వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవడమేంటి?

Dhadi VeeraBhadra Rao Slams Election Commissioner Nimmagadda Ramesh Kumar Over Volunteer Mobile Phones Issue - Sakshi

సాక్షి, విశాఖ: వాలంటీర్ల మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. ప్రతిరోజు ఏదో ఒక న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులు జారీ చేస్తూ ప్రభుత్వ యంత్రాగాన్ని పని చేయనీయకుండా అడ్డు తగులుతున్నారని ధ్వజమెత్తారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 2 లక్షల 60 వేల మంది వలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేయటాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు వారి ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ఉత్తర్వులను జారీ చేయకుండా ఎన్నికల కమిషనర్‌ను  నియంత్రించాలని ఆయన కోరారు. 

కమిషనర్ ఇచ్చిన న్యాయ విరుద్ధమైన ఉత్తర్వులపై ప్రభుత్వం ప్రతిసారీ కోర్టులను ఆశ్రయించడం ద్వారా కోర్టు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. వాలంటీర్ల ఫోన్లను స్వాధీనం చేసుకుంటే ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలకు విఘాతం కలుగుతుందని, దాని వల్ల రాష్ట్రంలోని పేదలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే ప్రమాదముందని వెల్లడించారు. ఎన్నికల కమిషనర్ ఒక అధికారిలా కాకుండా రాజకీయ తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు కుప్పం ప్రజలు తగిన బుద్ధి చెప్పినా ఇంకా తీరు మార్చుకోలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇకనైనా నీచ రాజకీయాలు మానకుంటే కుప్పంలో పట్టిన గతే రానున్న ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పడుతుందని జోస్యం చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top