సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కి సంబంధించిన ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు డేటావివ్ టెక్నాలజీస్ ప్రకటించింది. భవిష్యత్తులో అపార అవకాశాలున్న ఏఐలో కంప్యూటర్ విజన్, ఇమేజ్ ప్రాసెసింగ్, మెటావెర్స్ సిమ్యులేషన్స్, గ్రేడింగ్, అసెస్‌మెంట్ వంటి అత్యాధునిక సదుపాయాలతో ల్యాబ్‌ను ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఏఐ కంపెనీ డేటావివ్ ఎండీ వేదాంత్ అహ్లువాలియా తెలిపారు.
తాడేపల్లిలోని ఏపీ నైపుణ్యాభివృద్ధిసంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కార్యాలయంలో గురువారం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్, సంస్థ ఎండీ వినోద్‌లతో డేటావివ్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అహ్లువాలియా మాట్లాడుతూ ఈ ల్యాబ్ ద్వారా భావోద్వేగాలను ఇంటెలిజెన్స్ కెమెరాలతో పసిగట్టవచ్చని చెప్పారు. కృత్రిమ మేధ ద్వారా టెక్ట్స్, ఆడియో, వీడియో, ఫొటోల ద్వారా అర్థం చేసుకునేలా యువతకు టెక్నాలజీ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రశంసించారు. ల్యాబ్ ఏర్పాటుకు సహకారాలందిస్తామని సురేష్‌కుమార్ చెప్పారు.
మైనార్టీ విద్యార్థులకు శిక్షణ కోసం ఉర్దూ అకాడమీతో ఒప్పందం
మైనారిటీవర్గ నిరుద్యోగులకు సమాచార, సాంకేతిక రంగంలో శిక్షణ, ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీతో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ సమక్షంలో ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ వినోద్, ఉర్దూ అకాడమీ సెక్రటరీ అయ్యుబ్ హుసేన్ సంతకాలు చేసి ఒప్పందపత్రాలను మార్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ అకాడమీకి సంబంధించిన 36 శిక్షణ కేంద్రాలను స్కిల్‌హబ్‌లుగా మార్చి యువతకు శిక్షణ కార్యక్రమాలను అందించే దిశగా ఒప్పందం కుదిరిందని సురేష్‌కుమార్ చెప్పారు.
బ్రోచర్ ఆవిష్కరణ
అనంతరం రాష్ట్రంలో ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించే విధంగా ఐటీ, పరిశ్రమలతో ఏపీఎస్‌ఎస్‌డీసీ భాగస్వామ్యానికి సంబంధించిన బ్రోచర్‌ను సురేష్‌కుమార్, వినోద్ ఆవిష్కరించారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి, నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం త్వరలోనే యువతకు శిక్షణ కార్యక్రమాలు జరగనున్నట్లు సురేష్‌కుమార్ చెప్పారు. ఎండీ వినోద్ మాట్లాడుతూ పైథాన్ ప్రోగ్రామింగ్, డేటా అనాలిసిస్, ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్, బిల్డ్ బాక్స్, 3డీ ఆధారిత గేమ్ డిజైన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆటోక్యాడ్ ఆధారిత బిల్డింగ్ డ్రాఫ్టింగ్, పీఎల్‌సీతో ఇండస్ట్రియల్ ఆటోమేషన్, వెబ్‌డెవలప్‌మెంట్ తదితర కోర్సుల్లో శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు.
ఇది కూడా చదవండి: వైద్య విద్యలో నూతన అధ్యాయం.. ఏపీ చరిత్రలోనే రికార్డు..


