'పరిషత్'‌ ఎన్నికలపై ముగిసిన వాదనలు

Concluded Arguments On Parishad Elections In AP High Court - Sakshi

సుప్రీం కోర్టు నిర్ణయాన్ని ప్రశ్నించే అవకాశం పిటిషనర్లకు లేదన్న ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది

ఎన్నికలను ఏ రకంగానూ అడ్డుకోవడానికి వీల్లేదన్న అడ్వొకేట్‌ జనరల్‌

మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వాయిదా వేసిన హైకోర్టు

మంగళవారం ఉత్తర్వులు వెలువరించే అవకాశం

సాక్షి, అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచీ ప్రారంభించాలని, ఇందుకోసం తిరిగి ఎన్నికల నోటిఫికేషన్‌ను జారీ చేసేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని కోరుతూ టీడీపీ, బీజేపీ వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాల్లో వాదనలు ముగిశాయి. గత ఏడాది మార్చి, మే నెలల్లో జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించిన తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు ఎన్నిక తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల నియమావళిని అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న అభ్యర్థనలతో ఆ రెండు పార్టీలు దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలపై హైకోర్టు తన నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఇదే సమయంలో జనసేన దాఖలు చేసిన వ్యాజ్యంలో పూర్తి వివరాల సమర్పణకు ఎన్నికల కమిషన్‌ న్యాయవాది వివేక్‌ చంద్రశేఖర్‌ గడువు కోరడంతో న్యాయస్థానం అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీలైన పక్షంలో మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించేందుకు ప్రయత్నిస్తానని న్యాయమూర్తి తెలిపారు. 

‘సుప్రీం’ నిర్ణయాన్ని ఎలా ప్రశ్నిస్తారు
ఎన్నికల కమిషన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఏపీ పంచాయతీరాజ్‌ ఎన్నికల నిర్వహణ నిబంధనల్లోని రూల్‌–7 ప్రకారం పరిస్థితులను బట్టి ఎన్నికల కార్యక్రమాన్ని మార్చే, రీ నోటిఫై చేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఉందన్నారు. దీనికి లోబడే కమిషన్‌ వ్యవహరిస్తోందని తెలిపారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించిందని, ఏ దశలో అయితే ఆగిపోయాయో అక్కడి నుంచి ఎన్నికలు కొనసాగించాలని చెప్పిందన్నారు. కాబట్టి ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. గత ఏడాది జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఏకగ్రీవాలు జరిగాయని, అభ్యర్థులందరికీ చట్ట ప్రకారం ఫాం–10 కూడా జారీ చేశామని చెప్పారు.

ఇప్పుడు మొదటి నుంచీ ఎన్నికలు నిర్వహించాలంటే వారంతా నష్టపోతారని, అలాగే న్యాయపరమైన సమస్యలు కూడా వస్తాయని వివరించారు. న్యాయమూర్తి స్పందిస్త.. ఎన్నికలు వాయిదా వేస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చిన నాటినుంచి ఇప్పటివరకు ఎంతో మందికి ఓటు హక్కు వచ్చిందని, తాజాగా నోటిఫికేషన్‌ ఇస్తే వారంతా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కదా అని ప్రశ్నించారు. అలా అయితే ఎప్పటికీ ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని మోహన్‌రెడ్డి చెప్పారు. కొత్త ఓటర్లు వస్తూనే ఉంటారని, వారి కోసం ఎన్నికలను ఆపడం సరికాదన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రస్తావిస్తూ.. ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, అలాంటప్పుడు ఆయన హైకోర్టుకు వచ్చి మిగిలిన వారి తరఫున ఉత్తర్వులు కోరలేరని ఎస్‌ఈసీ తరఫు న్యాయవాది తెలిపారు. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యం ప్రజా ప్రయోజనాల కిందకు వస్తుందని, దాన్ని ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని చెప్పారు. 

ఎన్నికల వల్ల వ్యాక్సినేషన్‌ ఉధృతంగా సాగడం లేదు
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికలు ఉండటం వల్ల కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉధృతంగా సాగడం లేదన్నారు. ఎన్నికలు ముగిస్తే భారీ స్థాయిలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. కేవలం 5–6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని, అందువల్ల ఎన్నికలను ఏ రకంగానూ అడ్డుకోవడానికి వీల్లేదన్నారు. వర్ల రామయ్య తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది పి.వీరారెడ్డి, జనసేన తరఫున జి.వేణుగోపాలరావు వాదనలు వినిపించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top