వేగంగా కరోనా టీకా

Corona vaccine distribution in Andhra Pradesh is growing rapidly - Sakshi

రాష్ట్రంలో 80.82 శాతం పిల్లలకు 2 డోసులు

12–14 ఏళ్ల పిల్లలు 11.76 లక్షల మందికి పూర్తి

అనంతపురం జిల్లాలో లక్ష్యానికి మించి పంపిణీ

15 – 18 ఏళ్ల వారిలో 25.18 లక్షల మందికి రెండు డోసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. 12 నుంచి 14 ఏళ్ల పిల్లల్లో 80.82 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయింది. ఈ వయసు పిల్లలకు 14,90,000 మందికి టీకా లక్ష్యం కాగా 14,55,314 మందికి తొలి డోసు వేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 80.82 శాతం అంటే 11,76,227 మందికి రెండు డోసులు వేశారు. అనంతపురం జిల్లాలో లక్ష్యానికి మించి 100.43% మంది పిల్లలకి 2 డోసులు వేశారు. ఈ జిల్లాలో 75,521 మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా 77,269 మందికి వేశారు. మరోవైపు 15 నుంచి 18 ఏళ్ల వారిలో 25,18,766 మందికి 2 డోసులు వేశారు.

71.36 శాతం మందికి ప్రికాషన్‌ డోసు
రాష్ట్రంలో ఉన్న హెల్త్‌ కేర్, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వృద్ధుల్లో 71.36 శాతం మందికి ప్రికాషన్‌ డోసు టీకా వేశారు. జనవరిలో వీరికి ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభించారు. రెండు డోసులు తీసుకున్న వారిలో ఇప్పటివరకు 30,06,318 మందికి ప్రికాషన్‌ టీకా వేయాల్సి ఉంది. వీరిలో 21,45,404 మందికి వేశారు. మే నెలలో 18,61,030 మందికి ప్రికాషన్‌ డోసు వేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. వీరిలో హెల్త్‌ కేర్‌ వర్కర్లు 90,940 మంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 4,01,635 మంది, వృద్ధులు 13,68,455 మంది ఉన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికి టీకా 
– జె. నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌
12 ఏళ్ల నుంచి వృద్ధుల వరకు అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని డోసుల టీకా పంపిణీనే లక్ష్యంగా పెట్టుకున్నాం. వైద్య సిబ్బందికీ లక్ష్యాలు నిర్దేశిస్తున్నాం. అర్హులైనప్పటికీ, కొందరు వృద్ధులు ప్రికాషన్‌ డోసు వేసుకోవడం లేదు. వారి మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌ వస్తుంది. లేదంటే  దగ్గరలోని టీకా కేంద్రానికి వెళితే అక్కడి వైద్య సిబ్బంది టీకా వేస్తారు. వైరస్‌ వ్యాప్తి పూర్తిగా కనుమరుగు అవలేదు. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి జాగ్రత్తలు పాటించాలి. టీకాలు సక్రమంగా వేయించుకోవాలి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top