సీఎం జగన్‌కు పీఆర్సీ నివేదిక అందజేసిన కమిటీ

Committee Submitted The PRC Report To CM YS Jagan - Sakshi

AP PRC Report 2021: సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌) శశిభూషణ్‌ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్‌ కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్‌ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ ప్రస్తావించింది.

చదవండి: Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్‌’ బ్లో అవుట్‌.. రాజీనామాల బాట 

‘‘2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు. 2020-21 నాటికి వ్యయం రూ.67.340 కోట్లు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం. 2020-21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయంలో 2018-19లో 32 శాతం.. 2020-21 నాటికి 36 శాతానికి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమేనని’’  కమిటీ పేర్కొంది.

‘‘రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో కేవలం రూ.1,70,215 మాత్రమే. రూ.6,284 కోట్ల విద్యుత్‌ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాలి. రెవెన్యూ లోటు కింద రూ.18,969 కోట్లు కేంద్రం ఇవ్వాలి. కోవిడ్‌ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్‌ కారణంగా రూ.20వేల కోట్ల అదనపు భారం పడింది. కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. 2019, జులై 1న 27 శాతం ఐఆర్‌ ఇచ్చింది. ఐఆర్‌ రూపేణా ఉద్యోగులకు రూ.11,270 కోట్లు, పెన్షన్లకు రూ.రూ.4,569 కోట్లు చెల్లించాం.

అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు సహా వివిధ కేటగీరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచాం. 3,01,021 ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచింది. జీతాల రూపంలో ప్రభుత్వ ఖర్చు రూ.1198 కోట్ల నుంచి రూ.3187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్‌ సహా ఇతర ప్రయోజనాలు కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల పరిహారం అమలు చేస్తోంది. ఏపీఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. 2020, జనవరి నుంచి అక్టోబర్‌ 2021 వరకు ప్రభుత్వంపై రూ.5380 కోట్ల పడిందని’’ కమిటీ పేర్కొంది.

పరిపాలనా సంస్కరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ.2300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బందిని నియమించాం. దీని వల్ల అదనంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ.820 కోట్ల భారం. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం అప్కాస్‌ను ప్రారంభించారు. అప్కాస్‌ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2040 కోట్ల భారం పడిందని’’ కమిటీ  నివేదికలో పేర్కొంది.

ప్రభుత్వంపై 8వేల నుంచి 10వేల కోట్లు భారం: సీఎస్‌
ముఖ్యమంత్రికి పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తెలిపారు. అనేక  అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి 10వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11  ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్‌ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top