ట్రాన్స్‌ఫార్మర్లు ఇక చల్లగా..! | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఫార్మర్లు ఇక చల్లగా..!

Published Mon, Apr 19 2021 4:51 AM

Department of Electricity making special arrangements to reduce heat of Transformers - Sakshi

సాక్షి, అమరావతి: వేసవిలో నిరంతరాయంగా విద్యుత్‌ను అందించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని రెండేళ్లుగా గణనీయంగా పెంచింది. సాధారణంగా వేసవిలో ట్రాన్స్‌ఫార్మర్లపై అత్యధిక లోడ్‌ పడుతుంది. దీంతో అవి తేలికగా వేడెక్కి, కాలిపోవడమో లేదా ట్రిప్‌ అయి ఆగిపోవడమో జరుగుతుంటాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల వాస్తవ లోడ్‌ను క్షేత్రస్థాయి సిబ్బంది ముందే అంచనా వేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైతే వేడిని తగ్గించేందుకు కొద్దిసేపు కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నారు.

సాధారణంగా ఉష్ణోగ్రత 42 డిగ్రీలు దాటినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లలో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఎక్కువ సామర్థ్యం గల ట్రాన్స్‌కో ట్రాన్స్‌ఫార్మర్లలో లోడ్‌ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్‌గా అందులో ఉండే ఫ్యాన్లు ఆన్‌ అయ్యి వాటిని కూల్‌ చేస్తాయి. వినియోగదారులకు అందించే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా ఇదే తరహాలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ పద్మజనార్థన్‌ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం లోడ్‌ను కంట్రోల్‌ చేయడం ద్వారానే వేడిని అదుపు చేస్తున్నామని చెప్పారు. 45 డిగ్రీల ఉష్ణోగ్రత వచ్చినప్పుడు ఎక్కువ లోడ్‌ ఉండే ప్రాంతాలను గుర్తించి నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. 

ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ఆయిల్‌ మార్పిడి
వేసవి ముందే రాష్ట్రంలోని అన్ని ట్రాన్స్‌ఫార్మర్ల స్థితిని అంచనా వేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్‌ ఉష్ణోగ్రతకు గురవ్వకుండా ముందే ఆయిల్‌ మార్పు చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చామని చెప్పారు. తరచూ చెడిపోతున్న, కాలిపోయే వాటి స్థానంలో కొత్తవి అమర్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.  

Advertisement
Advertisement