సిరుల విరులు..కొండ చీపుర్లు | Sakshi
Sakshi News home page

సిరుల విరులు..కొండ చీపుర్లు

Published Sun, May 26 2024 4:15 AM

cultivation of broom grass in hilly areas

ఏజెన్సీలోని కొండ ప్రాంతాల్లో విస్తృతంగా చీపురు గడ్డి పెంపకం

అడవుల్లోని ఆర్వోఎఫ్‌ఆర్,పోడు భూముల్లో సాగు

బీడు వారిన భూములు సైతం గడ్డి సాగుతో వినియోగంలోకి..

గిరిజన సమూహాల జీవనోపాధికి ఊతం

నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్‌తో ప్రోత్సహిస్తే మరింత ప్రయోజనం

ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ నివేదిక

సాక్షి, అమరావతి: మనం ఇళ్లల్లో ఉపయోగించే మెత్తని గడ్డి మాదిరిగా ఉండే కొండ చీపుర్లు గిరిజనులకు జీవనోపాధిగా మారాయి. కొండ చీపురు గడ్డి పెంపకంతో రాష్ట్రంలోని వేలాది గిరిజన కుటుంబాలు ఉపా«ధి పొందుతున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ నివేదిక స్పష్టం చేసింది. ‘కొండ చీపురుతో ఊడ్చేద్దాం’ అనే నినాదంతో వాటి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా గిరిజనుల జీవనోపాధిని మరింత మెరుగుపరచవచ్చని నివేదికలో తెలిపింది.  

మన ప్రాంతానికి వలసజాతే..! 
మన ప్రాంతానికి వలసవచ్చిన చీపురు గడ్డి జాతులను వృక్షశాస్త్రంలో ‘థైసనోలెనా మాక్సిమా’, ‘థైసనోలెనా లాటిఫోలియా’గా పిలుస్తారు. ఈ తరహా గడ్డి జాతులు హిమాలయాల్లోని ఎత్తయిన ప్రాంతా­లు, తూర్పు కనుమల్లో ఎక్కు­వగా పెరుగుతాయి. మేఘాల­య, అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, త్రిపుర, సిక్కిం, పశి్చమ బెంగాల్‌లో ఈ గడ్డి జాతులు ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోని అనంతగిరి, అరకు, డుంబ్రిగూడ, హుకుంపేట, పాడేరు, పెదబయలు, ముంచంగిపుట్టు, జి.మాడుగుల, చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, సీతంపేట, భామిని, కొత్తూరు, కుమారాడ, కురుపాం, గుమ్మ లక్ష్మీపురం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, పాచిపెంట తదితర మండలాల పరిధిలో ఈ చీపురు గడ్డి సాగు ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతున్నారు.  

ఎకరాకు రూ.50 వేలకు పైగా ఆదాయం 
ఎటువంటి సాగుకు ఉపయోగించని భూములను చీపురు గడ్డి పెంపకానికి గిరిజనులు వినియోగిస్తున్నారు. ఒక్కో చీపురును కనీసం రూ.35 నుంచి రూ.70 వరకు అమ్ముతుంటారు. ఒక ఎకరాలో చీపురు గడ్డి సాగు చేసిన గిరిజన కుటుంబానికి ఎకరాకు కనీసం రూ.50 వేల ఆదాయం వస్తోంది. చీపురు సాగు, చీపురు నేసే పద్ధతి తదితరాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే వారి జీవనోపాధిని మరింత మెరుగుపరచవచ్చని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ నివేదికలో స్పష్టం చేసింది.

ఒకసారి నాటితే.. ఇరవై ఏళ్లకు పైగా ఆదాయం 
ఎత్తయిన కొండవాలు ప్రాంతాలు ఈ చీపురు గడ్డి సాగుకు అనుకూలం. సముద్ర మట్టానికి కనీసం 1,500 అడుగుల నుంచి గరిష్టంగా 5 వేల అడుగుల ఎత్తులో ఉండే అటవీ భూములు ఈ గడ్డి సాగుకు దోహదం చేస్తున్నాయి. ఐదు అడుగుల నుంచి 12 అడుగుల ఎత్తు వరకు పెరిగే ఈ చీపురు గడ్డి సాగు వల్ల ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి బీడు వారిన పోడు భూములు వినియోగంలోకి వస్తున్నాయి. భూమి కోతను నివారించడంతో పాటు భూసారాన్ని కూడా కాపాడుతోంది. అలాగే ఈ గడ్డి సాగు పర్యావరణ హితంతో పాటు ఆర్థికంగా, సామాజికంగా గిరిజనుల ఉపాధికి ఊతమిస్తోంది.

హుకుంపేట, పెదబయలు, సీతంపేట, మారేడుమిల్లి తదితర మండలాల్లోని ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా భూములు, అటవీ పోడు భూముల్లో సాగవుతున్న చీపురు గడ్డిపై ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అధ్యయనం చేసింది. ఈ సాగు ద్వారా ఆ మండలాల్లోని పలు గ్రామాల్లో 232 ఎకరాల్లో 300కు పైగా గిరిజన కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా అత్యంత బలహీన గిరిజన సమూహాలు(పీవీటీజీ)లకు చెందిన మూక దొర, బగత, కొండ దొర, సవర, కొండ రెడ్డి వంటి తెగలు ఉపాధి పొందుతున్నాయని నివేదికలో పేర్కొంది. కొండ చీపురుకు ఉపయోగించే గడ్డి రకాలను ఒకసారి నాటితే 20 ఏళ్లకుపైగా స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపింది.

Advertisement
 
Advertisement
 
Advertisement