
సాక్షి నెట్‌వర్క్: ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్న వార్డు, గ్రామ వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జనసేనాని తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలతో శవయాత్రలు, ర్యాలీలు నిర్వహించారు. రాస్తారోకోలు చేశారు.
పవన్ గడ్డి బొమ్మలు, ఫ్లెక్సీలు, చిత్రపటాలకు చెప్పుల దండలు వేసి మానవ హారాలు నిర్వహించారు. అనకాపల్లి జిల్లా బుచ్చెయ్యపేట మండలం వడ్డాది నాలుగు రోడ్ల జంక్షన్‌లో వలంటీర్లు మానవహారంగా ఏర్పడి పవన్ కళ్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పవన్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి నిరసన తెలిపారు. గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో వలంటీర్లు ర్యాలీ జరిపి, ప్రధాన రోడ్డులో మానవహారం నిర్వహించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో ర్యాలీ నిర్వహించి, పవన్ కళ్యాణ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో పవన్ దిష్టిబొమ్మకు చెప్పులు వేసి శవయాత్ర నిర్వహించారు. అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం, వేంపల్లె, చింతకొమ్మదిన్నె తదితర ప్రాంతాల్లో వలంటీర్లు ర్యాలీ చేసి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అన్న మయ్య జిల్లా తంబళ్లపల్లె, రామాపురం గ్రామాల్లో నిరసనలు జరిగాయి. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ నిరసనలు కొనసాగాయి.
కాకినాడలో ఆత్మగౌరవ సభ
కాకినాడ సూర్యకళా మందిరంలో వలంటీర్లంతా గురువారం ఆత్మగౌరవ సభ నిర్వహించి పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని ఘాటుగా హెచ్చరించారు. తమ మనోభావాలు దెబ్బతినేలా మరోసారి వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. వలంటీర్లకు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో వలంటీర్లు రాస్తారోకో చేశారు. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్.పైడిపాల సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కాజులూరు మండలం గొల్లపాలెంలో మానవహారం నిర్వహించి దిష్టిబొమ్మతో శవ యాత్ర చేశారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం పినపళ్లలో నిరసన వ్యక్తం చేశారు.