
పీజీఆర్‌ఎస్‌లో ఎలుకల మందు తాగిన దోమతోటి బుజ్జి
భూ తగాదాల్లో టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులు
మనస్తాపంతో పీజీఆర్‌ఎస్‌లో అందరి సమక్షంలో ఎలుకల మందు తాగిన బాధితురాలు
గుంటూరు వెస్ట్: భూ తగాదాల విషయంలోనే గుంటూరు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి తమ సమస్య పరిష్కారానికి నోచుకోకపోవడంతోపాటు ఇటీవల టీడీపీ కార్పొరేటర్ బెదిరింపులకు భయపడి సోమవారం ఓ దళిత మహిళ ఎలుకల మందు తాగి అందరూ చూస్తుండగానే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను అక్కడి సిబ్బంది హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పెదపలకలూరు గ్రామంలోని జన్మభూమి నగర్, స్వర్ణాంధ్ర నగర్ ప్రాంతాల్లోని సర్వే నెంబర్ 376, 377తోపాటు 227లలో గుంటూరు వసంతరాయపురానికి చెందిన దోమతోటి బుజ్జి (50) తల్లి కల్లు లచ్చమ్మ, ఆడబిడ్డతోపాటు బంధువులకు తొమ్మిది ప్లాట్లు ఉన్నాయి.
వీటిని మౌలాలితోపాటు మరికొందరు ఆక్రమించుకున్నారు. ఇటీవల స్థానిక టీడీపీ కార్పొరేటర్ సాంబిరెడ్డి పంచాయితీ నిమిత్తం బుజ్జిని తన ఆఫీసుకు పిలిచి నానా దుర్భాషలాడారు. కులం పేరుతో దూషించారు. ప్రాణాలు తీస్తామని బెదిరించారు. నిజానికి.. సదరు ప్లాట్ల కోసం బుజ్జి అనేక ఏళ్లుగా అధికారులతోపాటు నల్లపాడు పోలీసుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె సోమవారం తీవ్ర మనస్తాపంతో ఎలుకల మందు తీసుకుని గుంటూరులోని కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చింది. అందరూ చూస్తుండగానే ఎలుకల మందు తాగింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు.