ఉద్యోగులకు భద్రత కల్పించేలా ‘జీపీఎస్‌’

Committee of Ministers meeting with trade unions Andhra Pradesh - Sakshi

కనీస పెన్షన్, బీమా, రిటైర్‌ అయ్యాక ఈహెచ్‌ఎస్‌ లాంటి సౌకర్యాలు  

ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

పెన్షన్‌ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం 

ఉద్యోగ సంఘాలతో సమావేశంలో మంత్రుల కమిటీ

సాక్షి, అమరావతి: ఉద్యోగుల భవిష్యత్తు గురించి ఎంతో ఆలోచించిన తర్వాతే గ్యారంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(జీపీఎస్‌) తెస్తున్నట్లు మంత్రుల కమిటీ తెలిపింది. ఉద్యోగుల పెన్షన్‌ ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కమిటీ స్పష్టం చేసింది. బుధవారం  వెలగపూడిలోని సచివాలయంలో ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) అంశంపై మంత్రుల కమిటీ సభ్యులైన బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమయ్యారు.

సీపీఎస్‌ కంటే మెరుగ్గా జీపీఎస్‌ను తెస్తున్నామని, ఇది ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించేలా ఉంటుందని వివరించారు. ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్‌)చిరంజీవి చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌.గుల్జార్, జీఏడీ కార్యదర్శి (సర్వీసెస్, హెచ్‌ఆర్‌) హెచ్‌.అరుణ్‌ కుమార్,  ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవోల అసోసియేషన్‌ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ, పలు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. 

చట్టపరమైన సదుపాయాలు: బుగ్గన 
జీపీఎస్‌ విధానంలో హామీ పింఛను, హామీ కుటుంబ భద్రత, హామీ కనీస పింఛను–ఆరోగ్య భద్రత, ప్రమాదవశాత్తు మరణం–వైకల్య బీమా సౌకర్యాన్ని చట్టపరంగా కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. ఈ విధానాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆమోదాన్ని తెలపాలని కోరారు.  

మరోసారి చర్చలు : బొత్స  
జీపీఎస్‌పై పలు దఫాలుగా ఉద్యోగులతో చర్చించామని, ఫైనల్‌ అయ్యాక దానికి చట్ట బద్ధత కల్పిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తుది డ్రాఫ్ట్‌ గురించి  ఉద్యోగులకు వివరించామని చెప్పారు. రిటైర్‌ అయ్యాక గ్యారంటీగా కనీసం రూ.10 వేలు పెన్షన్‌ ఉండేలా మార్పు చేశామన్నారు. పెన్షనర్‌ చనిపోతే భార్య లేదా భర్తకు పెన్షన్‌ వస్తుందని, హెల్త్‌ కార్డులు కూడా ఉంటాయని చెప్పారు. ఉద్యోగులతో మరోసారి చర్చలు జరుపుతామన్నారు. వారిపై పెట్టిన కేసుల ఎత్తివేతపై సీఎంతో చర్చిస్తామన్నారు. గురుకులాలు, యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

వారికి బుద్ధి ఉండాలి 
సీఎం సతీమణి గురించి మాట్లాడేవారికి బుద్ధి ఉండాలని మంత్రి బొత్స ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏదైనా ఉంటే రాజకీయంగా పోరాడాలన్నారు. ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడటం నీచమన్నారు.  

ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం: సజ్జల 
ఉద్యోగులపై ప్రేమ ఉండబట్టే వారి భవిష్యత్తుకు భద్రత కల్పించేలా జీపీఎస్‌ తెస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలని కోరారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భద్రత కల్పించేలా ఉన్నంతలో బెస్ట్‌ ప్యాకేజీగా జీపీఎస్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. పాత పెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయడం రాష్ట్రానికి విపత్తు లాంటిదని చెప్పారు.

జీపీఎస్‌ రూపకల్పన చర్చల్లో సీఎం జగన్‌ నేరుగా పాల్గొని సూచనలు, సవరణలు చేశారని తెలిపారు. జీపీఎస్‌ కూడా భారమని ఆర్థిక నిపుణులు చెప్పినా, ఉద్యోగులకు కనీస భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతని భావించినట్లు చెప్పారు. దీనిపై ఇంకా ఏమైనా మెరుగ్గా చేయగలమా... అనే అంశాలపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాలను ఆహ్వానించినట్లు పేర్కొన్నారు.  

కనీస పింఛన్‌ రూ.10 వేలు, ఉద్యోగం చేస్తూ చనిపోతే బీమా, అతి తక్కువ బేసిక్‌ ఉన్న వారికి రూ.50 లక్షలు, ఎక్కువ బేసిక్‌ ఉన్న వారికి కొంత తక్కువ బీమా కవరేజీ ఉంటుందన్నారు. ఉద్యోగి చనిపోయినా, అంగవైకల్యానికి గురైనా ఆ కుటుంబానికి అండగా ఉండేలా బీమా, పెన్షన్‌ పొందుతున్న వ్యక్తి చనిపోతే భార్యకు 60 శాతం పెన్షన్, ప్రస్తుతం ఉద్యోగులకు ఉన్న ఈహెచ్‌ఎస్‌ను రిటైర్‌ అయ్యాక కూడా కొనసాగించడం లాంటివి జీపీఎస్‌లో ఉన్నాయన్నారు. సీఎం జగన్‌ అవకాశవాదంతో ఆలోచించే వ్యక్తి కాదు కాబట్టే, ఉద్యోగులకు మేలు చేసేందుకు అన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారని తెలిపారు. నిజంగా ఉద్యోగుల ప్రయోజనాలను ఆకాంక్షిస్తుంటే ఉద్యోగ సంఘాలు చర్చలకు రావాలని సూచించారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top