
విజయవాడలో విచారణకు హాజరైన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
మాపైన నమోదు చేసింది అక్రమ కేసే
స్పష్టం చేసిన ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి
స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరు
సాక్షి, అమరావతి: మద్యం విధానం రూపకల్పనలో గానీ, అమలుతో గానీ తమకు ఏమాత్రం సంబంధం లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎ.ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి విస్పష్టంగా పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులో వీరిద్దరూ బుధవారం స్వచ్ఛందంగా సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ నేపథ్యంలో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిట్ విచారణకు హాజరయ్యారు. వీరిని విడివిడిగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 వరకు విచారించారు. చెరో 60 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. అన్ని ప్రశ్నలకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణ మోహన్‌రెడ్డి దీటుగా సమాధానం ఇస్తూ తమపై నమోదు చేసింది అక్రమ కేసేనని తేల్చిచెప్పారు. మద్యం విధానం రూపొందించడం, అమలుతో తమకు ఏమాత్రం సంబంధం ఉండదని నిబంధనలను ఉటంకిస్తూ స్పష్టం చేశారు.
డిస్టిలరీలతో వ్యవహారాలన్నీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీనే పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు. ఈ కేసులో సాక్షులు కొందరు మీ పేర్లు చెప్పారని సిట్ అధికారులు పేర్కొనగా, తాము కూడా ఏమాత్రం సంబంధం లేనివారి పేర్లను చెబితే వారినీ నిందితులుగా చేరుస్తారా అని ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి ఎదురు ప్రశ్నించడంతో సిట్ అధికారులు మౌనం దాల్చారు.
రాజ్ కేసిరెడ్డితో గానీ డిస్టిలరీల ప్రతినిధులతో గానీ తాము ఎలాంటి అధికారిక, అనధికారిక వ్యవహారాలు నిర్వహించలేదని అన్నారు. తమపై నమోదు చేసింది పూర్తిగా అక్రమ కేసని న్యాయ పోరాటం ద్వారా ఆ విషయాన్ని నిరూపిస్తామని తేల్చిచెప్పారు. కాగా, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను గురువారం కూడా విచారణకు రావాలని సిట్ అధికారులు కోరారు.