ప్రధాన దేవాలయాల్లో అమల్లోకి కోవిడ్‌ ఆంక్షలు 

Covid Restrictions Implementation in main temples of Andhra Pradesh - Sakshi

ద్వారకాతిరుమల, ఇంద్రకీలాద్రిల్లో గంటకు వెయ్యి మందికే దర్శనం 

ద్వారకాతిరుమల/ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన విజయవాడ దుర్గమ్మ ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాల్లో మంగళవారం నుంచి కోవిడ్‌ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇరు ఆలయాల్లోని దర్శనానికి వెళ్లే క్యూ కాంప్లెక్స్‌ల వద్ద దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ జరిపి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేయించారు. మాస్క్‌ ధరించాలని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నారు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు చేపట్టారు. ఇరు ఆలయాల్లో గంటకు 1,000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

చినవెంకన్న స్వామివారిని దర్శించిన భక్తులకు శేషాచల కొండపైన వకుళమాత అన్నదాన భవనం వద్ద ప్యాకెట్ల రూపంలో అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ, తీర్థం, శఠారి, అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. ఇంద్రకీలాద్రిపై నిత్యం జరిగే ఆర్జిత సేవల్లో 50 శాతం టికెట్లను మాత్రమే విక్రయిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నిత్య అన్నదాన ప్రసాద వితరణను అధికారులు నిలిపివేశారు. దీంతో మహా మండపం మూడో అంతస్తులోని క్యూ లైన్లు, రెండో అంతస్తులోని అన్న ప్రసాద వితరణ భవనం వెలవెలబోయింది.

సెకండ్‌ వేవ్‌ వచ్చిన తరుణంలో అన్న ప్రసాద వితరణ నిలిపివేసినప్పటికీ ప్యాకెట్ల రూపంలో భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేసేవారు. ఈ దఫా అటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. అమ్మవారి లడ్డూ, పులిహోర ప్రసాదాలను కోవిడ్‌ నిబంధనల మేరకు విక్రయిస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలున్న వారు దేవాలయ సందర్శనను వాయిదా వేసుకోవాలని దేవదాయ శాఖాధికారులు విజ్ఞప్తి చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top