ప్రైవేటుకు దోచిపెట్టేద్దాం.. | Conspiracy to privatize public wealth | Sakshi
Sakshi News home page

ప్రైవేటుకు దోచిపెట్టేద్దాం..

Jun 7 2026 5:25 AM | Updated on Jun 7 2026 5:25 AM

Conspiracy to privatize public wealth

పీపీపీ ముసుగులో చంద్రబాబు కుతంత్రం

ప్రజా సంపదను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర 

ప్రైవేటీకరణ బాటలో పట్టణ పౌర సేవలు 

ప్రజా సేవలకు చేసే వ్యయాలు వారి నుంచే వసూలు 

నీళ్లు, పారిశుద్ధ్యంపై ప్రజలపైనే అదనపు భారం 

యూజర్‌ చార్జీల పేరుతో ప్రజల జేబులకు చిల్లు 

ప్రజా సేవలపై కాంట్రాక్టర్ల పెత్తనానికి పచ్చజెండా 

పీపీపీ ద్వారానే ఆస్తుల విక్రయం.. లీజు వ్యవహారాలు  

కాంట్రాక్టర్లకు భరోసాపై ప్రత్యేక దృష్టి 

ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పుకునే విధాన రూపకల్పన.. పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలకు మార్గదర్శకాలు జారీ    

అమరావతి: పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రైవేట్‌ సంస్థల చేతుల్లో పెట్టే దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  ఇక పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ)తో చేపట్టాలని నిర్ణయించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్‌ వంటి కీలక సేవలకు చేసే వ్యయాలను యూజర్‌ చార్జీల రూపంలో ప్రజల నుంచే వసూలు చేయాలని నిర్ణయించింది.  మరోవైపు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ప్రభుత్వ ఆస్తులను, భవనాలను, రహదారులను, బస్టాండ్లను, ఆడిటోరియంలు, తదితర కీలక వ్యాపార కేంద్రాలను పీపీపీ పేరుతో ప్రైవేట్‌ రంగానికి అప్పగించాలని వ్యూహ రచన చేసింది. 

ప్రస్తుతం వినియోగంలో ఉన్న వినియోగంలో లేని ఆస్తులను ప్రైవేట్‌ సంస్థకు, వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఆదాయ వనరులను సృష్టించాలని నిర్ణయించారు.  ఈ మొత్తం వ్యవహారంలో కాంట్రాక్టర్లకు పూర్తి భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేయడం కొసమెరుపు. ఈ మేరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టేందుకు  పీపీపీ విధానంలో మార్గదర్శకాలను మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ జారీ చేసింది. మార్గదర్శకాల్లో కీలకాంశాలు..  

భారీ లోటు.. తప్పట్లేదు 
రాష్ట్రంలో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వివిధ ఉప రంగాలలో సుమారు రూ. 45,000 కోట్ల ఆర్థి క లోటు ఉంది.  రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా ఈ లోటు మరింత పెరిగే అవకాశం ఉంది.  పట్టణ మౌలిక సదుపాయాల లోటును పూడ్చడానికి ప్రైవేట్‌ రంగ మూలధనాన్ని సమీకరించడం, సామర్థ్యాలను పెంచడం వంటి ప్రత్యామ్నాయ ఆర్థి క విధానాలను అనుసరిస్తున్నాం. 

ఇందులో భాగంగా  నీటి సరఫరా–వనరుల నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వ­హణ, మురుగునీటి పారుదల– నిర్వహణ, నగర రహదారుల మెరుగుదల–అభివృద్ధి, మెట్రో రైలుతో సహా సామూహిక రవాణా, నగర వృద్ధి కేంద్రాలు, కమాండ్‌ –కంట్రోల్‌ సెంటర్, విపత్తు నిర్వహణ, గృహవసతి, ఆస్తుల పునరాభివృద్ధి, పార్కులు, బహిరంగ, ప్రజా స్థలాలు–పౌర సౌకర్యాలు, వినోదం, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, ప్రజా సౌకర్యాలు–మౌలిక సదుపాయాలు, పౌర సేవలు (పురపాలక భాగస్వామ్య సేవలు), వీధి దీపాలు తదితర వాటిని పీపీపీ విధానంలో చేపట్టనున్నాం’ అని ప్రభుత్వం చెబుతోంది.  

ఆదాయ వనరుల సృష్టి పేరుతో అడ్డదారులు  
వినియోగంలో ఉన్న ఆస్తుల విలువను పెంచడానికి, అలాగే వినియోగంలో లేని ఆస్తులను గుర్తించి పీపీపీ ద్వారా వాటిని విక్రయించడం, లీజుకు ఇవ్వడం ద్వారా స్థానిక సంస్థలకు ఆదాయ వనరులను సృష్టించనున్నారు. ఖాళీ భూములను పీపీపీలో విక్రయించడం లేదా లీజుకు ఇవ్వడం  ద్వారా ఆదాయం రాబట్టనున్నారు. ప్రాజెక్ట్‌ స్వభావాన్ని బట్టి భూములను లీజు, లైసెన్స్,  రాయితీ, హక్కు మార్గం, లేదా మరే ఇతర పద్ధతిలోనైనా చేపట్టనున్నారు. పాత వాణిజ్య భవనాలను పీపీపీలో అభివృద్ధి చేయనున్నారు. 

శిధిలావస్థలో ఉన్న, నిర్మాణాలను ప్రైవేట్‌ రంగం ద్వారా అభివృద్ధి చేయనున్నారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలోని  బస్‌ స్టాండ్‌లు. బస్‌ బేలను ప్రైవేట్‌ భాగస్వామి ద్వారా వాణిజ్య అభివృద్ధి కోసం ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకునే ఎంపికతో పునరాభివృద్ధి చేయనున్నారు. ఉపయోగంలో లేని కార్యాలయ భవనాలను వాణిజ్య పునరాభివృద్ధి కోసం రాయితీపై ప్రైవేట్‌ భాగస్వామికి అప్పగించనున్నారు.

కాంట్రాక్టర్లకు  ప్రభుత్వ భద్రత  
ఆదాయేతర సేవలతో సహా పట్టణ రంగాలన్నింటిలో ప్రైవేట్‌ రంగ భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను సమీకరించాలని నిర్ణయించడం జరిగింది.   వాస్తవ ఖర్చులను ప్రతిబింబించేలా పట్టణ వినియోగ సేవలకు వినియోగ దారుల చార్జీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. పీపీపీ కాంట్రాక్టర్లకు భరోసా కల్పించడంతో పాటు చెల్లింపుల కోసం వివిధ పౌర సేవల నుంచి వచ్చే ఆదాయాలను ప్రత్యేక ఎస్క్రో ఖాతాలలోకి చేర్చనున్నారు.

అలాగే ఆస్తుల నగదీకరణ (మోనటరైజేషన్‌) ప్రాజెక్టుల నుంచి వచ్చే ఆదాయాలను కూడా ఎస్క్రో ఖాతాలలోకి చేర్చనున్నారు. పీపీపీలో ప్రైవేట్‌ రంగానికి, ఈ రంగానికి సంబంధించి రుణదాతలను గౌరవించేలా.. వారికి భరోసా ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేయనున్నారు. పీపీపీ కాంట్రాక్టర్లకు రాజకీయపరమైన నష్టాలు లేకుండా చూసేందుకు ఎ్రస్కోలు, పట్టణ సంస్థల గ్రాంట్లు, రాబడులపై లీన్, అండర్‌రైటింగ్‌ లేఖ ద్వారా ప్రభుత్వ భద్రత కల్పిస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement