నంద్యాల జిల్లా: ఉరుకుపరుగుల జీవితాలు.. ఇంట్లో నలుగురు ఉన్నా కలసి తీనేదెప్పుడో. అందరూ ఉన్నా టీవీ చూస్తూ.. ఫోన్ మాట్లాడుతూనే భోజనం పూర్తి చేసేవారందరో ఉన్నారు. రుచి ఎరుగరు.. కబుర్లు ఉండవు. మరి కొందరు ఆకలేస్తే అప్పటికప్పుడు ఆన్‌లైన్ ఆర్డర్లు తెప్పించుకోవడం తినేయడం జరుగుతోంది. కానీ పంట పొలాల్లో కూలీలు తమ కష్టాన్ని మైమరిచి కాసేపు కబుర్లు చెప్పుకుంటూ.. రుచులు పంచుకుంటూ భోజనం ఆరగించే దృశ్యాలే కమనీయమే.

పచ్చడి అన్నమైనా సరే ఆ రుచే వేరు. ప్రస్తుతం మిరప, కంది, సీడుపత్తి, పప్పు శనగ, తదితర పంట పొలాల్లో కలుపులు, పండు మిరపకాయల కోతలు కొనసాగుతున్నాయి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, చింతకుంట్ల, రుద్రవరం, సంజామల, తదితర గ్రామాల నుంచి మహిళా వ్యవసాయ కూలీలు మండలంలోని పలు గ్రామాలకు ట్రాక్టర్లు, ఆటోల్లో చేరుకుంటున్నారు. ఉదయానే వస్తూ వెంట సద్దులు తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్నం వేళ అందరూ ఒక చోట చేరి సద్దులు (క్యారేర్లు) తిని కాస్త సేద తీరి ఆ వెంటనే పనుల్లోకి వెళ్లిపోతున్నారు.


