వరుస తుపాన్లతో మత్స్యకారుల అవస్థలు
ఈ ఏడాది వృథాగా మారిన 56 రోజులు
రాబడి లేక పస్తులతో అలమటిస్తున్న గంగపుత్రులు
ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆకలి కేకలు
అనంత సాగరం అంతు చూసేందుకు సైతం వెనుకాడరు.. ఉప్పొంగే కెరటాలను లెక్కచేయకుండా ముందుకు సాగుతుంటారు.. హద్దుల్లేని సాహసంతో జీవన పోరాటం సాగిస్తుంటారు.. చేపల వేటే లక్ష్యంగా సువిశాల సముద్రంలో జల్లెడ పడుతుంటారు. మొక్కవోని ధైర్యంతో ప్రమాదాలకు ఎదురీదుతుంటారు. అయినప్పటికీ రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లోనే బతుకీడుస్తుంటారు. అలాంటి గంగపుత్రులను ఈ ఏడాది వరుస తుపాన్లు వణికిస్తున్నాయి. రోజుల తరబడి వేటకు వెళ్లలేని దుస్థితిని కలి్పంచాయి. కుటుంబ పోషణను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మత్స్యకారులు పస్తులతో కాలం గడుపుతున్నారు. ఆదుకునే వారు లేక ఆకలితో అలమటిస్తున్నారు.
వాకాడు : బంగాళాఖాతంలో వరుస తుపాన్ల కారణంగా సముద్రంపై వేట సాగించే మత్స్యకారుల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. ఈ ఏడాదిలోనే దాదాపు 5 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్లు రావడంతో జిల్లాలోని మత్స్యకారులు దాదాపు 56 రోజులపాటు వేటకు వెళ్లలేని దుస్థితి దాపురించింది. తాజాగా మరో తుపాను ముంచుకొస్తోందంటూ వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మరో 5 రోజులుపాటు మళ్లీ వేట దూరంగా ఉండాల్సి వస్తోంది. అలాగే ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు సముద్రంలో మత్స్య సంపద సక్రమంగా లభించలేదు. తర్వాత ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో 61 రోజులపాటు వేటకు ప్రభుత్వం విరామం ప్రకటించింది. దీంతో దాదాపు ఆరు నెలలపాటు మత్స్యకారులకు అరకొరగా వేట సాగింది. ఇక జూన్ నుంచి నవంబర్ వరకు వరుస తుపాన్లు రావడంతో మత్స్యకారుల పరిస్థితి దయనీయంగా మారింది.
పతనమైన ధరలు
కొన్ని నెలలుగా సముద్రంలో చేపల వేట సజావుగా సాగక అల్లాడిపోతున్న మత్స్యకారులకు కార్తీక మాసం గుది బండగా మారింది. జిల్లాలో దొరికే మత్స్య సంపదను అధిక ధరలకు కొనుగోలు చేసే కేరళ, కర్ణాటక రాష్ట్రాల వ్యాపారులు కార్తీక మాసం పేరుతో ముఖం చాటేశారు. దీంతో కిలో రూ.180 పలికే చేపలను కేవలం కిలో రూ.30కి అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని మత్స్యకారులు వాపోతున్నారు. మోంథా తుపాను తర్వాత 8 రోజులు సాగిన వేటలో తిరుపతి జిల్లా వ్యాప్తంగా 5 మత్స్యకార మండలాల్లో దాదాపు 2.5 టన్నుల వివిధ రకాల చేపలు, 641 కిలోల పీతలు పడ్డాయి. వాటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు రాకపోవడంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు.
మళ్లీ అల్లకల్లోలం
గత రెండు రోజులుగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. తాజాగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు తీరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో మత్స్యకారులు బోట్లును ఒడ్డుకు చేర్చుకోవాల్సి వస్తోంది. సాధారణంగా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేప్పుడు ఒక్కో బోటులో 8 మంది కూలీలు, 4 రకాల వలలు వెంట తీసుకుపోతుంటారు. దాదాపు 8 నాటికల్ మైళ్లు దూరం వరకు వేట చేస్తారు. కానీ, ఇప్పుడు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో కనీసం రెండు నాటికల్ మైళ్ల దూరం కూడా వెళ్ల లేక వెనుదిరుగుతున్నారు. ఈ ఏడాదిలో సముద్రంపై వలలను వదులుతూ. వాటిని మళ్లీ తిరిగి లాక్కుంటూ రోజంతా శ్రమ పడుతూ రోజుకి రూ.4 వేలు నష్టపోతున్నామే కానీ, తగిన ఆదాయం రావడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు.
గతంలో వైఎస్సార్‌సీపీ అండ
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి డోకా లేకుండా ఉండేది. గంగపుత్రుల సంక్షేమం, సాధికారత లక్ష్యంగా రాష్ట్రంలో 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు నిర్మించారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ, ప్రమాద భీమా, మత్స్యకార భరోసా, విపత్తుల సమయంలో అందించిన సాయం, వివిధ పథకాల ద్వారా మొత్త రూ.4,913 కోట్లు వెచ్చించారు. అయి తే చంద్రబాబు ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల సమయంలో కనీసం మాత్రం పట్టించుకోవడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగరం వదిలి.. పొట్ట చేతపట్టుకుని!
తిరుపతి జిల్లాలోని తీర ప్రాంత మండలాలైన చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేటలో దాదాపు 4,879 మంది మత్స్యకారులు ఉన్నారు. అలాగే నదులు, కాలువల్లో చేపలు పట్టుకుని జీవనం సాగించే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందని వారు దాదాపు 1,645 మంది ఉన్నారు. వరుస తుపానులు వీరందరి జీవితాలను తలకిందులు చేసేశాయి. భారీ వర్షాల కారణంగా నదులు, కాలువలు ఉప్పొంగడంతో చేపల వేట నిరాశాజనకంగా మారింది.
సముద్రంలో అలల ఉధృతికి వేటకు వెళ్లలేక చివరకు బకింగ్ హామ్ కెనాల్, ఉప్పుటేరు, వేపంజేరి కాలువల్లో దొరికిన అరకొర చేపలతో పొట్టపోసుకుంటున్నారు. అనంతరం సాగరంలో రోజుల తరబడి వేటసాగించిన వారు.. చేసేదిలేక చివరకు పొట్టచేతపట్టుకుని పిల్ల కాలువలపై ఆధారపడి బతుకీడుస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన ఐదు తుపాన్లు వచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
ఏడాదిగా అవస్థలే..
వరుస విపత్తులతో సముద్రంలో వేట సజావుగా సాగడంలేదు. ఈ ఏడాదిలోనే 5 తుపాన్లు రావడంతో వేట లేక పస్తులుండాల్సి వస్తోంది. ఒకవేళ సముద్రంలోకి వెళ్లినా బోటు ఒక్కచోట ఆగకపోవడంతో చేపలు పడడం లేదు. చివరకు కాలువల్లో దొరికిన అరకొర చేపలతో పొట్టపోసుకుంటున్నాం. పైగా కార్తీక మాసం పేరుతో ధరలు పడిపోయాయి. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అన్నట్టు మా బతుకులు మారాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకపోవడం దారుణం. – మునస్వామి, మత్స్యకారుడు, ఓడపాళెం
ఎలాంటి సాయం లేదు
ప్రకృతి వైపరీత్యాలతో సముద్రంలో వేట లేకపోతే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏదో ఒకవిధంగా చేయూతనందించేవారు. ఈ పర్యాయం చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టించుకునేవారే కరువయ్యారు. నెలల తరబడి వేట లేకపోయి నా కనీసం స్పందించడం కూడా లేదు. చేపల ధరలు పతనమై అవస్థలు పడుతున్నా.. ఏమాత్రం సహకారం లేదు. ఈ ఏడాది వరుస తుపానులతో ఇబ్బందిపడుతున్నా.. ఎలాంటి సాయం అందించలేదు. – పోలయ్య, మత్స్యకారుడు, కొండూరుపాళెం


