ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
నైరుతి రుతుపవనాలు ప్రవేశించినా తగ్గని భానుడి ప్రతాపం
కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు ప్రవేశించినా రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గడంలేదు. ఆదివారం కోస్తా ప్రాంత ప్రజలను భానుడి భగభగతో పాటు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రకాశం జిల్లా కరేడులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 43.4, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 43.2, పల్నాడుజిల్లా పిడుగురాళ్లలో 43.1, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 42.7, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణగూడెం, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం, గుంటూరు జిల్లా పాండ్రపాడు, నెల్లూరు జిల్లా గూడూరులో 42.6, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 42.5 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పలు జిల్లాల్లో వర్షాలు
మరోవైపు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం, ప్రకాశం జిల్లా అద్దంకి, జరుగుమిల్లి, నెల్లూరు జిల్లా వింజమూరు తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వచ్చే రెండు రోజులు కూడా అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ జిల్లాల్లో కొనసాగనున్న ఎండ తీవ్రత
మరోవైపు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా విస్తరిస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఏపీలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.


