ఐదు నిమిషాల్లోనే ఆస్పత్రుల సమాచారం  | Coronavirus: Hospital information within five minutes in AP | Sakshi
Sakshi News home page

ఐదు నిమిషాల్లోనే ఆస్పత్రుల సమాచారం 

Aug 2 2020 2:59 AM | Updated on Aug 2 2020 1:56 PM

Coronavirus: Hospital information within five minutes in AP - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా లక్షణాలు కాస్తంత కనిపించినా కంగారు. పరీక్ష ఎక్కడ చేయించుకోవాలి? ఎవరిని ఎలా సంప్రదించాలి? పాజిటివ్‌ అయితే ఏ ఆస్పత్రికెళ్లాలి? ఇలా బాధితులకు ఎన్నో సందేహాలు. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌ సెంటర్‌ ఫోన్‌ చేసిన వెంటనే పరిష్కారం చూపుతోంది. ఐదు నిమిషాల్లోనే ఆస్పత్రుల సమాచారాన్ని అందిస్తోంది.  

► 104 నంబర్‌కు కాల్‌ చేస్తే చాలు.. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు, చికిత్సకు, నిర్ధారణకు ఇలా చేసిన ప్రతి ఏర్పాటుకు సంబంధించి వెంటనే సమాచారం ఇస్తారు. 
► ఫోన్‌ చేసిన అర గంటలోపే బాధితుడిని ఆదుకునేలా ఏర్పాటు చేసిన ఈ కాల్‌ సెంటర్‌ ద్వారా రోజూ ఐదు వేల మంది సేవలు పొందుతున్నారు.  
► పడకల సౌలభ్యం నుంచి క్వారంటైన్‌ కేంద్రాల వరకు సమాచారం పొందే ఈ వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. 
► మన రాష్ట్ర స్థాయిలో ఒకటి, ప్రతి జిల్లాకొకటి చొప్పున పనిచేస్తున్న ఈ కాల్‌సెంటర్లను 24 గంటలూ ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. 

కరోనా సమాచారం ఇలా..  
► రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులు.. అందులో ఉన్న పడకలతోపాటు కోవిడ్‌ కేర్‌ సెంటర్లు, వాటిలో ఎన్ని పడకలు ఉన్నాయి అనే సమాచారం చెబుతారు. 
► దీర్ఘకాలిక జబ్బులతో ఉన్నవారికైతే స్టేట్‌ కోవిడ్‌ ఆస్పత్రుల సమాచారం, పడకల వివరాలు వెంటనే ఇస్తారు. 
► కరోనా టెస్టింగ్‌ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఎన్ని గంటలకు వెళ్లాలి వంటి సమాచారం తెలియజేస్తారు. 
► కోవిడ్‌ సేవలందించే ప్రైవేటు ఆస్పత్రులు, వాటిలో పడకల సమాచారం కూడా ఇస్తారు. 
► కోవిడ్‌ సమాచారం ఇవ్వడానికి కాల్‌సెంటర్‌లో 24 గంటలూ సిబ్బంది పనిచేస్తారు. 

కోవిడ్‌–19 డాష్‌ బోర్డులో అందుబాటులో సమాచారం 
కోవిడ్‌–19 డాష్‌ బోర్డులో జిల్లాల వారీగా చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల వివరాలు, మొత్తం పడకల సంఖ్య, ఖాళీగా ఉన్న పడకలు, ఐసీయూ, ఆక్సిజన్‌తో కూడిన సాధారణ బెడ్లు, వెంటిలేటర్‌ బెడ్లు.. తదితర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. దీనివల్ల రోగులను బెడ్లు ఖాళీగా ఉన్న ఆస్పత్రులకు తీసుకెళ్లే వీలు కలుగుతుందని అధికారులు చెప్పారు. ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. http://dashboard.covid19.ap.gov.in/ims/hospbed&reports/ అనే వెబ్‌లింక్‌ను క్లిక్‌ చేసి.. ఆయా జిల్లాల పేరు మీద క్లిక్‌ చేసి ఆయా జిల్లాల్లోని బెడ్ల వివరాలు తెలుసుకోవచ్చు.  
104కు కాల్‌ చేస్తే సమాచారమిలా.. 
► ముందు 104కు కాల్‌ చేయాలి. అనంతరం మీకు ఎలాంటి సేవలు కావాలో అడుగుతారు.  
► 1 నొక్కితే సాధారణ ఆరోగ్య సమస్యలపై స్పందిస్తారు. 
► 2 నొక్కగానే కరోనా సమస్యలపై స్పందిస్తారు. 
► ఫోన్‌ చేసిన బాధితుడి నుంచి కాల్‌సెంటర్‌ ప్రతినిధి పూర్తి వివరాలు, ఆరోగ్య స్థితిగతులు తెలుసుకుంటారు. 
► ఆయాసం లేదా ఇతర కరోనా సమస్యలతో పరిస్థితి విషమంగా ఉంటే వెంటనే ఆ జిల్లా అధికార యంత్రాంగాన్ని పురమాయిస్తారు. 
► ఎమర్జెన్సీ అయితే 30 నిమిషాల్లోపే ఆ వ్యక్తి వద్దకు అంబులెన్స్‌ను పంపించి ఆస్పత్రికి చేరుస్తారు. 
► అప్పటికే ఆస్పత్రి వైద్యులకు సంబంధిత వ్యక్తి సమాచారం పంపుతారు.

  • కరోనా కేసులు పెరిగితే ఆందోళన అక్కర్లేదు. ఎంతమందిని గుర్తిస్తే అంతగా కట్టడి చేయొచ్చు. మరణాలను నియంత్రించ గలిగితే చాలు – డా.కె.శ్రీనాథరెడ్డి,ఢిల్లీ ఎయిమ్స్‌ కార్డియాలజీ విభాగం మాజీ అధిపతి 
  • కేసులు పెరుగుతున్నా సరే టెస్టుల్లో ఏపీ దూకుడు పెంచడం గొప్ప విషయం. – రాజ్‌దీప్‌ సర్దేశాయ్, ప్రముఖ పాత్రికేయుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement