నాలుగు మండలాల నుంచి వందలాదిగా తరలివచ్చిన చిట్ బాధితులు
మోసపోయిన చిట్ డబ్బులు తిరిగి వస్తాయని ఆశ
నిందితుల కారును చుట్టుముట్టిన వైనం.. తీవ్ర ఉద్రిక్తత
చర్చనీయాంశమైన రూ.42 కోట్ల చిట్టీ మోసం వ్యవహారం
సాక్షి, అమరావతి: మోసపోయిన చిట్టీల డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో తణుకుసహా పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మండలాల ప్రజలు వందల సంఖ్యలో హైకోర్టుకు పోటెత్తిన ఘటన శుక్రవారం చర్చనీయాంశంగా మారింది. తణుకుకు చెందిన గోలి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గోలి బాల భవానీ శంకర్ ‘శ్రీ దుర్గ భవాని చిట్స్ అండ్ ఫైనాన్స్’ పేరుతో చిట్టీలు నిర్వహిస్తూ వచ్చారు. ఏజెంట్లను ఏర్పాటు చేసి తణుకు, ఇరగవరం, పెనుమంత్ర, అత్తిలి మండలాల్లో సామాన్యుల నుంచి రూ.42 కోట్లు వసూలు చేసి బోర్డ్ తిప్పేశారు. దీనిపై తణుకు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 13న కేసు నమోదయ్యింది.
ఈ నేపథ్యంలో నిందితులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా, ఫిర్యాదుదారులకు చెల్లించాల్సిన మొత్తం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని నిందితుల తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు అటు నిందితులను, ఇటు ఫిర్యాదుదారులను తదుపరి విచారణ సమయంలో తమ ముందు హాజరుపరచాలని తణుకు పోలీసులను ఆదేశించారు.
దీంతో పోలీసులనోటీసుల మేరకు దాదాపు 300 మంది బాధితులు చిట్టీల చెల్లింపులకు సంబంధించిన రసీదులను, కంపెనీ ఇచ్చిన పుస్తకాలు పట్టుకుని సొంత ఖర్చులతో బస్సులు, వ్యాన్లలో హైకోర్టుకు తరలివచ్చారు. ఇంత మంది ఒక్కసారిగా హైకోర్టు వద్దకు రావడంతో స్థానిక న్యాయవాదులకు, పోలీసులకు ఏమీ అర్థం కాలేదు. హైకోర్టు ప్రాంగణం, క్యాంటీన్ అంతా వీరితో నిండిపోయింది.
ముందస్తు బెయిల్‌కు హైకోర్టు నో
నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ మధ్యాహ్నం విచారణకు వచ్చింది. ఇలాంటి కేసుల్లో ముందస్తు బెయిల్ సాధ్యం కాదని న్యాయమూర్తి తేల్చి చెప్పడంతో నిందితులు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన న్యాయమూర్తి ‘సగం తణుకు ఇక్కడే ఉన్నట్లుంది’ అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా కోర్టు వెలుపల నిందితుల కారును బాధితులు చుట్టుముట్టడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దాదాపు అర్థ గంట సేపు హైకోర్టు ప్రాంగణం ఆరుపులు, కేకలతో మార్మోగింది. జనాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో హైకోర్టు ఎస్‌పీఎఫ్ సిబ్బంది ఏమీ చేయలేకపోయారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడం, విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో తుళ్లూరు పోలీసులు హుటాహుటిన హైకోర్టుకు చేరుకున్నారు. అనంతరం బాధితులను అతి కష్టం మీద అక్కడి నుంచి పంపి, నిందితులను తుళ్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


