకి నివేదించాయి. ఈ మొత్తం కొనుగోలు ఖర్చులకు 2021–22 ఏడాది కూడా అనుమతించాల్సిందిగా మండలిని కోరాయి. డిస్కంలు సమర్పించిన లెక్కలు, ప్రతిపాదనలపై మార్చి 23న ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో ఏపీ ఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. ఈ లోగా ఎవరైనా తమ అభ్యంతరాలను, సూచనలను ఏపీ ఈఆర్‌సీ ఈ మెయిల్‌ commn& secy@aperc.inకు పంపవచ్చు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మండలి విచారణ చేపడుతుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top