 
													సీఎంవో ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సోదరుడి కబ్జా కాండపై కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
శ్రీకాకుళం జిల్లా సైరిగాంలో చెరువుల దురాక్రమణ
అధికారం అండతో టీడీపీ నేత శ్రీనివాసరావు ఆగడాలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:  తమ్ముడు.. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నతాధికారి!  
అన్న.. అసలే టీడీపీ నాయకుడు.. ఆపై అండగా అధికారం! ఇక ఆగడాలకు అడ్డేముంది?  
అచ్చెప్ప చెరువు... శోభనాద్రి చెరువు.. ఉప్పరవానిబంద చెరువు.. పాపమ్మ కోనేరు.. భూసమ్మ చెరువు, మంగళివాని చెరువు.. గాది బంద..! చేంతాడు లాంటి ఈ చెరువుల జాబితా ఏమిటనుకుంటున్నారా..? ఇవేవో శ్రీకృష్ణదేవరాయలు తవ్వించిన చెరువుల పట్టిక కాదు!! సీఎం చంద్రబాబు కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర సోదరుడు, టీడీపీ నేత శ్రీనివాసరావు వరుసబెట్టి చెరువులను కబ్జా చేసి కలిపేసుకోవటంపై గ్రామస్థులు గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. 
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం జలుమూరు మండలం సైరిగాంలో ముద్దాడ శ్రీనివాసరావు వరుసగా చెరువుల ఆక్రమణకు పాల్పడుతున్నట్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముద్దాడ రవిచంద్ర పేరు చెప్పి బెదిరింపులకు దిగుతున్నట్లు తెలిపారు. చెరువులను ఆక్రమించడంతో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అక్రమంగా మట్టి తవ్వకాలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. న్యాయస్థానం తీర్పులకు విరుద్ధంగా గ్రామం సమీపంలో ఉన్న భూసప్ప కోనేరు వద్ద పశువుల తొట్టెలు నిరి్మస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.
రక్షించండి.. 
ప్రభుత్వ చెరువులను రక్షించాలని అధికార యంత్రాంగాన్ని కోరుతున్నా. ముద్దాడ శ్రీనివాసరావు సోదరుడు రవిచంద్ర ఉన్నతాధికారి కావడంతో యంత్రాంగం అడ్డు చెప్పలేక పోతోంది. చాలా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి. పేదలకో న్యాయం పెద్దలకో న్యాయం సరికాదు. – ధర్మాన అనిత, సర్పంచ్,  సైరిగాం
పేదలపై ఎందుకీ వివక్ష? 
నాకున్న 20 సెంట్లలో ఆక్రమణలు ఉన్నాయంటూ పొలంలో తవ్వకాలు జరిపి నా కడుపు కొట్టారు. అదే ముద్దాడ శ్రీనివాసరావు తన తమ్ముడి పేరు చెప్పి చాలా వరకూ చెరువులను ఆక్రమించాడు. పేదలపై ఎందుకీ వివక్ష?  – ముద్దాడ సింహాచలం. రైతు, సైరిగాం
నేనేం తప్పు చేయలేదు.. 
నేను తప్పు చేయలేదు. ఊరుగుండం చెరువులో ఆక్రమణలు తొలగించాం. ఆస్పత్రి ఎదురుగా అచ్చెప్ప కోనేరు అభివృద్ధి కోసం మట్టి వేశా. మా గ్రామస్తులు కొంత మంది నేను ఏదో చేస్తున్నానని ఊహించుకుని బురద జల్లుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే నిరూపించండి. – ముద్దాడ శ్రీనివాసరావు (రవిచంద్ర సోదరుడు), సైరిగాం గ్రామం  
నివేదిక ఇవ్వాలని ఆదేశించాం.. 
క్షేత్ర స్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించాం. ఇప్పటికే నేను వెళ్లి పరిశీలించా. నివేదిక వచ్చాక ఆక్రమణలు ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. – జె.రామారావు, తహసీల్దార్, జలుమూరు. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
